.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

తత్వం - తత్త్వవిత్ – ఏకాత్మా

 తత్వం - తత్త్వవిత్ – ఏకాత్మా

మన ఆళ్వారులు, నాయనారులు వారి పుణ్యమాయని తమిళభాషలో భక్తి గ్రంథాలను పుష్కలంగా రచించి మన కిచ్చిపోయినారు, వారు తీర్థయాత్రలుచేస్తూ, దివ్యస్థలములందు భక్తిపారవశ్యంతో పరమేశ్వరుని కీర్తించారు. మహరుల తపశ్చరణముచే పవిత్రములైనతీర్థములను, క్షేత్రములనుసేవించు కోవాలనే తలంపేగాని, ఒకరికి ఉపదేశించాలనీ, మత ప్రచారం చేయాలనీ వారు అనుకోలేదు.

మనదేశంలో 108 విష్ణుక్షేత్రాలున్నవి. ఇక శివక్షేత్రాలకు లెక్కేలేదు. భక్తిరసపానమత్తలైన, ఈ యాళ్వారులు, నాయనారులు ఆయాక్షేత్రములలో ఈశ్వరదర్శనంచేసి కండ్లవెంట ఆనందబాష్పములుకురుస్తూ పరమభక్త్యావేశంతో భగవత్కీర్తనం చేశారు. ఒక్కచోటనే కూర్చుంటే కామక్రోధాది సంసర్గం కలుగుతుందేమో అనేభయంకొద్దీవారు నిరంతరంగా తీర్థాటనచేస్తూ, ఒక్కొక్కచో ఒక్కొక్కరూపంతో వెలసిన స్వామికి గానరూపంగా హదృయాల నర్పించుకున్నారు.
పరమేశ్వరుని ఒక్కపేరుతో పిలిస్తే ఈభక్తులకు తృప్తి ఉండేదికాదు. వారిలో ఒక మహనీయుడు ''పేరాయిరం పరవి కానర్ యెట్టుం పెరుమానె'' అన్నాడు. ఈశ్వరునకు వేయి నామాలున్నవట. వేయి అనగా అనంతంగా అనిఅభిప్రాయం. మహాభారతంలో మనకు విష్ణుసహస్రనామస్తోత్రం. శివసహస్రనామ స్తోత్రం కనిపిస్తవి. మొదటిదానిని వ్యాసుడు, రెండవ దానిని ఉపమన్యుడు రచించారు. విష్ణుసహస్రనామాలలో –

'తత్త్వం, తత్త్వవిత్ ఏకాత్మా జన్మ మృత్యు జరాధిగః' అనే పంక్తి ఒకటి వున్నది. ఈ పేళ్ళుఅలవోకగా గుచ్చి యెత్తినవికావు. వీటిలో ఒకసార్ధక్యం గోచరమవుతుంది. ఈశ్వరుడు తత్త్వము - అనగాపరతత్త్వమనీ, పరబ్రహ్మమనీ అర్థం. తత్త్వమగు ఆ ఈశ్వరుడు తత్త్వివిత్తుకూడాను అంటే బ్రహ్మవేత్తయని తాత్పర్యం. బ్రహ్మమును తెలుసుకొన్నవాడు బ్రహ్మమేఅవుతాడనిఉపనిషత్తు చెపుతున్నది. కనుక తత్త్వము, తత్త్వవిత్తు ఏకాత్మగా గ్రహించాలి ఆత్మఅనేది ఒక్కటేగాని రెండుకాదు. కాబట్టి తత్త్వము. తత్త్వవిత్తు ఏకమని తెలిసికొంటే జన్మ మృత్యు జరాదులు లేని ముక్తావస్థ లభిస్తుంది. జన్మమృత్యు జరాతీతమైన ఈశ్వరునిస్థితియే జీవునకు దొరకుతుందని తాత్పర్యం. ఏకము, అద్వయము అయినపరతత్త్వమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే తత్త్వవిత్తు, ఏకాత్మ అని గ్రహించాలి.

అద్వయతత్త్వ సారాంశం ఈనాలుగునామముల్లో ఇంత చక్కగా సంగ్రహింపబడింది. ఈపరతత్త్వమును తెలియ జెప్పుటకే విష్ణునామములిట్లుగుదిగ్రుచ్చబడినవి. పాణినిసూత్రములు గూడా అర్థములను, శబ్దములను ఇట్లే సంగ్రహిస్తవి. ఒక సూత్రంలో నుంచి ఇంకోసూత్రం మొలుచుకువచ్చినట్లు వుంటవి. లలితా సహస్రనామస్తోత్రముగూడా ఇటువంటిదే.                       

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి

కామ విజయానికి.. కాల నిగ్రహానికి..
03-03-2018  ఆంధ్రజ్యోతి సేకరణ.
🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

మహాకవి కాళిదాసు ‘రఘువంశం’ అనే కావ్యంలో రాసిన మంగళ శ్లోకమది. ఈ లోకానికి మాతాపితరులు పార్వతీపరమేశ్వరులని ఆ మహాకవి అన్నాడు. వాక్కు, అర్థము ఎలా ఒకదానితో మరొకటి వదలక చేరి ఉన్నవో.. అట్లే పార్వతీపరమేశ్వరులు ఒకరినొకరు వదలక జగన్మాతా, జగత్పితలై ఉన్నారని, వారికి వందనాలని కాళిదాస మహాకవి మంగళాచరణం చేశాడు. ఇదే అర్ధనారీశ్వర తత్వం. మనకందరికీ చావుపుట్టుకలున్నాయని తెలుసు. పుట్టుకకు కారణం కామం. చావుకు కారణం కాలుడు. కామకారణంగా కల్గిన వస్తువు కాలగ్రస్తమై నశిస్తోంది. ఈ రెంటినీ జయించాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్లాలి. మన్మథుని దృష్టిమాత్రమున దగ్ధమొనర్చినవానికి, కాలుని (యముడిని) కాలదన్నిన కాలకాలునికి ఉత్పత్తి వినాశనాలు లేవు. ఆయన ప్రసాదం ఉంటే.. మనకూ పుట్టుట, గిట్టుట ఉండదు. మరి పరమేశ్వరుడొక్కడు చాలడా? అంబిక కూడా కావాలా? అంటే.. కావాలి. ఈశ్వరుడు కామనిగ్రహం చేసింది లలాటనేత్రంతో. అర్ధనారీశ్వర ప్రకృతులగు వీరికి మూడవకన్ను ఉమ్మడి. అందులో ఆయనకు సగపాలు. ఆ తల్లికి సగపాలు. కాలుని తన్నినది వామపాదముతో. ఆ పాదము అంబికది. అందుచే కామవిజయానికి, కాలనిగ్రహానికి స్వామి దయతోపాటు అమ్మ అనుగ్రహం సైతం కావాలి. మనం జన్మ వద్దనుకొంటే.. ఆ దంపతులనిరువురినీ చేర్చి ఉపాసన చేయాలి. వారి అనుగ్రహముంటే చాలు మనకు చావుపుట్టుకల బాధ ఉండదు.

-చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML