.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

భీష్మ పర్వము – 12 మూడవ రోజు యుద్ధం – ii



భీష్మ పర్వము – 12

మూడవ రోజు యుద్ధం – ii



అర్జునుడు తన ఎదుటికి రాగానే భీష్ముడు అర్జునుని రధానికి కట్టిన హయముల మీద, అర్జునుని మీద, శ్రీకృష్ణుని మీద శరములు సంధించాడు. తన మీద బాణములు వేసిన భీష్ముని మీద శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు. అది చూసిన అర్జునుడు భీష్మునిపై ఒకే బాణం సంధించి అతని విల్లును విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకుని కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించి నొప్పించాడు. కృష్ణుడు చిత్రవిచిత్ర రీతుల రధాన్ని నడుపుతూ భీష్ముడి ఆ బాణముల బారి నుండి అర్జునుడిని తప్పిస్తూ వచ్చాడు. అర్జునుడు కూడా భీష్మునిపై క్రూరమైన బాణములు విడిచాడు. శ్రీకృష్ణుడు బాగా అలసి పోయాడు. బాగా గాయపడిన అర్జునుని చూసి ఇలా అనుకున్నాడు “పాండవ సైన్యం భీష్ముని ధాటికి ఆగలేక పోతున్నాయి. అర్జునుడు బాగా గాయపడ్డాడు. పరిస్థితి ఇలా కొనసాగితే దుర్యోధనుని సమస్త కోరికలు భీష్ముడు ఈ రోజే నెరవేర్చగలడు. కేకయరాజులు, పాంచాలురు, యాదవులు పారి పోతున్నారు. కౌరవ సేనలు ఉన్మాదంతో ఊగి పోతున్నారు. ఇక ఉపేక్షించి లాభం లేదు భీష్ముని వధించి ధర్మ తనయుని గెలిపిస్తాను” అన్నాడు. ఇంతలో భీష్ముడు అర్జునునిపై శరవర్షం కురిపించాడు. అర్జునుడు శరసంధానం చేయలేక పోతున్నాడు. ఇది గమనించిన కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్క సారిగా అర్జునుని వైపు తమ రధాలను మరల్చారు. సాత్యకి తన గజ బలమును అర్జునునికి సాయంగా నిలిపాడు. సాత్యకి పాండవ సేనలను చూసి “ఎందుకు పారి పోతున్నారు? మీరు పలికిన పలుకులు మరిచారా? భీష్ముడు మనలను ఏమి చేయలేడు. కౌరవ సేనలను నరకండి తరమండి” అంటూ ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు “సాత్యకీ! పారిపోయే పిరికి వారిని ఎందుకు ఆపుతావు? ఈ రోజు నేను భీష్ముని చంపి ద్రోణుని పని పడతాను. కౌరవ సైన్యాలను నాశనం చేసి ఈ నాలుగు సముద్రముల నడుమ ఉన్న రాజ్యమంతా పాండు తనయునకు కట్టబెడతాను” అని పలికాదు. వెంటనే సుదర్శన చక్రాన్ని మనసులో తలచుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది. పగ్గములను నొగల మీద పెట్టి కట్టు పంచ జారుతున్నా లక్ష్యపెట్టక కోపంతో రగిలి పోతూ భీష్ముని పైకి లంఘించాడు. “కౌరవ సేనలు నిశ్చేష్టులై చూస్తూ ఊరక ఉన్నారు. భీష్ముడు పారవశ్యంతో రథం దిగి శ్రీకృష్ణునికి ఎదురు వెళ్ళి “కృష్ణా! రావయ్యా! నన్ను సంహరించి కృతార్ధుడిని చెయ్యి” అని చేతులు జోడిస్తూ ప్రార్ధించాడు. ఇది చూసిన అర్జునుడు రథం దిగి శ్రీకృష్ణుని వెనుక నుండి పట్టుకున్నాడు. కానీ శ్రీకృష్ణుని బలానికి ఆగలేక చతికిల పడి తిరిగి లేచి శ్రీకృష్ణుని గట్టిగా పట్టుకుని “కృష్ణా! నీ కోపం వదలవయ్యా. యాదవులకు పాండవులకు నీవే దిక్కు. నీవే ఇలా అధైర్య పడి అలిగిన పాండు పుత్రుల అందునా ధర్మతనయుని ధైర్యం, పరాక్రమం, వీర్యం ఏమి కావాలి? లోక నాయకా శాంతించ వయ్యా! నీ సాయంతో కౌరవ సేనను రూపు మాపుతాను. నాకు అపకీర్తి తీసుకు రాకయ్యా” అని ప్రార్ధించగా శ్రీకృష్ణుడు శాంతించి కోపం ఉపసంహరించి తిరిగి రథం ఎక్కి పగ్గములు చేత పట్టాడు. కృష్ణార్జునులు పాచజన్య దేవదత్తములు పూరించారు.




కృష్ణార్జునుల శంఖారావం విన్న భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్క సారిగా అర్జునునిపై శక్తి, గదా, తోమరములు ప్రయోగించారు. అర్జునుడు వాటిని అన్నింటిని ఒక్కసారిగా తుంచి వేసి వారిపై ఇంద్రాస్థాన్ని ప్రయోగించాడు. ఇంద్రాస్త్రం కౌరవ సేనలను అనేక విధాలుగా నాశనం చేసింది. అర్జునుడు భీష్మునిపై అతి క్రూరమైన బాణములు వేసాడు. భూరిశ్రవుని విల్లు విరిచాడు. తొమ్మిది బాణములను శల్యునిపై సంధించాడు. పాంచాల విరాట సైన్యాలు అక్కడకు చేరాయి. అర్జునుని పరాక్రమం చూసి కౌరవ సేన బెదిరి పోయింది. కౌరవులు అందరూ కలసి అర్జునుని రధమును చుట్టుముట్టారు. ఇంద్రాస్త్రము నుండి వెదజల్లబడుతున్న తాపానికి కౌరవ సేనలు చాప చుట్టలా పడి పోతున్నాయి. హయములు, రధములు, ఏనుగులు కూలి పోతున్నాయి. ఆయుధములు, చామరములు, కేతనములు, ఛత్రములు తుక్కు తుక్కుగా అయినాయి. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తములు పూరించి సింహనాదం చేసారు. అర్జునుని ధాటికి ఆగలేని కౌరవ సేన ఆరోజుకు యుద్ధాన్ని ఆపి తమ నివాసములకు చేరుకున్నాయి. వంధిమాగదులు పాండవుల విజయానికి కీర్తిస్తుండగా పాండవ సేనలు తమ నివాసములకు చేరాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML