.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

*వేదములలో వర్ణించబడిన #ముక్తి*



*వేదములలో వర్ణించబడిన #ముక్తి*

ఈ వ్యాసంలో మనం ముక్తి లేదా మోక్షం అనే అంశాన్ని అర్థం చేసుకుందాం. పూర్తి అవగాహన కొరకు ఈ వ్యాసాలను కూడా దయచేసి చదవగలరు – Vedic God, Soul మరియు Worship.

(పూర్తిగా చదవడం వల్ల ఒక ఆధ్యాత్మిక వ్యాసంలో సాహసవంతుడైన మహా రాణా ప్రతాప్ చక్రవర్తి చిత్రం ఎందుకు జత చేయబడిందో అర్థమవుతుంది.)

ప్ర: ముక్తి లేదా మోక్షము అనగానేమి?

జ: ముక్తి అంటే స్వేచ్ఛ.

ప్ర: ఎటువంటి స్వేచ్ఛ?

జ: ముక్తి అనేది అన్ని ఆత్మలూ కోరుకునే స్వేచ్ఛ. వేరే విధంగా చెప్పాలంటే దుఃఖము మరియు బాధల నుండి స్వేచ్ఛను పొందటాన్ని ముక్తి అనవచ్చును.

ప్ర: ఇటువంటి స్వేచ్ఛ లభించిన తరువాత ఏమవుతుంది?

జ: ఇటువంటి స్వేచ్ఛ లబించిన తరువాత, ఆత్మ అమితానందపు అనుభూతిని పొందుతూ ఈశ్వర (దేవుడు/పరమాత్మ) అనుగ్రహము/ స్పూర్తితో జీవిస్తుంది. ఎవరైనా పొందగల అత్యంత సంతృప్తికరమైన ఆనందమయమైన స్థితి ఇది ఒక్కటే. చాలా మంది పొరపాటుపడి తప్పుగా నమ్ముతున్న ‘నిద్ర’ లేదా ‘సుషుప్తి’ వంటి అవస్థలను ముక్తి అనుట సమంజసము కాదు. ఇది నిద్రకు పూర్తిగా వ్యతిరేకమైనది – అదొక సాధించ వీలైన ఉత్కృష్టమైన చైతన్య స్థితి.

ప్ర: అయితే ఈశ్వరుడు (పరమాత్మ) మనలోనే ఉన్నాడు కదా. కనుక మనము ఇప్పటికే ఈశ్వర స్పూర్తితో అనుగ్రహము పొందుతూ జీవిస్తున్నాము కదా. మరి ఈ ముక్తి ఏ విధంగా విశిష్ఠమైనది?

జ: ఈశ్వరుడు మరియు ఆత్మలకి సంబంధించిన చర్చలను మననం చేసుకుంటే, ఆత్మకు ‘సంకల్పము’ చేసే స్వేచ్ఛ మరియు పరిమిత జ్ఞానం ఉన్నవని మనము నిర్థారణకు వచ్చాము. ఎప్పుడెప్పుడు ఈ ఆత్మ సంకల్ప బలమును సరిగ్గా ఉపయోగించి అజ్ఞానాన్ని పారద్రోలుతుందో, అప్పుడది ఇంకా ఎక్కువ అమితానందమును పొందుతూ ఈ సృష్టి ఉద్దేశముతో/ప్రయోజనముతో సారూప్యం చెందుతుంది. అందుచేత ఏ మార్గములో వీలయితే అందులో ఈశ్వరుడిని అనుకరిస్తూ, ఈ సృష్టి యొక్క సంపూర్ణ ప్రయోజనముతో/ఉద్దేశముతో సహకరించే విధముగా నడుచుకోవలెనని ఈ ఆత్మకు సూచించబడినది.

జీవిత లక్ష్యం ఏమిటంటే ఈ ఆత్మను ఈ సృష్టి యొక్క ఉద్దేశముతో సారూప్యానికి వచ్చేందుకు అనువైన పనులు చేయుటకు సంసిద్ధం చేయటమే. ఈ సారూప్యత ఒక అత్యున్నత చరమ స్థాయికి చేరిన తరువాత ఇక ఒక ఆత్మకు మళ్ళీ జన్మించేందుకు ఎటువంటి అవసరమూ ఉండదు. ఆ విధంగా అది ఈ జనన మరణ చక్రము నుండి, సుఖ దుఃఖాల నుండి స్వేచ్ఛను పొంది అత్యంత అమితానందాన్ని పొందుతుంది.

కనుక, ముక్తి అంటే మన అన్ని కర్మలను ఈ సృష్టి ప్రయోజనము/ఉద్దేశముతో సారూప్యత కలిగేలా నిర్వర్తించడమే (చేయటమే). ఈశ్వరుడు మనల్ని ఎల్లప్పుడూ ఉత్తేజపరుస్తూ, స్పూర్తినిస్తూ, మన వెంటే ఉండటమే కాక మనయందు కూడా ఉన్నాడు. కాని ఎప్పుడు మనం ఈ విషయాన్ని తెలుసుకొని తదనుగుణంగా నడచుకుంటామో, అప్పుడు మనకు ముక్తి లభిస్తుంది.

ప్ర: ఈ క్షణమే మనం ముక్తిని పొందకుండా మనల్ని ఏది నివారిస్తున్నది? ఈశ్వరుడు మనకు తక్షణమే ముక్తిని ఎందుకు ప్రసాదించడు?

జ: ముందుగా రెండవ ప్రశ్నకి సమాధానమును విచారణ చేద్దాం: ఈశ్వరుడు ఏది శ్రేష్ఠమైనదో అదే చేస్తాడు. అహేతుకంగా/నిరంకుశంగా ఈశ్వరుడు ప్రవర్తించడు.

మన సహజ లక్షణము (ప్రకృతి) ఎటువంటిదంటే అజ్ఞానాన్ని పారద్రోలి మాత్రమే ముక్తిని పొందగలము. మరియు అజ్ఞానాన్ని పారద్రోలుటకు కర్మలను ఆచరించటమొక్కటే మార్గము. మనము సత్కర్మలను ఆచరించాలంటే ఉన్న ఏకైక మార్గము మన ప్రస్తుత సామర్థ్యమునకు అనువైన వాతావరణంలో జన్మించేందుకు అవకాశం పొందటమే. ఇక ఈశ్వరుడు మనం ప్రావీణ్యతను పొంది ముక్తిని పొందేవరకూ అలాంటి అవకాశములు మనకి కల్పిస్తూనే ఉంటాడు. కనుక ఈశ్వరుడు అత్యున్నత మైన పద్థతిలో మనకి వీలైనంత త్వరగా ముక్తి లభించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.

ఇప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం విచారణ చేద్దాం, మనమిప్పుడు ఆత్మ యొక్క లక్షణాలను ఈశ్వరుడితో మరియు ప్రకృతితో పోల్చి చూద్దాం.

ప్రకృతి ‘సత్‘ – అది ఉనికిలో ఉంటుంది,

ఆత్మ ‘సత్‘ మరియు ‘చిత్‘ – అది ఉనికిలో ఉండి చైతన్యముతో (ఎరుకతో) ఉంటుంది (జీవించడం, విషయాలను తెలుసుకోవడం, కదలడం వంటివి),

ఈశ్వరుడు ‘సత్‘, ‘చిత్‘ మరియు ‘ఆనందము‘ – ఉనికిలో ఉంటాడు, చైతన్యము ఇంకా అమితానందమును కలిగియుంటాడు.

మరి ఆత్మ ఆనందమును/సంతోషమును అంతర్గతంగా (స్వతహాగా) కలిగియుండదు. అది కర్మల ద్వారా ఆనందమును పొందాలి. ఈశ్వరుడికి ఆనందము ఉన్నది కనుక, దీని అర్థమేమంటే ఈశ్వరుడిని చేరుటకు అది ప్రయత్నించాలి.

ఇప్పుడు వైదిక తత్వంలోని ఇంకొక ముఖ్యాంశానికి వద్దాం. “జ్ఞానం = ఆనందం“.

ఈశ్వరుడికి అపరిమితమైన జ్ఞానం ఉంది కనుక, అతనికి అపరిమితమైన ఆనందమూ ఉన్నది.

అయితే ఆత్మకు పరిమిత సామర్థ్యము మరియు పరిమిత జ్ఞానము ఉన్నాయి. ఈ పరిమితి, ఈశ్వరుడిచే నిర్వహించబడే కర్మ సిద్ధాంతమును అనుసరించి, ఆత్మ చేయు కర్మలను బట్టి మారుతూ ఉంటుంది.

కనుక ఆత్మ ఆనందమును పొందుటకు ఉన్న ఏకైక మార్గమేమనగా అది సరియైన కర్మలను చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ పరిమితులను తొలగించుకోవటమే.

ఇటువంటి కార్యనిర్వహణ పద్ధతి ఈ క్రింది విధంగా ఉంటుంది:

కర్మలు సంస్కారాలను (ప్రవృత్తులు లేక అలవాట్లు)సృష్టిస్తాయి మరియు సంస్కారాలు ఆత్మ యొక్క పరిమితులను నిర్ణయిస్తాయి. అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఒక పనిని చేసిన వెంటనే, అది ఒక సంస్కారాన్ని సృష్టిస్తుంది. ఈ సంస్కారము మీరు మరలా అటువంటి సందర్భములో అదే పనిని మళ్ళీ చేసే సంభావ్యతను (అవకాశము/ తరచుదనము/ పునరావృత లను)పెంచుతుంది.

కనుక మీరు చెడ్డ పనులు చేస్తే – మోసము, ద్వేషము వంటివి – అవే పనులు మీరు మళ్ళీ మళ్ళీ చేయుటకు సంభావ్యత పెరుగుతుంది. ఇది మీ సామర్థ్యము యొక్క పరిమితులను తగ్గించటం వల్ల మీకు జ్ఞానము తగ్గిపోయి ఆనందమూ తగ్గిపోతుంది. ఆ విధంగా మీరు ముక్తి నుండి ఒక్కొక్క అడుగు దూరమౌతారు.

అయితే మీరు మంచి పనులు చేసినట్లయితే – దయాభావం, విశ్లేషణ చేసి సత్యమును మాత్రమే అంగీకరించటం, గొప్ప వ్యక్తిత్వం కలిగివుండటం వంటివి – మీరు అటువంటి మంచి పనులు చేసే సంభావ్యత కూడా పెరుగుతుంది. ఇది జ్ఞానము మరియు ఆనందము పొందేందుకు కావలసిన గొప్ప సామర్థ్యమును సాధించుటకు దారి తీస్తుంది. ఆ విధంగా మీరు ముక్తి వైపు ఒక్కొక్క అడుగు దగ్గరవుతారు.

ఇక ప్రతియొక్క చర్య (ఆలోచనలు, భావాలు సహా) ఈ ప్రక్రియ లో లెక్కించబడుతుంది. ఏదైనా ఒక పనిని కేవలం ఒక్కసారి చేసినా కూడా, మీరు వివేకులు లేదా అవివేకులు (మొద్దులు) అగుటకు మీరు ఆ పనిని చేసే సంభావ్యత పెరుగుతుంది.ఒక సగటు ఆత్మ ప్రతి క్షణం సత్కర్మలు మరియు దుష్కర్మల మధ్య ఊగిసలాడుతూ ఉండి, ఒక తాగుబోతులా కొన్ని అడుగులు వెనక్కి, ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తూ, ముక్తిని పొందటాన్ని ఆలస్యము చేసుకుంటుంది.అయితే ఒక యోగి అతని సంకల్ప బలాన్ని (ఇచ్ఛాశక్తిని) ఉపయోగించి దుష్కర్మలు చేయుటకు నిరాకరించి సక్రియాత్మకంగా (ప్రయత్నపూర్వకంగా) ఉన్నతమైన కర్మలను మాత్రమే ఆచరిస్తాడు. అది అతని గత దుష్కర్మలకు సంబంధించిన సంస్కారములను బలహీన పరచి మంచి సంస్కారములతో భర్తీ చేస్తుంది. క్రమక్రమంగా అన్ని చెడు సంస్కారముల బీజములను ఒక యోగి నాశనము చేస్తాడు. అది ఎటువంటి పరిస్థితులలోనైనా ఆ యోగి అసలు చెడు పనులను చేయలేని స్థితికి చేరుస్తుంది. ఆ విధంగా అతడు చెడు కర్మల సంస్కారాలను దహించి వేసి, చెడు కార్యములు చేయుటకు కారణమైన చెడు సంస్కారముల ఉచ్చు నుండి బయట పడతాడు. వెనుకడుగు వేయనటువంటి ఒక సైనికుడి వలె ముక్తి వైపునకు సూటిగా పయనిస్తాడు.

అతడు ఈశ్వరేచ్ఛకు శరణాగతుడై, ఈశ్వరుడి ఆనందమును పొందుతాడు.

ఈ సంస్కారముల బీజములను రూపుమాపే ప్రక్రియకు, తగినంత సమయం వరకు, చాలా ఆసక్తితో కూడిన నిర్విరామ ప్రయత్నం, ఈశ్వరుడి పై విశ్వాసం మరియు నమ్మకం అవసరమౌతాయి.

ఈ ప్రక్రియలో మనకున్న ఒకే ఒక్క నియంత్రణ మీట మన సంకల్ప బలం (ఇచ్ఛాశక్తి) మాత్రమే.

చాలా మంది ప్రజలు సరియైన రీతిలో దిశలో వారి ఇచ్ఛాశక్తిని ఉపయోగించేందుకు నిర్లక్ష్యం చేయుట వలన సాధారణంగా వారికి వరుసగా ఎదురయ్యే పరిస్థితులకు ప్రతిస్పందించేటప్పుడు ఆట బొమ్మల్లా ప్రవర్తిస్తారు. కనుక వారికి వారే వారి ప్రగతిని కుంటు పరచుకుంటారు. యోగులు దీనికి భిన్నమైన పద్ధతిలో నడచుకుంటారు.

అందువల్లే భగవద్గీతలో ప్రపంచానికి పగలు-రాత్రి యోగికి రాత్రి-పగలు అవుతాయని ఉపమానంతో చెప్పబడినది.

మీరు ఎంత దృఢంగా మీ సంకల్పబలాన్ని (ఇచ్ఛాశక్తిని) ఉపయోగిస్తారో, అంత త్వరగా ముక్తిని పొందుతారు.

ప్ర: ముక్తి జ్ఞానాన్నికోరుతుందని చెప్తున్నారు. దానర్థం నేను ఈ ప్రపంచములోనున్న ప్రతియొక్క విషయం గురించి మొత్తం తెలుసుకోవలసిందేనా?

జ: మీరు అలా కోరుకున్నా కూడా, ప్రతియొక్క విషయం మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు ‘ఈశ్వరుడు’ కారు కదా!

ఇక్కడ ప్రస్తావించిన జ్ఞానం సాక్షాత్కారము గురించి కానీ కేవలం ప్రాపంచిక జ్ఞానం గురించి కాదు. కనుక మనం బట్టీ కొట్టే విషయాల గురించి కాక, అంతర్గత జ్ఞానమునకు దారి తీయు విషయములను పరిశీలిస్తున్నాం.

బట్టీ కొట్టడం కూడా ఉపయోగపడేదే మరియు పనికొచ్చేదే కానీ, అది విషయాలను మెరుగ్గా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే.

యజుర్వేదం 40.14 ఈ విషయాన్ని అద్భుతంగా టూకీగా వివరిస్తుంది: ఎవరైతే విద్య (జ్ఞానం) మరియు అవిద్య అంశాలను చక్కగా అర్థం చేసుకుంటారో, వారు సరియైన కర్మల ద్వారా మరణం వంటి బంధనాల నుండి అమితానందమును కలిగించే ముక్తి లభించే వరకు తమకి తాము సరియైన మార్గదర్శనం చేసుకుంటారు.

ప్ర: అయితే ఇక జ్ఞానము మరియు అజ్ఞానము లంటే ఏమిటి?

జ: యోగ దర్శన్ 2.5 ఈ అంశాన్ని చాలా అందంగా వివరిస్తుంది.

అది 4 విషయాలను అవిద్యగా లేక అజ్ఞానంగా నిర్వచిస్తుంది:

అశాశ్వతమును శాశ్వతముగా, శాశ్వతమును అశాశ్వతముగా పరిగణించుట.

ఉదాహరణకి, ఈ శరీరము మరియు భౌతిక ప్రపంచము ఎప్పటికీ నిలిచి ఉంటాయని భావించటం, శాశ్వతములైన ఆత్మని (జీవుడిని), ఈశ్వరుడిని నిర్లక్ష్యం చేయటం. మనలో చాలా మంది ఆవిధంగా ప్రవర్తిస్తూ ‘అవిద్య’ లో కూరుకుపోతూ ఉన్నాము.

అపవిత్రాన్ని పవిత్రంగా, పవిత్రాన్ని అపవిత్రంగా భావించటం.

ఉదాహరణకి, రక్తము, మలము, మూత్రము వంటి వాటితో కూడియున్న శరీరాన్ని పవిత్రమనుకుంటూ భౌతిక శరీరంపై, ఇంద్రియ సుఖములు, సౌందర్యముల వంటి వాటిపై వ్యామోహము కలిగి యుండుట, సత్యము, నైతికత, బ్రహ్మచర్యము, ఆత్మ నియంత్రణ, దయాభావం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయటం.

దుఃఖమును సంతోషము, సంతోషమును దుఃఖము అనుకోవటం.

ఉదాహరణకి, దుర్గుణాలైన కామము/వ్యామోహం, కోపం, దురాశ, విభ్రాంతి, ఇంకో మనిషిపై పిచ్చి,శోకం, విచారం, అసూయ, ద్వేషం, సోమరితనం, దురహంకారం వంటి వాటితో ప్రవర్తిస్తూ అవేదో సంతోషాన్ని కలిగిస్తాయని తప్పుడు ఆశలు పెట్టుకోవడం. మరియు ఆత్మ నియంత్రణ, దయాభావం, శాంతి, శ్రద్ధ, విధేయత, సరళత వంటి సద్గుణాలు దుఃఖమునకు మూలమని వాటిని త్యజించటం.

జడమును చైతన్యము, చైతన్యమును జడము అని భావించటం.

ఉదారణకి, ఈ శరీరము, మనస్సు జీవమున్నవనియు భావిస్తూ, చైతన్య స్వరూపములైన ఆత్మ, ఈశ్వరుడిని నిర్లక్ష్యం చేయటం.

అవిద్యకు భిన్నమైనదే (వ్యతిరేకమైనదే) విద్య లేక జ్ఞానము.

ఎప్పుడైతే ఈ విద్య లేక జ్ఞానము స్పష్టంగా స్థాపించబడుతుందో, అప్పుడిక జనన మరణ చక్రములో బంధించబడుటకు ఏ మాత్రం అవసరం ఉండదు. ఆత్మ అప్పుడు స్వేచ్ఛతో ముక్తిని/ శాశ్వతా నందమును పొందుతుంది.

ప్ర: దుఃఖము లేక బాధలు అంటే ఏమిటి?

జ: మరలా యోగ దర్శన్ 2.3-9 దుఃఖము గురించి చాలా క్లుప్తముగా దానికి గల కారణాల ద్వారా వివరిస్తుంది.

అది 5 రకములైన క్లేశములు లేక దుఃఖములు ఉన్నవని వివరిస్తుంది.

అవిద్య (అజ్ఞానం):ఇప్పటికే పైన పేర్కొనబడిన విషయం. ఇది అన్ని రకముల దుఃఖములకు మాతృక వంటిది మరియు ఇతర అన్ని దుఃఖములకు మూలాధారం వంటిది.అస్మిత (అహంకారం): మనస్సు, బుద్ధి, శరీరములను ‘తాను’ (జీవుడు) అని భావించి దోషపూరితమైన గర్వం, ఆదిపత్య ధోరణి లేక ఆత్మన్యూనతా భావం వంటివి కలిగియుండడం. ఈ దుర్గుణమును సాధన (అభ్యాసం), వివేకం మరియు వైరాగ్యముల ద్వారా రూపుమాపాలి.రాగము (బంధములు): ఇంద్రియ ఆధారిత విషయములలో ఆనందానుభూతి పొందాలనే సంస్కారములు లేక ప్రవృత్తులు కలిగియుండి, అటువంటి అనుభూతులు ఇంకా ఎక్కువ కావాలని దురాశ కలిగియుండడం.ద్వేషము (వికర్షణ): మనకు గతంలో ఇంద్రియ సంబంధిత దుఃఖములను కలిగించిన పరిస్థితులు, విషయాల పట్ల ద్వేషమును కలిగియుండడం.అభినివేశం (చావు యందు భయం): అసలు చనిపోకూడదని ఎప్పటికీ బ్రతికి ఉండాలని కోరుకోవడం. అన్ని జీవ రాశులు – చీమ మొదలుకొని చాలా మేధావి అయినటువంటి పండితుడి వరకు – అన్నీ చావంటే భయపడతాయి మరియు వీలైనంత వరకు తమని తాము చావు నుండి కాపాడుకొనే ప్రయత్నం చేస్తాయి. పునర్జన్మకి ఇదియే గొప్ప ఉదాహరణ. ఎప్పుడైతే మనం శరీరానికి మాత్రమే చావు ఉందని, ఆత్మకి చావు లేక పోగా ఈశ్వరుడి అనుగ్రహంతో ఎప్పటికీ కాపాడబడుతుందని అర్థం చేసుకుంటామో, ఈ భయం నిర్మూలించ బడుతుంది.

ప్ర: అయితే మరి మనం ముక్తిని లేక మోక్షాన్ని ఎలా పొందగలం?

జ: మనం ఇప్పటికే ఈ సిద్ధాంతాలను, సారాన్ని వివరంగా తెలుసుకున్నాం. దీనినే మరింత లౌకికంగా ఈ విధంగా చెప్పవచ్చు. ముక్తి ఈ క్రింది విధంగా సంభవిస్తుంది:

మన అంతర్వాణి ద్వారా, సత్యమును అర్థం చేసుకొనుటలో అహంకారమునకు తావు లేనటువంటి ప్రయత్నం చేయటం ద్వారా లభించే ఈశ్వరుడి సూచనలను పాటించడం.చెడు ప్రవృత్తులైనటువంటి పాపాలు, నేరాలు, కోపము, చిరాకు, విచారం, చెడు సాంగత్యం (స్నేహాలు), చెడు అలవాట్లు, మత్తు పదార్థములకు బానిస కావటం, వ్యసనాలు, వంటి వాటి నుండి దూరంగా ఉండటం.సక్రియాత్మకంగా సత్యాన్ని కాంక్షిస్తూ, దయాభావం, సమస్త లోక సంక్షేమం, క్రమశిక్షణ, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఈశ్వరుడిని పూజించటం, ధ్యానం సాధన చేయటం మరియు ఉన్నతమైన పరిశ్రమ (ప్రయత్నం, పనులు) చేయటం.నిజాయితీగా ఉండటం, నిష్పక్షపాతిగా నమ్మకస్తులై ఉండటం.ఈ సమాజం మరియు లోకం కొరకు, ఈశ్వరుడు మనకై ఏర్పరచిన బాధ్యతల నుండి పారిపోకుండా ఉండటం.

మనం ఇటువంటి పలు విషయాలను మరెప్పుడైనా వివరంగా చర్చించగలము. కాని వివేకవంతులు ఇప్పటి దాకా చేసిన చర్చతోనే భవిష్యత్తు యొక్క మార్గమును (త్రోవని) అర్థం చేసుకోగలరు.

ప్ర: ముక్తి లభిస్తే ఆత్మకి ఏమౌతుంది? అది ఒక నీటి బిందువు సముద్రంలో కలిసి తన ఉనికిని కోల్పోవటం వంటిదేనా?

జ: ఆత్మ శాశ్వతంగా తన ఉనికిని కోల్పోవలసిందే అన్నట్లయితే, అది ఇప్పటికే తన ఉనికిని కోల్పోయి ఉండాలి మరియు మనం ఇప్పుడు చేస్తున్న విధంగా ఒకరినొకరితో సంభాషించుకోము. ఎందుకంటే సమయానికి ఒక ఆరంభం (ఆది) అంటూ ఏమీ లేదు. కనుక అనంతమైన సమయం ఇప్పటికే గడచిపోయినా మనమెవ్వరమూ మన ఉనికిని కోల్పోలేదు. కనుక భవిష్యత్తులో కూడా మనం మన ఉనికిని శాశ్వతంగా కోల్పోవటానికి ఉన్న సంభావ్యత ఒక గుండు ‘సున్నా’ మాత్రమే.

అసలు ఏమి జరుగుతుందంటే ఒక ఇనుప బంతి అగ్నిగుండంలో ఏవిధమైన ఉనికితో ఉంటుందో, అదే విధంగా ఆత్మ కూడా తన ఉనికిని కలిగి యుంటుంది. దానికి ఉనికి ఉన్నా కూడా లోపల, వెలుపల అంతటా ఈశ్వరుడి ఆనందములో మునిగిపోయి ఉంటుంది. ఏ విధంగానైతే మనం ఒక ఆనందించగలిగే పనిలో నిమగ్నమై యున్నప్పుడు మన ఉనికిని కోల్పోతామో, అదే విధంగా ఆత్మ తన ఉనికిని కోల్పోతుంది. అయితే అది సంపూర్ణంగా ఉనికిని కోల్పోవటం కాదు.

ప్ర: ముక్తి లో ఆత్మ ఎక్కడ ఉంటుంది?

జ: ఆత్మ సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడిలో ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడితో ఉండటం వలన, ఆత్మకి తన స్థితి గతులపై ఎటువంటి అవధులు ఉండవు.

ప్ర: ముక్తి యందు ఆత్మకి భౌతిక శరీరం ఉంటుందా?

జ: ఉండదు. భౌతిక శరీరం ఇక దానికి అసంబద్ధమైనది (ఎంత మాత్రమూ అవసరమైనది కాదు). భౌతిక శరీరం ముక్తి వైపునకు పయనించేందుకు సాధన చేయుటకు ముక్తికి ముందు అవసరం కానీ, ముక్తి లభించిన తరువాత కాదు.

ప్ర: శరీరం లేకుండా ఏ విధంగా ఆత్మ ఈశ్వరుడి ఆనందమును ఆస్వాదించగలదు?

జ: భౌతిక ఇంద్రియములను ఉపయోగించుకోగల ఆత్మకి యున్న మౌళిక శక్తులు దానికి ఎప్పటికీ ఉంటాయి. అది స్వయంగా ఇచ్ఛాశక్తిని వినియోగించుట ద్వారా వినగలదు, తాక గలదు, చూడగలదు, రుచి చూడగలదు, ఆలోచించగలదు. అయితే, అన్ని అడ్డంకులను పరిమితులను తొలగించుకొని ముక్తిని పొందినవారికి (ఆయా ఆత్మలకి), భౌతిక శరీరానికున్న పరిమితులు ఉండవు.

ఈ విషయం పై మరింత వివరణ కొరకు వేదాంతము 4.4.10-12, కథోపనిషత్తు 2.3.10 మరియు చందోగ్య ఉపనిషత్తు 8.7.1, 8.12.5-6, 8.12.1 లను చదవండి.

ప్ర: ముక్తి సనాతనమైనదా (అంతము లేనటువంటిదా)?

జ: కాదు. అలా కనుక అయి ఉంటే, మనమందరమూ ఇప్పటికే ముక్తి పొంది ఉండే వాళ్ళం, ముక్తి కోసమని (బంధనాల నుండి స్వేచ్ఛ కొరకు) ప్రయత్నిస్తూ ఈ ప్రపంచములో ఏ ఆత్మా మిగిలి ఉండకూడదు. అప్పుడు ఈ సృష్టి యొక్క స్థూల ఉద్దేశం అసంబద్ధమైపోయి ఉంటుంది. ఇంకనూ ఇప్పటి దాకా మనం ముక్తిని పొందలేదు గనుక, ఇక భవిష్యత్తులో కూడా ముక్తిని పొందడం అసంభవమౌతుంది.

ఇలా ఎందుకు చెప్పగలమంటే, ఆత్మ జన్మించ లేదు కాబట్టి మరియు సమయానికి ఆది అంటూ లేదు కాబట్టి. కనుక వేదముల ప్రకారం, భగవద్గీత, ఉపనిషత్తులు మరియు ఇతర గ్రంథముల ప్రకారం, మనము అనంతమైన సమయం నుండి ఉనికిలో ఉంటూ ఉన్నాము. మనము అనంతమైన సమయంలో కూడా ముక్తిని పొందలేక పొతే, ఇక ఎప్పటికైనా ముక్తిని పొందే ఎటువంటి మార్గమూ లేదు.

కనుక ముక్తి సనాతనమైనది కాదు.

అందుచేత, ముక్తి యొక్క కాల పరిమితి అయిపోగానే, ఆత్మ మరలా ఈ ప్రపంచమునకు తిరిగి వచ్చి, మరలా ముక్తి వైపునకు పయనం సాగిస్తుంది.

ఏదేమైనప్పటికీ, ముక్తి యొక్క కాల పరిమితి మన మానవ జన్మ తో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. ముండకోపనిషత్తు ప్రకారమైతే, ఈ ముక్తి యొక్క కాల పరిమితి 36,000 సృష్టి చక్రముల (సృష్టి జరిగిన తరువాత మహా ప్రళయము సంభవించే వరకు ఒక సృష్టి చక్రం అనుకుంటే) సమయముతో సమానమైనది. ప్రతియొక్క సృష్టి చక్రము యొక్క సమయము 43.2×20 కోట్ల సంవత్సరాలు.

కనుక మన గ్రంథములు ముక్తి అనంతమైనది అని సూచించినప్పుడు, వాటి ఉద్దేశమేమిటంటే ఈ ముక్తి యొక్క పూర్తి కాల పరిమితి అయిపోయే వరకు మరలా ఈ జనన మరణ చక్రములోకి ఆత్మ తిరిగిరాదు.

ప్ర: వేదములలో ముక్తి అనంతమైనది కాదని ఏదైనా ఆధారము (సాక్ష్యము) ఉన్నదా?

జ: ఋగ్వేదము 1.24.1-2 మీరు పరిశీలిస్తే:

ప్రశ్న: ఎవరిని మనం అత్యంత పవిత్రం, పరిశుద్ధం అనుకోవాలి? ఈ మొత్తం ప్రపంచములో ఎవడు అత్యంత జ్ఞానవంతమైనవాడు? మనకు అత్యున్నతమైన ఆనందాన్ని, ముక్తిని ఇచ్చిన తరువాత, మరలా ఈ ప్రపంచములో మనకి తల్లిదండ్రులని ఎవరు ఇస్తారు?

జవాబు: స్వయం ప్రకాశమైన వాడు, సనాతనమైన వాడు (ఎప్పటికీ ఉండేవాడు), ఎప్పటికీ బంధ రహితుడు అయిన ఈశ్వరుడు ఒక్కడే అత్యంత పరిశుద్ధుడు. అతడు మాత్రమే మనకి అత్యున్నతమైన ఆనందాన్ని, ముక్తిని ఇచ్చిన తరువాత, మరలా ఈ ప్రపంచములో తల్లిదండ్రులని ఇస్తాడు.

ఆది శంకరాచార్యులు చందోగ్య ఉపనిషత్తు (8.15.1 మరియు 4.15.1) పై చేసిన భాష్యంలో ఆత్మ తన కాల పరిమితి అయిపోనంత వరకూ బ్రహ్మ లోకములో (ముక్తిలో) బస చేస్తుందని వివరించారు. 6.2.15 ని వివరిస్తూ అతను, ఆత్మలు ముక్తిలో చాలా సంవత్సరాలు ఉంటాయని పేర్కొన్నారు. శతపత్ బ్రాహ్మణ్ 14.6.1.18 ని వివరిస్తూ, ఇలా వ్రాశారు, “ఆత్మలు మోక్షము తరువాత మరలా తిరిగి రాకపోతే, అప్పుడు ఈ మంత్రము లో ‘ఇహ’ అనే పదము అర్థ రహితమౌతుంది.”

ప్ర: ముక్తిని అనంతమైనదిగా పరిగణించుట వలన ఎటువంటి తప్పిదములు (భ్రమలు/హేత్వాభాసములు) కలుగుతాయి?

జ: ఈ క్రింది విధంగా మనం విశ్లేషణ చేయవచ్చు.

పైన పేర్కొన్న కారణముల చేత ఇది వేదములకు విరుద్ధమైన అంశము.ఆత్మ జన్మించలేదు కాబట్టి అనంతమైన సమయం ఉనికిలోనే వున్నది. అయిననూ అది ముక్తిని పొందలేక పోయినది. కనుక ముక్తి అనంతమైనది అయితే, తత్ పర్యవసానంగా అది సాధించుటకు వీలు కానటువంటిది. ముక్తి కానటువంటి స్థితిలో మనం ఉనికిలో ఉండటం అన్నది ముక్తి అనంతమైనది కాదు అని నిశ్చయించుకొనుటకు గొప్ప ఉదాహరణ.ఆత్మ యొక్క చర్యలు (కర్మలు) పరిమితమైనవి. పరిమితమైన చర్యల ఫలితములు (ఫలములు) అనంతమైనవిగా ఉండజాలవు.ఒకవేళ ముక్తి అనంతమైనది అయివుంటే, ఈ లోకము అన్ని ఆత్మలకు ముక్తి లభించిన తరువాత శాశ్వతంగా అంతమైపోవాలి. ఆత్మలు జన్మించలేదు కనుక, కొత్త ఆత్మలు జన్మించేందుకు / సృష్టించబడేందుకు అవకాశము ఉండదు. ఒకవేళ ఆత్మలు సృష్టించబడియుంటే, వాటి వినాశము కూడా అనివార్యమైన విషయము.ముక్తి చక్రీయము (ఒక కాల చక్రము వంటిది) కాని యెడల, ముక్తి కూడా ఒక విధంగా, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేనటువంటి, ఒక కారాగారము వంటిది అవుతుంది.అనంతమైన సమయం వరకూ ఆత్మకి ఆనందము ఉంటే దాని విలువ కూడా తరిగిపోతూ వస్తుంది. గమనించవలసిన విషయం ఏమిటంటే ఆత్మ ఈశ్వరుడు కాదు కాబట్టి ఆనందమును పూర్తిగా అవగాహన చేసుకోలేదు. ఆనందమును అనుభవించేందుకు దానికియున్న సామర్థ్యం పరిమితమైనది. కనుక ముక్తి నుండి తిరిగిరావటమన్నది ఆత్మలకి భగవంతుడు అత్యుత్తమ న్యాయం చేయటమే.

ప్ర: ముక్తి నుండి తప్పక తిరిగిరావలసిందే కనుక, ముక్తికోసం ఎందుకు ప్రయత్నించాలి? అది అశాశ్వతమైనదే కదా!

జ: ఆత్మకి పరిమిత సామర్థ్యం మరియు పరిమిత జ్ఞానం ఉన్నాయి. కనుక దాని సాధారణ సామర్థ్యమును అధిగమించి అత్యున్నత స్థాయిని పొందటాన్ని తాత్కాలికమైన విషయంగా భావించటం సమంజసము కాదు.

ఈ లోకంలో, 1 గంట, 1 రోజు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు సంతోషంగా ఉండుటకు మనం తీవ్రంగా ప్రయత్నిస్తాం. పూర్తిగా తెలిసిన విషయమైనా, చివరకి అంతా అంతమైపోతుందని తెలిసినా కూడా, కేవలం 100 సంవత్సరాల ఈ జీవితం కోసం ఎన్నో ప్రణాలికలు చేసుకుంటాం. ఈ రోజుకి తిని రేపటి ఉదయపు భోజనం గురించి ఆలోచిస్తాం.

అటువంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసమే మనం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, మనకు అనూహ్యమైనటువంటి (ఊహకి అందనటువంటి) దీర్ఘకాలిక లక్ష్యమైనటువంటి ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు?

ప్ర: నేను మీ వాదనలను పరిగణిస్తాను. కాని నేను ముక్తికి సంబంధించి ఇంకో విధమైన భావమును విశ్వసిస్తాను. ఉదాహరణకి ముక్తి సనాతనమైనది కాదని నేను అంగీకరించలేకున్నాను. నేను ఆత్మ మరియు ఈశ్వరుడు ఒక్కటేనని నమ్ముతున్నాను. నాకు ఇంకా పలు భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేనేమి చెయ్యాలి?

జవాబు:

అత్యున్నత స్థాయి మానసిక నియంత్రణ అవసరమయ్యే ఇటువంటి అంశాలను అర్థం చేసుకొనుటకు, వాటిని వర్ణించే క్రమములో ఉపయోగించే పరిభాషలో (పద ప్రయోగములో), ఉపమానములలో ఉన్న తేడాల వల్ల ఇటువంటి చాలా భేదాభిప్రాయాలు కలుగుతాయి.అసలు ముక్తి ఖచ్చితంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే, మనము ఆ స్థితికి చేరిన తరువాత మాత్రమే తెలుసుకోగలము. కాని ఒక్క విషయం మాత్రం స్పష్టమైనది మరియు అనుమానాలకు తావు లేనిది – మన కళ్ళ ముందున్న ఈ ప్రపంచమే సర్వస్వము కాదు. దీనికి మించి ఇంకా ఎదో ఉన్నది మరియు మన ఉనికి ఇప్పుడు కలుగుతున్న జనన మరణములకు అతీతముగా కూడా ఉన్నది. ఆ విధంగా ముక్తి కోసము ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.మన ప్రయత్నముల ద్వారా సంభవించగలిగే ఆత్మ సాక్షాత్కారము ద్వారా మాత్రమే ఇంకా లోతుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలము.

కనుక, మీరు ఒకవేళ విభేదించినా, చింతించవలసిన పని లేదు. ఎందుకంటే మీరు లేక మేము ముక్తి అనే విషయంలో ఎటువంటి భావములతో ఉన్నామనే విషయంతో సంబంధం లేకుండా, ముక్తిని సాధించుటకు, మనకు ఇప్పుడున్న బాధ్యతలు, చేయవలసిన పనులు మనందరికీ ఒకేలా ఉన్నాయి – అవి అజ్ఞానాన్ని తొలగించుకొనుటకు చేయవలసిన ప్రయత్నములు.

కనుక, అంతిమ లక్ష్యాన్ని మనం ఏ విధంగా అవగాహన/అర్థం చేసుకున్నా, మనందరికీ ఉన్న మార్గము ఒక్కటే!

అది ఏమైనప్పటికినీ మనకది శ్రేష్ఠమైనదిగానే ఉంటుంది. కనుక మనమందరమూ అటువంటి ఉమ్మడి మార్గములో కలిసి పని చేస్తూ ముందుకు సాగాలి.

ప్ర: ముక్తి ఒక్క జన్మలో కలుగుతుందా లేక చాలా జన్మలు అవసరమా?

జ: చాలా జన్మలు కావాలి. ఎందుకంటే ఒక్కొక్క సంస్కారాన్ని నిర్మూలించేందుకు నిర్దిష్టమైన సమయము మరియు ప్రయత్నములు అవసరం అవుతాయి. అయితే ఈ విషయమై మనం ఇప్పటికే ఎన్ని జన్మలు పొందామో మనకి తెలియదనే విషయమును గుర్తించండి. కనుక ఈ జన్మలోనే ముక్తిని సాధించేందుకు ఒక వ్యక్తి తన శాయశక్తులా కృషి చేయాలి. అంతిమంగా ప్రయతముల యొక్క కాలం కంటే కూడా వాటి యొక్క తీవ్రతయే ఈ విషయములో ఎక్కువగా అవసరము.

ప్ర: ఒకవేళ చాలా జన్మలు ఉన్నట్లయితే, మనం వాటిని ఎందుకు గుర్తు పెట్టుకోలేక పోతున్నాం?

జ:

ఆత్మకి పరిమితమైన జ్ఞానం మాత్రమే ఉంది కనుక మెదడులో నిక్షిప్తమైన సమాచారం తప్ప ఇతర విషయాలు గుర్తుంచుకోలేదు. గత జన్మ గురించి కాసేపు మరచిపోదాం, మనము తల్లి గర్భంలోని మన అస్తిత్వాన్ని (ఉనికిని), మన బాల్యాన్ని, మన కలలని, గడచిన చాలా సంవత్సరములలో జరిగిన విషయాలని, మొదలగు వాటిని గుర్తుంచు కోలేక పోతున్నాం. ఒకవేళ మీరు జన్మించిన 12 సంవత్సరముల తరువాత 4వ నెల, 3వ రోజు, 3వ గంట 5వ నిమిషంలో ఏమి చేశారు అని అడిగితే, మీరు ఏమి సమాధానం చెబుతారు? నిజానికి కొన్ని గంటల క్రితం మీకు కలిగిన ఆలోచనలని కూడా మీరు సరిగ్గా గుర్తుంచుకొని చెప్పలేరు. అంతమాత్రాన మీరు ఇప్పుడు ఉనికిలో (అస్తిత్వంలో) లేరని అర్థమా?మనము గత జన్మల విషయాలను గుర్తుంచుకోకుండా, సరికొత్తగా ఇప్పుడు పని చేయగలిగే అవకాశం ఉన్నందుకు ఈశ్వరుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ జన్మలోనే మన ఆలోచనల వల్ల, పనుల వల్ల, జీవితంలోని విషాదాల వల్ల నిరాశ చెందుతాము మరియు వాటిని మరచి పోవాలనుకుంటాము. ఇక గత జన్మల బాధలన్నీ మనము గుర్తు పెట్టుకోగలిగితే ఏమయ్యే వారమో ఊహించండి. వాటిని కేవలం గుర్తుపెట్టు కున్నందుకే చచ్చిపోయి ఉండేవాళ్ళము!

కనుక గత జన్మల విషయాలు ఈశ్వరుడి పరిధి లోనివి. మన పరిధిలో ఉన్న పని మన సంకల్ప బలమును ఉపయోగించి ఉన్నతమైన కర్మల (పనుల) ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవటమే.

ప్ర: మనం గత జన్మల విషయాలను (చర్యలు, కర్మలు) గుర్తుంచుకోలేనప్పుడు, ఈశ్వరుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు?

జ: మీకు జ్వరం వస్తే చికిత్స కొరకు వైద్యుడి వద్దకు వెళతారు. మీరు జ్వరానికి గల కారణము లేదా అది ఏ విధంగా మీకు సంక్రమించినదో తెలుసుకోలేరు. అయితే మీరు ఎదో తప్పిదం ఎక్కడో జరిగి ఉంటుందని అందువల్లే జ్వరం వచ్చినదని మాత్రం నిస్సందేహంగా అంగీకరిస్తారు.

అదే విధంగా, ఈశ్వరుడి యొక్క ‘కర్మ సంబంధ నియమములు’ అర్థం చేసుకొనుటకు గత జన్మల కర్మలను ఇతర విశేషాలను గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. మనం అటువంటి భేదాలను ఈ ప్రపంచములో చూస్తూనే ఉన్నాం, భిన్నమైన సామాజిక స్థితి, ఆరోగ్యం, జాతులు, మొదలగునవి. ఇంకా ప్రతియొక్క సంఘటన/విషయము చాలా నిశితమైన వివరాలతో ఎంత ప్రణాళికా బద్ధంగా జరుగుతున్నదంటే, మనం ఎంతగా గొప్పలు చెప్పుకున్నా, ఈ ‘ఆధునిక విజ్ఞానం’ ఈ విషయముల పట్ల కనీసం 1% లోతును కూడా అన్వేషించ లేకపోయినదని మనం నిర్ధారణకు కూడా రావచ్చును.

ఈ ప్రపంచములో కనబడే ప్రణాళిక మరియు భేదాలు ఆ గొప్ప ప్రణాళికావేత్త (సృష్టికర్త) మన గత కర్మల ఆధారంగా మనకు వివిధ పరిస్థితులను కల్పిస్తాడని నిర్ధారణ కలిగిస్తాయి.

ఆత్మ పరిశీలన చేసుకోగలిగిన తెలివైన వారు మంచి పనుల వలన కలిగే లాభములను చెడు పనుల వలన కలిగే నష్టములను త్వరిత గతిన కొంత కాలములోనే తెలుసుకొనగలరు. అయితే ఇదే ప్రక్రియ ఈ ప్రస్తుత జన్మ కాల పరిమితిని మించి కూడా ఎందుకు విస్తరించకూడదు?

కనుక మనం గత జన్మలను గుర్తుంచుకోక పోయినా, ఈశ్వరుడు మన కర్మల ఆధారంగా మనకు వివిధ పరిస్థితులను, ఈ జన్మ అంతమైనా ఇంకొక జన్మ ప్రారంభమైనా, నిరంతరాయంగా కల్పిస్తూనే ఉంటాడనే సత్యమునకు ఈ ప్రపంచమే సాక్ష్యము.

ప్ర: చాలా జన్మలు ఉన్నట్లయితే మరియు ఈశ్వరుడు జన్మ తరువాత జన్మ నాకు ఇస్తుంటే, నేను ఎందుకు ముక్తి కోసం తొందర పడాలి? నేను ఇప్పుడున్న నా వర్తమానాన్ని ఆనందిస్తున్నాను. కనుక నాకు నచ్చిన విధంగా నేను ఉండవచ్చు కదా?

జ: ఇటువంటి తర్కము చదువు పూర్తి చేసుకొని ఎం.బి.ఏ. పట్టా పుచ్చుకొని కొత్తగా బయటికి వచ్చిన చతురుడైన వ్యక్తి నుండి వచ్చియుంటుంది. కాని ఈశ్వరుడు అతని కంటే కూడా అత్యంత చతురుడు.

ఈ ప్రపంచములో, మీరు ప్రగతిని సాధిస్తారు లేదా క్షీణించి/నశించి పోతారు. ప్రగతి లేనటువంటి స్థిరత్వం/స్తబ్ధతను కూడా క్షీణతగానే పరిగణించాలి. ఈ ప్రపంచాన్నే చూడండి, మీరు ఒక చిన్న శిశువుతో ఆడుకొనుటకు ఇష్టపడతారు. ఆ శిశువు చాలా ముద్దుగా అందంగా ఉంటుంది. అయితే మనం ఆ శిశువు ముద్దు ముచ్చట్లు కొన్ని నెలలు మాత్రమే ఆనందిస్తాము. ఒకవేళ చాలా సంవత్సరముల తరువాత కూడా ఆ శిశువు ఇంకా ఒక చిన్న ముద్దొచ్చే శిశువుగానే ఉన్నట్లయితే, ఏమి జరుగుతుందో ఊహించండి? మనందరమూ అటువంటి పరిస్థితి పట్ల ఆందోళన చెంది అదొక అరుదైన తీవ్రమైన జబ్బుగా పరిగణిస్తాము. మనందరం పిల్లలందరూ చాలా ఆరోగ్యకరంగా పెరిగి పెద్దవ్వాలని కోరుకుంటాము కదా, అదే విధంగా ఈశ్వరుడు తన సృష్టి ద్వారా అటువంటి ఎదుగుదలనే మన నుంచి ఆశిస్తాడు.

వ్యాపార విషయములలో కూడా, ఒక సంస్థ ప్రతి సంవత్సరమూ ఎదుగుదల ఏమీ లేకుండా ఒకే విధమైన పనితీరు కనబరిస్తే, ఆ సంస్థ యొక్క విలువ చాలా తగ్గిపోతుంది.

అదే విధంగా, మనం ప్రగతి కోసం సక్రియాత్మకమైన (చొరవతో పని చేసేందుకు సిద్ధంగా ఉండటం) ప్రయత్నములు చేయకపొతే, మనం నిజానికి మన విలువని తగ్గించేసుకుంటున్నాం అని అర్థం. కనుక తదుపరి జన్మ ప్రస్తుత జన్మ కంటే హీనముగా ఉండవచ్చు. మనం మానవులుగా ఉండుటకు కూడా, కొన్ని సక్రియాత్మక ప్రయత్నములు చేయాలి.

ప్ర: జంతువులు ముక్తిని పొందగలవా?

జ: అవును, పొందగలవు. ఎందుకంటే అన్ని జీవులలోని ఆత్మలు ఒకే రకమైనవి. అయితే అవి మానవ జన్మ కలిగిన తరువాతే ముక్తి కొరకు ప్రయత్నించగలవు.

ఈ విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రపంచములో మానవ జాతికి మాత్రమే సంకల్ప బలమును ముక్తిని పొందుట కొరకు ఉపయోగించే సామర్థ్యమున్నది. మిగిలిన జంతు జాతుల జన్మలు (జంతువులుగా జన్మించడం), గత జన్మల కర్మ ఫలములను అనుభవించి చాలా లోతుగా పాతుకు పోయినటువంటి సంస్కారములను తొలగించుకునేందుకు ఉపయోగపడే చికిత్సా కేంద్రముల వంటివి.

కనుక ఏ మానవులైతే కొన్ని రకముల వ్యసనములకు, అలవాట్లకు బానిసలై, వాటికై వెంపర్లాడుతూ ఉంటారో వారు తదనుగుణమైన జంతు జాతులలో జన్మించుట చేత ఆయా సంస్కారములను వదిలించుకునేందుకు ఆ విధంగా అవకాశం లభిస్తుంది. ఒక పరిధిని దాటి ఈ సంస్కారములను వదిలించుకున్న తరువాత తిరిగి మానవులుగా జన్మించుటకు అర్హతను పొంది ముక్తి కొరకు మిగిలిన ప్రయత్నములను కొనసాగించగలరు.

అందుచేత, మానవులందరూ తదుపరి జన్మలలో కూడా మరలా మానవులుగానే జన్మించి ముక్తి కొరకు చేయు ప్రయాణమును కొనసాగించుటకు ఉత్కృష్టమైన (శ్రేష్ఠమైన) ప్రయత్నములు చేయాలి. మానవ జన్మ కంటే ఎక్కువ విలువైనది ఏదీ లేదు కనుక మనం ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ప్ర: మరి అజ్ఞానము కూడా ఆనందమే కదా. ఒక ధనవంతుడు విలాసవంతమైన పాన్పు పై నిదురించవచ్చు కానీ అతనికి సుఖం ఉండదు. ఒక కూలివాడు రాతి నెలపై పడుకున్నా చక్కని నిద్ర పొందగలడు. అడవిలోని జంతువులు కూడా సంతోషంగా బ్రతుకుతున్నాయి. మానవులు మాత్రం ఆందోళనతో ఉంటారు. కనుక జ్ఞానమునకు బదులు అజ్ఞానముతో ఉండటం ఆనందము కాదా?

జ: ఇది కుర్రతనపు అవివేకమైన తర్కము.

తక్షణం ధనవంతుడికి బీదవాడు అయ్యేందుకు, బీద వాడికి ధనవంతుడు అయ్యేందుకు అవకాశం ఇవ్వండి. ధనవంతుడు దీనికి ఒప్పుకోడు, బీదవాడు వెంటనే ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుంటాడు. ఒకవేళ ఇద్దరికీ ఒకే స్థాయిలోని ఆనందం గనుక ఉన్నట్లయితే, వారిద్దరిలో ఎవరూ కూడా ప్రస్తుతమున్న స్థితిలో మార్పుని కోరుకోకూడదు.వివేకవంతుడైన ఏ మానవుడు కూడా జంతువుగా నుండుటకు ఎందుకు ఇష్టపడడంటే జంతువులు పొందలేనటువంటి ఆనందపు అత్యున్నత స్థాయిలను మానవుడు మాత్రమే ప్రాప్తి చేసుకోగలడు (చేరుకోగలడు).ధనవంతుల బాధలకు గల కారణం వారి దోష పూరితమైన ఆలోచనా విధానమే కానీ, సంపద కాదు. అటువంటి దోషపూరిత మార్గము (స్వభావము) వారి కర్మల ఫలితమే.అజ్ఞానము ఆనందమును పొందే క్రమములో ప్రతిబంధకములను కలిగిస్తుంది. ఆత్మలకి అల్ప జ్ఞానము నుండి అత్యున్నత జ్ఞానము కొరకు పురోగతి సాధించటం సహజ విషయము. ఉన్నత స్థాయి జ్ఞానం ఉన్న కారణంగా మీరు 1 సంవత్సరం వయసున్న బాలుడి ఆటలను ఈ వయసులో ఆస్వాదించరు కదా. కనుక “అజ్ఞానము కూడా ఆనందమే” అని వాదించే వారు అజ్ఞానమును దేనితో పోల్చి చూస్తారో దానిని లోప పూరిత జ్ఞానము లేదా ‘అవిద్య’ అనుకోవాలి.

అదే మీరు విద్యను ఆశిస్తే మీరు ఉన్నతోన్నత ఆనందమును పొందుతారు. వేరొక మార్గము లేనే లేదు.

ప్ర: స్వర్గము, నరకములంటే ఏమిటి?

జ: ‘స్వ’ అంటే సంతోషము. సంతోషమును పొందటమే స్వర్గము.

బాధలను పొందటము నరకము.

అవి ఏవో ఊహాజనితమైన ప్రదేశములను సూచించవు. అవి ఇప్పటికిప్పడు మన ప్రయత్నముల / కర్మల ద్వారా మనకు మనం సృష్టించుకునే పరిస్థితులను సూచిస్తాయి.

ఇక ఎప్పుడైతే మనం ప్రతి క్షణం స్వర్గాన్ని పొందాలనే తలంపుతో నుండటం అలవాటు చేసుకుంటామో, అజ్ఞానపు అన్ని మూలములు నశించిపోయి మనం ఈశ్వరుడిని / ఆనందమును పొందుతాము.

ప్రతి ఒక్కరూ ఏవో స్వర్గము, నరకము వంటి ప్రత్యేకమైన ప్రదేశాలున్నాయని భ్రమలో బ్రతకటాన్ని వదిలి వేయాలని మేము చాలా దృఢమైన ఈ విన్నపమును చేస్తున్నాం. వారితో విభేదించిన వారు శాశ్వతంగా నరకానికి, ఏకీభవించిన వారు శాశ్వతంగా స్వర్గానికి పోయెదరని నమ్మటాన్ని వదిలి వేయాలి. ఇతర మతస్థులు నేరగాళ్ళు, అల్లర్లు సృష్టించేవారు కాని యెడల వారందరి పట్ల పరమత సహనం కలిగియుండి సామరస్యముతో మెలగాలి. అన్ని ఆత్మల యందు ప్రేమ/జాలి కలిగియుండుట ఇక్కడే స్వర్గమును పొందుటకు, తదనంతరం ఈశ్వరుడి కృప తో ముక్తి / మోక్షములను పొందుటకు ఆవశ్యకమైనది.

ప్ర: సరే. మోక్షము పొందుటకు అజ్ఞానాన్ని తొలగించు కోవటం గురించి నేను అర్థం చేసుకున్నాను. అందుచేతనే ఒక అజ్ఞాత (మారు మూల) ప్రదేశమునకు వెళ్లి ధ్యానం చేయవలసి ఉంటుందా?

జ: వైదిక జ్ఞానమంటే ఏవో కొన్ని శ్లోకాలు గుర్తుంచుకోవటం లేక కొన్ని అంశాలను బుద్ధిని ఉపయోగించి అర్థం చేసుకోవటం మాత్రమే కాదు. దాని అర్థమేంటంటే ఆలోచనలలో, మాటలలో, చర్యలలో (చేసే పనులలో) – అనగా జ్ఞానము, కర్మలు మరియు ఆత్మ పరిశీలన (చింతన) లలో – పూర్తి అవగాహన కలిగియుండటం.

ఇది సైకిల్ నేర్చుకోవటం వంటిది. సైకిల్ మరియు దాని నిర్మాణం గురించి కేవలం ఒక పుస్తకం చదివినంత మాత్రాన అది సరిపోదు. మీరు సాధన చేయాలి. ఇక వేరే ఎటువంటి ప్రత్యామ్నాయము లేదు.

కనుక మోక్షమును సాధించుటకు కూడా మీరు ఈ ప్రపంచములో ఉండాలి, చుట్టూ ఉన్న బురద అంటకుండా ఒక కమలం (తామర పువ్వు) లా బ్రతకాలి, మరియు ఈ వ్యవస్థను పరిశుద్ధం చేసేందుకు ప్రయత్నములు చేయాలి. ఎప్పుడైతే మీ బాధ్యతలు ఈ ప్రపంచమునకై మీ ప్రమేయమును నిర్దేశిస్తాయో, అప్పుడు మీరు ధ్యానమునకై వాటిని వదిలి వెళ్ళటం ముక్తికి మార్గం కాదు కదా అదొక అసమర్థ చవట లక్షణం అవుతుంది – ఇది ముక్తికి విరుద్ధమైన విషయము.

ఏకాంతము స్వల్ప కాలిక లేక ఒక నిర్దిష్టమైన లక్ష్యం కొరకైతే ఉపయోగపడవచ్చు కానీ ముక్తి ఇతర ఆత్మల సహకారం లేకుండా లభించదు. వేదములు సహకారము మరియు సంఘీభావముల పైనే లెక్కలేనన్ని సూక్తములను కలిగియున్నవి. ఎవరైతే ఈ మౌళికమైన అవసరాన్ని గుర్తించకుండా ముక్తి కోసం ప్రయత్నిస్తారో వారు కేవలం జడత్వంలో వుంటారు (మందకొడి ప్రగతి మరియు మానసిక స్థితులలో ఉంటారు).

ప్ర: అయితే మరి అడవులకు పోయి తపస్సు లేదా ధ్యానము చేసే సన్యాసులు లేదా మునుల సంగతేమిటి? వారు కూడా పలాయనవాదులేనా (తప్పించుకు తిరుగువారేనా)?

జ: మీరు ఈ తరంలోని అడవులలో నుండే సన్యాసుల గురించి మాట్లాడుతున్నట్లయితే, ఒకవేళ వారు తాత్కాలికముగా వారిని వారు పునరుత్తేజపరచు కోవాలని, లేదా వృద్ధాప్యం కారణంగా వారు సమాజమునకై సక్రియాత్మకంగా పని చేయలేని వారైతే, వారు చేస్తున్నది సమంజసమే.

కాని ఎవరైతే సరియైన శరీర సౌష్టవం కలిగియుండి కూడా శాశ్వత ఏకాంతవాసం కోరుకుంటారో, వారు పలాయనవాదులు మరియు వారు జడమైన మార్గంలో పయనిస్తున్నారని అర్థము. వైరాగ్యము బంధనముల నుండి కలగాలి, కర్మల నుండి కాదు.

అటువంటి అసహజమైన ఏకాంతము ఈశ్వరుడి పట్ల చేయు అపచారము అవుతుంది. ఒకవేళ ఈశ్వరుడు మీకు ఏకాంతమే మేలనుకుంటే ఏ ఏకాంత గ్రహములోనో జన్మించేలా చేసియుండవచ్చు, ఇలా కష్టములు, సవాళ్ళను ఎదుర్కొనే ప్రజలతో కూడిన సమాజములో జన్మించేలా చేసియుండకూడదు. ఇంకనూ, జ్ఞానము కూడా ఈ ప్రపంచాముతో సంకర్షణ (పరస్పర చర్యలు, సంభాషణలు) ద్వారా మాత్రమే కలుగుతుంది. మీరు అటువంటి సంకర్షణను ఆపివేస్తే, ఆపై జ్ఞానాన్ని వృద్ధి చేసుకునే అవకాశాన్ని కోల్పోవటం జరుగుతుంది.

ఎవరి పనులను వారు చక్కగా చేస్తున్నటువంటి ఒక ఆదర్శవంతమైన సమాజములో ఒకవేళ మీరు జన్మించివుంటే, అప్పుడు మీకు ఈ ప్రపంచము, జనము యొక్క గొడవ లేకుండా మీ అంతర్గతమును (అంతర్ ప్రపంచమును) శోధించుటకు ఏకాంత ప్రదేశమునకు వెళ్ళుటకు స్వేచ్ఛ ఉండగలదు.

కానీ ఈ రోజు, చాలా అవినీతి, అసహనము, ద్వేషము, పేదరికము, దుఃఖము, అనైతికత మొదలగునవి సమాజంలో ఉన్నప్పుడు, ఈశ్వరుడు మనల్ని సవాళ్ళను ఎదుర్కొని, వాటిపై పని చేసి, వైరాగ్యమును పొంది అజ్ఞానమును తొలగించుకోవాలని సంకల్పిస్తే, కేవలం బుద్ధివైకల్యం కలిగినవారు లేక అసమర్థులైన పిరికిపందలు మాత్రమే వీటి నుండి దూరంగా పారిపోవాలనుకుంటారు.

ఆధ్యాత్మికత నెపంతో, సహజంగా కర్మబద్ధమైన ఈ దేశములో ఒక పెద్ద సంఖ్యలోని శ్రామిక శక్తి, దేశం మరియు సమాజం పట్ల వారి బాధ్యతను విస్మరించటం విచారించదగ్గ విషయం. ఈ ప్రక్రియలో వారు వారి ప్రగతిని కుంటు పరచుకుని జడత్వమును పొందటమే కాక, సమాజానికి, దేశానికి చాలా కూడా నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న దేశ విరుద్ధమైన, చాలా బాధను కలిగించే అంశం ఇదే!

మనం చరిత్రని పరిశీలిస్తే, ఇప్పుడున్నటువంటి చాలా కల్లోల భరితమైన సమయంలో, ఏకాంతముగా మానసిక ప్రశాంతత కోసం లేదా ఆధ్యాత్మికత పేరుతో హీనమైన మాయ మంత్రాలు చేయుటకు ప్రయత్నించే అందరు దొంగ బాబాలు, గురువులు, సిద్ధులూ, ఆధ్యాత్మికతకు చాలా దారుణమైన ఉదాహరణలు. దురదృష్టవశాత్తూ మనకి ఇటువంటి వారే కోకొల్లలుగా ఉన్నారు. అందుకనే అత్యున్నతమైన ఆధ్యాత్మిక భూమిక/పునాది ఉన్నప్పటికీ, మన దేశం ఈ ప్రపంచములో, కనీసం గత 1000 సంవత్సరాలుగా దెబ్బ పై దెబ్బ తింటున్నటువంటి, ఇప్పటికీ అత్యంత బలహీనమైన సిగ్గుపడవలసిన విధంగా నిస్సహాయ స్థితిలోనున్న సమాజముగా నున్నది.

మనకు ఆధ్యాత్మికంగా ఆదర్శప్రాయులైన వారు, ఈ దేశము మరియు సమాజము ఎదుర్కున్నటువంటి సవాళ్ళ కోసం, అత్యున్నత లక్ష్యం కోసం తమను తాము ఆహుతి చేసుకున్న మహనీయులై యుండాలి. వారు విద్య మరియు వైరాగ్యములను వారి దృఢమైన చర్యల (కర్మల) ద్వారా నిరూపించి, నిజమైన ముక్తిని కాంక్షించిన వారు. వారు మనకు నిజమైన సాధువులు. మనం, మహా రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, బిస్మిల్, అష్ఫాకుల్లా, నేతాజీ, ఆజాద్, స్వామి దయానంద సరస్వతి వంటి అసంఖ్యాకమైన గొప్ప మహనీయులలో కొందరైన వారిని గురించి ఉదహరించుకుంటున్నాం.

స్వామి దయానంద రోజుకు కొన్ని మైళ్ళ దూరం పరుగెత్తేవారు, గెంతడం, దూకడం, ఆసనాలు వేసేవారు, ముద్గర్ సాధన చేసే వారు మరియు అతని జీవిత కాలమంతా కఠినమైన శిక్షణ/అభ్యాసం చేసేవారు. ఎందుకంటే ముక్తి కేవలం బలవంతులకు, కర్మబద్ధంగా నుండు వారికోసం ఉద్దేశించబడినది.

మనమందరమూ కూడా ముక్తి కొరకు వ్యక్తిగతంగా కాక, సమాజానికి, దేశానికి, మొత్తం మానవజాతికి మేలు చేయగలిగిన శక్తివంతమైన, నిస్వార్థ లక్ష్యమును కాంక్షించెదము గాక! అందుకు కావలిసిన శక్తిని, ఆసక్తిని, పవిత్రతను ఈశ్వరుడు మనకు ఇప్పుడే ప్రసాదించు గాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML