పితృ తర్పణ విధి
భాధ్రపద మాస కృష్ణపక్ష మందు మహాలయమును పితరులనుద్దేశించి చేస్తూ శక్తి కొలది వేద పారగులైన బ్రాహ్మణులకు అన్నంతో భోజనం పెట్టిన వారు దుర్గతిని పొందరు. భాద్రపద కృష్ణపక్షమందు మహాలయ మందు తన శక్తికి తగినట్టు ఒక్కనికో, ఇద్దరికో, ముగ్గురికో బ్రాహ్మణులకు దారిద్ర్యం లేకుండ భోజనం పెట్టిన యెడల అతనికి దుర్గతి ఎప్పుడు ఉండదు. ఈతడు భాద్రపద మాసంలో పితరులను ఉపాసించనందు వలన ఈ బ్రాహ్మణుడు వేతాలుడైనాడు. పాపియైన నిన్ను పట్టుకున్నాడు. భాద్రపద మాసం కాలం మొదలుకొని వృశ్చికం వరకు తత్వదర్శులైన మునులు మహాలయమని చెప్పారు.
శుభమైన భాద్రపద కృష్ణపక్ష మందు ప్రథమ తిథి యందు భక్తి పూర్వకముగ మహాలయ శ్రాద్ధము చేసిన వాని కర్మతో సర్వపావనుడైన అగ్ని సంతుష్టుడౌతాడు. అతడు చేసిన వాడు వహ్నిలోకమును చేరి వహ్నితో సహకూడి ఆనందిస్తాడు. అతనికి అగ్నిదేవుడు సర్వైశ్వర్యములను ఇస్తాడు కూడ. ప్రథమ తిథి యందు మహాలయము చేయని నరుని గృహమును, సంపదను, క్షేత్రాదికమును అగ్నిదహిస్తాడు కూడా. మహాలయ ప్రథమతిథియందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు దశకల్ప సహస్రముల కాలము తృప్తిని పొందుతారు.
ద్వితీయ యందు మహాలయ శ్రాద్ధము చేసిన వాని భక్తికి భగవాన్, భవానీ పతియైన ఈశ్వరుడు సంతుష్టుడౌతాడు. ఆతడు కైలాసానికి చేరి శివునితో కూడి ఆనందిస్తాడు సంతుష్టుడైన మహేశ్వరుడు అతనికి అధికమైన సంపదనిస్తాడు. ద్వితీయ తిథి యందు మహాలయము చేయని నరుని కోపించి శంభువు ఆతని బ్రహ్మవర్చస్సు నాశనం చేస్తాడు. కాల సూత్రమను రౌరవ నరకాన్ని ఆతనికిస్తాడు. మహాలయ ద్వితీయ తిథి యందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు ఇరువది కల్ప సహస్రముల కాలము తృప్తి నందుతారు. పితరుల అనుగ్రహం వల్ల ఈతని సంతతి వృద్ధి చెందుతుంది.
తృతీయ యందు మహాలయ శ్రాద్ధమును నరుడు భక్తితో చేయాలి. దీనితో భగవాన్ లోకపాలుడైన ధనాధిపతి సంతుష్టుడౌతాడు. మహాపద్మాది నిధులు అతని వశంలో ఉంటాయి. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు అతన్ని అనుసరించి ఉంటారు. తృతీయ తిథి యందు మహాలయము చేయని నరుని సంపదను భగవాన్ ధనరుడు (కుబేరుడు) క్షణంలో హరిస్తాడు. బహుదుఃఖ సమాకులమైన దారిద్ర్యాన్ని కూడా ఈతనికిస్తాడు తృతీయ తిథి యందు మహాలయము చేసిన నరుని కర్మతో, అతని పితరులు ముప్పది కల్పసహస్రముల కాలము తృప్తినందుతారు.
చతుర్థి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధం చేయాలి. దాని వలన భగవాన్ పార్వతీసుతుడు ఐన హెరంబుడు సంతోషిస్తాడు. గజవక్త్రుని అనుగ్రహం వల్ల అతని విఘ్నాలు నశిస్తాయి. చతుర్థితి థి యందు మహాలయము చేయని నరునకు భగవాన్ విఘ్నేశుడు ఎప్పుడు విఘ్నం చేస్తూనే ఉంటాడు. చండకోలాహలమనే నరకంలో పడిపోతాడు కూడా. చతుర్థి తిథి యందు మహాలయము చేసిన నరుని పితరులు నలుబది సహస్రములు ఆనందంతో ఉండి శ్రాద్ధ కర్తకు నిరంతరంగా బహుపుత్రులనిస్తారు.
పంచమి తిథి యందు మహాలయము భక్తితో చేయని నరుని మందిరమును భగవతి లక్ష్మి వదిలిపెడుతుంది. ఆతని ఇంటిలో కలహమున కాధారమైన అలక్ష్మి పుడుతుంది. పంచమి తిథి యందు మహాలయమాచరరించిన నరుని పితరులు ఐదు (యాభై బహుశాక్రమంలో) కల్ప సహస్రకములు తృప్తినందుతారు. తృప్తులై ఈతనికి అవిచ్ఛిన్నమైన సంతానాన్ని కూడా ఇస్తారు. మహదైశ్వర్యమునిచ్చే పార్వతి కూడా ప్రసన్నురాలౌతుంది.
షష్టితిథి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధమును చేయాలి. ఆ కర్మవలన పార్వతీసుతుడైన షణ్ముఖుడు భగవానుడు సంతుష్టుడౌతాడు. ఆతని అనుగ్రహం వల్ల ఆనరునకు పుత్రులు పౌత్రులు కలుగుతారు. గ్రహములతో బాల గ్రహములతో కూడా ఎప్పుడూ బాధింపబడరు షష్టితిథి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేయని నరునకు స్కందుడు మహాసేనుడు, విముఖుడౌతాడు. గర్భం నుండి బయటికి వస్తూనే ఆతని సంతానం నశిస్తుంది. ఎప్పుడూ పూతనాది గ్రహముల సమూహములతో బాదింపబడతాడు. వహ్నిజ్వాలా ప్రవేశమనే నరకంలో కిందపడిపోతాడు. షష్ఠితిథి యందు శ్రద్ధ కలిగి మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు అరవై వేల కల్పసహస్రములు తృప్తినందుతారు. పుత్రులను, విపులమైన సంపదను కూడా ఇస్తారు.
సప్తమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. బంగారు చేతులు గల భగవాన్ ఆదిత్యుడు దీని వలన సంతుష్టుడౌతాడు. భాస్కరుని అనుగ్రహం వలన రోగం లేకుండా దృఢశరీరం గల వాడుగా ఔతాడు. భగవాన్ హిరణ్యపాణియైన వాడు స్వయంగా తన చేతితో హిరణ్యమును సంతుష్టమనస్కుడై మహాలయ శ్రాద్ధ కర్తకు ఇస్తాడు.. సప్తమి తిథి యందు భక్తితో మహాలయము చేయని నరుడు క్షయ రోగాది వ్యాధులతో రాత్రింబగళ్ళు ఆతడు బాధింపబడుతాడు. క్రింద తీక్షధార అస్త్రశయ్య అను నరక మందు పడతాడు. సప్తమి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు డెబ్బది కల్పసహస్రములు సంతుష్టులౌతారు. పితృగణము ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు కూడా.
అష్టమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. మృత్యుంజయుడు, కృత్తి వాసుడు, శంకరుడు దాని వలన సంతుష్టుడౌతాడు. శంకరుని అనుగ్రహం వలన అతనికి కైవల్యము చేతియందున్నట్లే మహాలయ శ్రాద్ధంతో సాక్షాత్తు త్రియంబకుడు సంతోషపడితే, పదునాల్గులోకములలో అతనికి దుర్లభమైనదేముంటుంది. మూఢచేతనుడై అష్టమి యందు మహాలయము చేయని వాడు ఘోరమైన సంసార సాగరమందు దుఃఖితుడై మునుగుతాడు ఎప్పుడూను భూమి యందు ఆతని కోరిక ఎప్పుడు కూడా సిద్ధించదు. చంద్రుడు తారలున్నంత వరకు వైతరిణి అను నరకమందు పడిపోతాడు. అష్టమి యందు శ్రద్ధతో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు ఎనుబది కల్ప సహస్రము తృప్తి నందుతారు. ఈతనిని ఆశీస్సులతో వృద్ధి పరుస్తారు. ఈతని విఘ్నము కూడా తొలగిపోతుంది. పితృ గణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.
నవమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. దానితో దుర్గాదేవి, భగవతి, శాంభవి సంతుష్టి పొందుతుంది. సంతుష్టి చెందిన దుర్గ మహిష నందిని అతని క్షయ, అపస్మార కుష్ఠాదులను క్షుద్ర ప్రేత పిశాచములను నశింపచేస్తుంది. నవమి తిథి యందు మహాలయము చేయని నరుడు బ్రహ్మరక్షస్సుతో, అపస్మారముతో పీడింపబడుతాడు. నిరంతరము అభిచార అర్థకృత్యములతో బాధింపబడుతాడు. నవమి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు తొంబది కల్ప సహస్రములు తృప్తి నందుతారు. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని గూడా ఇస్తారు.
దశమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. దానితో షోడశాత్మ అమృత కళుడు, చంద్రుడు ప్రసన్నుడౌతాడు ఓషధులకు అధీశుడైన ఈతడు ఈ శ్రాద్ధంతో సంతోషిస్తే ఓషధులు ఎల్లప్పుడూ వ్రీహ్యది ధాన్యములను ఇస్తాయి. దశమి యందు ఉత్తమ ముఖ్యమైన మహాలయమాచరించని నరుని ఓషధులు నిష్ఫలమౌతాయి.ఆతని కృషి కూడా నిష్ఫలమే. దశమి తిథి యందు మహాలయ శ్రాదధము చేసిన నరుని, పితరులు శత కల్పసహస్రములు తృప్తినందుతారు. పితృ గణములు ఎల్లప్పుడూ ఈతనికి అవిచ్ఛిన్న సంతతినిస్తారు.
ఏకాదశి యందు, భక్తితో మహాలయ శ్రాద్ధాన్ని చేయాలి నరుడు. దానితో సర్వ లోకముల సంహర్త ఐన రుద్రుడు అనుగ్రహిస్తాడు. సర్వసంహర్తయైన జగత్పతియైన రుద్రుని అనుగ్రహముతో ఈ శ్రాద్ధ కర్త నిరంతరము శత్రువులను ఓడిస్తాడు. అతని బ్రహ్మహత్యలు పదివేలైన ఆక్షణంలోనే నశిస్తాయి. అగ్నిష్టోమాది యజ్ఞముల ఫలమును పుష్కలంగా పొందుతాడు. ఏకాదశి యందు భక్తితో మహాలయము చేయని నరునిపై రుద్రుడు విముఖుడౌతాడు. అతనిని ఎప్పుడు కూడా అనుగ్రహించడు. అన్ని విధముల అభివృద్ధి చెందుతున్న శత్రువులు ఈతనిని బాధిస్తారు. బహు దక్షిణలతో చేసిన అగ్నిష్టోమాది యజ్ఞములు ఆతనిని నిష్ఫలములే, బూడిదలో పోసిన హవ్యముల వలె ఔతాయి. శ్రాద్ధము చేయని దోషము వలన బ్రహ్మఘాతకతుల్యుడౌతాడు. ఏకాదశి తిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు రెండు వందల కల్ప సహస్రములు తృప్తులౌతారు. పితృగణముల ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు.
ద్వాదశి తిథి యందు మర్త్యుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. ఆతనిని లక్ష్మీపతియైన జనార్దనుడు సాక్షాత్తుగా అనుగ్రహిస్తాడు. దేవేశుడు, దేవదేవుడు ఐన జనార్దనుడు ప్రసన్నుడైతే చరాచర జగత్తంతా సంతోషించినట్టే అనుమానంలేదు. హరిప్రియ ఐన భూమి ఈతని పంటను వృద్ధి పరుస్తుంది కూడా. హరివల్లభ ఐన లక్ష్మికూడా అతని ఇంటిలో వృద్ధి పొందుతుంది. నారాయణుని చేతి యందున్న గద కౌమోదకి అనునది ఎప్పుడూ అపస్మారాది భూతములను నశింపచేస్తుంది. తీక్షణమైన అంచులు గల చక్రము ఈతని శత్రువులను దహించి వేస్తుంది. ఈతని శంఖము యాతుధాన పిశాచాదులను తొలగిస్తుంది. ఈ విధముగా కేశవుడు అన్ని విధముల ఈతని పీడను తొలగిస్తాడు. హహాలయమును ద్వాదశి యందు చేయని మను జాథముని యొక్క క్షేత్రములు సంపదలు నశిస్తాయి. అనుమానం లేదు. అపస్మారాది భూతములు, మహాబలవంతులైన శత్రువులు యాతుధానులు (రాక్షసులు, పుణ్యజనులు) కూడా విష్ణుపరాఙ్‌ముఖుడైన ఈతనిని బాధిస్తారు. అస్థి భేదనమను పేరుగల నరక మందు పడవేయబడుతాడు ద్వాదశి యందు భక్తియుక్తుడై మహాలయ శ్రాద్ధము నాచరించిన వాని పితరులు ఆరువందల కల్ప సహస్రములు సంతోషపడుతారు. ఈతని పితరులు ఈతనికి అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు.
త్రయోదశి యందు నరుడు భక్తితో మహలయ శ్రాద్ధమును చేయాలి. అతనికి రతినాయకుడైన భగవాన్ కందర్పుడు ప్రసన్నుడౌతాడు. ప్రక్చందనాది భోగములు మనోరమలైన స్త్రీలు కామదేవుని ప్రసాదం వల్ల అతనికి ఎల్లప్పుడూ సిద్ధిస్తారు. పుట్టుక నుండి చావు వరకు ఆతడు సుఖమునే పొందుతాడు. త్రయోదశి యందు మహాలయ శ్రాద్ధము చేయని వానికి కామదేవుడు విముఖుడౌతాడు. స్త్రీలను భోగములను నశింపచేస్తాడు. ఈతనిని అంగార శయ్యా భ్రమణమనే నరకమందు పడవేస్తాడు. పితరుల నుద్దేశించి త్రయోదశి యందు మహాలయం మాచరించిన వాని పితరుల సహస్ర కల్పసహస్రములు సంతుష్టి నందుతారు. పితృగణములు అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు.
చతుర్దశి యందు నరుడ భక్తితో మహాలయ శ్రాద్ధము చేయాలి. అతని అభీష్టమును నెరవేర్చుటకై భగవాన్ శివుడు మేల్కొంటాడు. శివ జ్ఞానమును ఉపదేశించి సాయుజ్యము కూడా ఇస్తాడు. పదివేల సురాపానముల, పదివేల స్వర్ణప్తేయము బంగారం దొంగతనము / పాపము చతుర్దశి మహాలయం శ్రాద్ధం వల్ల తత్‌క్షణ మందే నశిస్తుంది. చండాల వృషల స్త్రీల సమాగమ దోషం కూడా నశిస్తుంది. అశ్వమేధ సహస్రముల పదివేల పుండరీక యాగముల పుష్కల ఫలసిద్ధి చతుర్దశి మహాలయం వల్ల లభిస్తుంది. చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధం చేయని నరుడు కల్పకోటి సహస్రము, అట్లాగే కల్పకోటి శతము కాలము సంసారమనే పెద్ద చీకటి బావిలో పడిపోతాడు. నిష్కృతి లభించదు. బంగారం దొంగిలించకుండానే సురను తాగకుండానే సురాపానాది దోషములతో తాకబడుతాడు. ఆ మూఢ బుద్ధి కలవాడు. విధానం ప్రకారం చేసినా ఆతని యజ్ఞములు నిష్ఫలములౌతాయి చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు లక్షకోటి సహస్రముల లక్షకోటి శతములు కల్పములు తృప్తి నందుతారు. అనుమానం లేదు. నరకమందున్న పితరులు కూడా ఆనందంతో స్వర్గానికి వెళుతారు. పితృగణములు అవిచ్ఛిన్నమైన సంతతిని కూడా ఇస్తారు. అమాయందు నరుడు మహాలయ శ్రాద్ధ మాచరించాలి. ఆతని పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. అనుమానంలేదు. దేవలోకంలో దేవతలకు అమృతాస్వాదన వల్ల లభించేతృప్తి అనంతమైన అట్టి తృప్తి అమావాస్య మహాలయ వల్ల లభిస్తుంది.
పితృదేవతలను నమస్కరించే అమావాస్య మహాపుణ్యప్రదమైంది ఇది పరమ శాంతమైంది. శివునకు మహా ఇష్టమైనట్టిది. ఆమహాలయ శ్రాద్ధమందు వేద విత్తములను భుజింపచేయాలి. అందువల్ల పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. శివుడు ఆనందిస్తాడు బ్రహ్మహత్యాది పంచ పాతకములు నశిస్తాయి. అన్ని యజ్ఞములు దక్షిణలతో కూడా విధానముగా చేసినట్లౌతాయి. సనాతన సర్వ ధర్మములు విధి ప్రకారము అనుష్ఠింపబడినట్లౌతాయి. అమావాస్యదినమందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుడు ప్రత్యక్ బ్రహ్మేకతను తెలుసుకొని సాయుజ్యమును పొందుతాడు. అచేతనుడై మహాలయ అమావాస్య నాచరించని వాని పితరులు బ్రహ్మలోక గతులైన నరకమునకే వెళుతారు. ఈ మూఢుని సంతతి ఆక్షణంలోనే విచ్ఛిత్తి నందుతుంది. అమావాస్య తిథి యందు నరులు మహాలయము కొరకు విధి ప్రకారము బ్రాహ్మణులకు భోజనం పెట్టనట్లైతే అదే మహా అనర్థమౌతుంది (సంతతి విచ్చిత్తి).
భాద్రపద మాసం వస్తే పితృదేవతలు నాట్యం చేస్తారు. మమ్మల్ని ఉద్దేశించి మా పుత్రులు బ్రాహ్మణోత్తములకు భోజనం పెడతారు. దాని వలన మాకు దారుణమైన నరకక్లేశము కలుగదు చంద్ర తారలున్నంత కాలము స్వర్గలోక వాసము కల్గుతుంది. భాద్రపదమాసం వస్తే అది పితరులకు తృప్తినిచ్చేది కనుక ప్రతిరోజు భక్తి పూర్వకముగా ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. పితృ మాతృకుల మందు జన్మించిన పితరులు తృప్తి నందుతారు. విశేషించి కృషపక్ష మందు బుద్ధిమంతుడు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నేయిపప్పు మొదలగు సస్యములతో తైలా భ్యంగ పురస్సరముగా పెట్టాలి. దీనితో ఆ కల్పము ఆనందిస్తూ పితరులు అమృతము సేవిస్తారు.
కృష్ణపక్ష సప్తమి మొదలుకొని ప్రతిరోజు నరులు అమావాస్య వరకు ముగ్గురు బ్రాహ్మణులను పూజించి భుజింపచేయాలి. ద్వాదశి నారంభించి (ఆనాటినుండి) ముగ్గురు బ్రాహ్మణులకు తప్పకుండ భోజనం పెట్టాలి. లేనిచో ఐశ్వర్య హాని కల్గుతుంది. మహా దారిద్ర్య వంతుడౌతాడు. విత్తలోభమును వదలి బ్రాహ్మణులకు సూపఘృతాదులతో వయస్సుతో పాయసాన్నముతో పెరుగు అపూపాదులతో పేయములు, లేహ్యములు, చోష్యములు(జుర్రేది) వివిధములైన భక్ష్యములు మొదలగు వానితో వేదవిదులైన ముఖ్యులను వారికి తృప్తి కలిగేటట్టుగా భుజింప చేయాలి. అందువల్ల బ్రహ్మవిష్ణు శంభులు తృప్తులౌతారు ఇందులో అనుమానం లేదు. అగ్నిష్వత్తాది పితరులు అట్లాగే ఇంద్రాది దేవతలు తృప్తులౌతారు. ఎక్కువగా చెప్పటం ఎందుకు దానితో జగత్త్రయము తుష్టమౌతుంది.
మహాలయ శ్రాద్ధమును పార్వణ విధానంతో చేయాలి. నరుడు మహాలయ శ్రాద్ధమందు పితృవంశ మందలి పితరులను వలె మాతృ వంశమందలి పితరులను కూడా సంతోషంతో శ్రేయస్సు కొరకు భుజింప చేయాలి. తన విత్తమున కనుగుణంగా శక్తి కొలది దక్షిణను కూడా ఇవ్వాలి. ఆ మహాలయ శ్రాద్ధంతో విత్త శాఠ్యము చేయరాదు. యజ్ఞములకు దక్షిణ ఆవులుగా చెప్పబడింది. (పురోగవునితో) మార్గంలో పురోగవులతో (ముందు ఆవులుంటే) శ్వాస హీనం చేయబడ్డట్టు (దుమ్మువల్ల) ఆ పితృయజ్ఞం కూడా దక్షిణ లేకపోతే హీనమౌతుంది. అందువల్ల యజ్ఞము లందు తెలుసుకొని దక్షిణ అల్పంగానైనా ఇవ్వాలి. విధవలైన స్త్రీలు కూడా అపుత్రులైన వారుకూడా మహాలయమును తమ భర్తల గురించి అధిక భోజన కర్మతో చేయాలి. లేని పక్షంలో ధర్మహాని కల్గుతుంది. గొప్పనరకం సంభవిస్తుంది.
భాద్రపద మాసం వచ్చాక మహాలయము చేయని నరుని కులము నాశనమౌతుంది. బ్రహ్మహత్యను పొందుతాడు శ్రద్ధగల వారు పితరుల గూర్చి మహాలయమాచరిస్తారు. వారికి సంతతిచ్ఛేదము కాదు. ఎడతగెని సంపద లభిస్తుంది. ఆలయము అనగా స్థానము మహా అనగా కల్యాణము కల్యాణమునకు స్థానమైనది కనుక మహాలయమని చెప్పబడింది. కనుక కల్యాణం కలిగే కొరకు నరుడు మహాలయమాచరించాలి. మహాలయమాచరించని పక్షంలో అతనికి అమంగలం కల్గుతుంది. తల్లిదండ్రులు చనిపోయిన రోజున శ్రాద్ధం చేయకపోయినా, బుద్ధిమంతుడు స్మరించకుండానే మహాలయ శ్రాద్ధమాచరించాలి.
మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తి లేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి. ధన దాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధన ధాన్యమును ఎప్పుడు కూడా పతితుల నుండి తీసుకోరాదు. ధన ధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి. రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికి పోయి అడవిలో ఏడవాలి. చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశము లందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి. మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటం లేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. మీరు దయగల వారైనా ఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడు ఇట్లాగే అరణ్యప్రదేశము లందు ఏడవాలి. అతని ఏడుపును విని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు. బ్రాహ్మణుల సమూహం మహాలయం కొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి