.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

ఈ కాలపు పిల్లల పేర్లు (వెనుకటి తరంనుండి ఇప్పటివరకూ పురోభివృద్ధిచెందిన క్రమంబెట్టిదనిన..)! (4) :ఈ కాలపు పిల్లల పేర్లు (వెనుకటి తరంనుండి ఇప్పటివరకూ పురోభివృద్ధిచెందిన క్రమంబెట్టిదనిన..)! (4) :

మరో ముఖ్యవిషయం -

“యద్యదాచరతి శ్రేష్ఠః - తత్తద్దేవేతరో జనః..” అన్నట్లుగా కాస్త చదువుకున్నవాళ్ళూ, నాలుగు చోట్లు తిరిగివచ్చినవాళ్ళూ ఏమేం చేస్తూంటారో, దానినే ఇతర (సాధారణ)వర్గాలవాళ్ళూ చేయడం సహజం. మొదట్లో పండితుల, ఊళ్ళో ఉన్న పెద్దల మాటలను, ఆచారవ్యవహారాలను చేతనైనంతవరకూ గౌరవంతో అనుసరించి, పాటించిన మామూలు జనాలు ఇప్పుడు సిటీలలో ఉండివచ్చినవాళ్ళ, నగరజీవితాలను చవిచూస్తూ, తమ ఊళ్ళకు మధ్యమధ్యలో వస్తూన్నవాళ్ళ - పద్ధతులను, మాటతీరును, ‘ఫాషన్లను, పాషన్లను’, ఇలాంటి పేరుపెట్టుకోవడాలనూ కూడా అప్రయత్నంగానైనా గమనించడం, అనుకరించడం మొదలైంది. ప్రతిదానికీ మూలాల్లోకి వెళ్ళి, విశ్లేషించే ఓరిమి ఎంతమందికుంటుంది?

“క్రొత్త ఒక వింత, పాత ఒక రోత” కదా మానవసహజలక్షణం!

గమనించవలసిన ఇంకొక సంగతి -

మనలో సంస్కృతంగురించి తెలిసినవాళ్ళు ఎప్పుడూ తక్కువే. కానీ, గమనించండి - మొదటినుండీ మన పేర్లలో దాదాపు 90 శాతం సంస్కృతపు మాటలే!

మహాప్రాణాలు (‘ఖ, ఘ, ఛ, ఝ, ..భ’), ‘ష’వంటి అక్షరాలూ ఉండడం ఈ సంస్కృతపు పేర్లకు ‘గిరాకీ’ అలాగే కొనసాగడానికి ఒక ముఖ్యకారణం. అయితే అవి దేవుళ్ళ పేర్లనుండి ఎక్కడెక్కడికో పయనించడం కూడా మొదలయింది ఈ కాలంలోనే. ఒకటి రెండు తరాల తరవాత మారుమూలన ఉన్న ఎన్నో ‘సెక్యులర్ సంస్కృతపదాలను’ మన విద్యాధికులు అన్వేషించడం అనేది పెద్ద ఎత్తున మొదలయింది ఈ కాలంనుండే (1980-85 అనుకుందాం ఉజ్జాయింపుగా).

పైన చెప్పిన ఈ కారణాలన్నిటివల్లా మనవైపునుండి చూస్తే ఈ క్రింది విధాలైన మార్పులు లెక్కలేనన్ని జరగడం ప్రారంభమయింది.

1) పేరుకు ‘అర్థం అక్కరలేదని/అర్థం లేకపోయినా పరవాలేదని’ ఘోషిస్తూ కొందరు చేసిన పదాల సృష్టి:

మరో మాటలో చెప్పాలంటే “ప్రోపర్ నౌన్-కి నీవు కావాలనుకుంటే గొప్ప ‘ధ్వనియుతమైన’ పేరు పెట్టుకో, అంతేగానీ అర్థం ఎందుకు? అనవసరం!” అని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ బోధించడం (తమకు తోచిన ఈ ‘క్రొత్తదనాన్ని’ నలుగురికీ పంచిపెట్టాలనే తాపత్రయంతో కావాలని ఇటువంటి పేర్లను ఉత్పత్తిచేయడం, అక్కడితో ఆగకుండా అందరికీ ‘ఇలా చేస్తే బాగుంటుం’దనే సలహా ఇవ్వడం). ఈ కాలంనాటి ఒకరిద్దరు రచయిత(త్రు)లు కూడా హోల్-సేల్-గా ఈ పనికి శ్రీకారం చుట్టారు.

కొన్ని ఉదాహరణలు -

అ) ‘ర’ కు క్రింద ‘ణ’ పలకడం సులభమైనా ‘న’ పెట్టి పేర్లను వ్రాయడం, పరోక్షంగా వాటిని ‘పాపులర్’ చేయడానికి ప్రయత్నం

ఉదాహరణకు ‘అపర్ణ’, ‘సవర్ణ’, ‘సంపూర్ణ’, ‘విష్ణు’ వంటి పేర్లలో సహజమైన ఉచ్చారణ ఇదే విధంగా (‘ణ’తోనే ) ఉంటుంది, ఆ విధంగా పలకడం సులభం కూడా. కానీ, ఒకరు పనిగట్టుకుని బోధించినది ‘అపర్న’, ‘సవర్న’, ‘సంపూర్న’, ‘విష్ను’ - ఇలాగ వ్రాస్తూ, ఇలాగే చదవమని కూడా! ఈ ‘ద్రావిడప్రాణాయామం’ ఎలాగుందంటారు?

ఆ) ‘శ’ ఉన్నచోట కుంటి ‘స’ను వాడడం - ‘సుభద’ (‘శుభద’ అంటే శుభాన్నిచ్చేది అనే అర్థం ఉన్నా సరే!) ‘సుభద’కు అర్థమే లేదు సుమా!

ఇ) ‘శీనివాస్’ (‘శ్రీనివాస్’ అని అక్కర్లేదట - ‘proper noun’ కాబట్టి! ఇది నవ్యతా?)

ఇదే రచయిత పాపం ఒకచోట ‘అద్రిజ’ (‘పార్వతి’కి మరో పేరు) అని సరిగా వ్రాసినా, అది ముద్రారాక్షసం కారణంగా ‘అదిజ్ర’ అని పడింది! అది మరో గొప్ప పేరని అనుకున్న ఒకరిద్దరిని కూడా నేను గమనించాను!
(“సాగుతున్నమ్మ చాకలితో లేచిపోతే అది కూడా ఒక వ్రతం అనుకున్నారట!” అనే సామెత గుర్తుకొస్తుంది నాకు ఈ ‘నామరాజం’ జ్ఞాపకంవచ్చినప్పుడల్లా!)

2) సంధుల, గొందుల ప్రమేయం లేకుండా ‘ఎక్కడో విన్నవాటిని’ ‘ఇక్కడ పాపులరైజ్’ చేయడం.

‘అనూష’ అనే పదం అంతగా ప్రచారంలోకి రావడానికి ముఖ్యకారణం రచయిత ఆ మాటను విశ్లేషించి చెప్పడం కాదేమో! దానికంటే ముఖ్యమైన కారణం - ఆ పాత్ర ఒక ఇంటర్వ్యూలో starting with a bang అన్నట్లుగా (అనుభవం లేకపోయినా) ఏకంగా ‘జనరల్ మేనేజర్’ అయిపోవడం కావచ్చుననిపించకమానదు. (అదే ‘అంట్లు తోమే పాత్ర’ అయి ఉంటే జనాలంతగా ఈ పేరుకు ఎగబడేవారు కాదేమో?)(దీనిని చదివిన ఒక పాఠకుడు ఆ వారపత్రిక మరుసటి వారం సంచికలో అప్పుడే పుట్టిన తన పాపకు ఇదే పేరును పెట్టుకున్నానని ప్రకటించాడు కూడా!)

ఈ మాటకు రచయిత చేసిన సంధి(!) ఇలా ఉంది!

‘అనూన+ఉష’ -> అనూష (‘బూజుపట్టిన’ వ్యాకరణం ప్రకారం అది ‘అనూనోష’ కావాలి నిజానికి! దానికి ‘గుణసంధి’ అనే పేరు కూడా పెట్టారు ఆనాటి చాదస్తపు మనుషులు! కానీ, ‘కవి’ నిరంకుశుడు కదా! ‘బహువర్ణలోపసంధిని’ ఒకదానిని సృజించాడు ఈయన! ఏది ఏమైనా ఎక్కువ వోట్లే పడ్డాయి ఈ ప్రయోగానికి!)(అన్నట్లు ‘అనూన’ = న+ ఊన = సంపూర్ణమైనది)

‘ఉష’కు రూపాంతరం ‘ఊష’ అనేది ఒకటుంది. దానినుపయోగించి, మేము ఈ పేరును వేళాకోళంచేస్తూండేవాళ్ళం:

ఉషా = ఉషస్సు → ‘చీకటినుండి వెలుగుకు’ ప్రతీక - పురోగమనం

న+ఊషా = అనూషా (వ్యతిరేకసంధి) → ‘వెలుగునుండి చీకటికి’ ప్రతీక - తిరోగమనం

ఇలా మేము చేసిన విశ్లేషణకు ఈ పేరు పెట్టిన/పెట్టుకున్న ఎంతోమంది ఉడుక్కునేవారు.

అయినా, తమిళులు ‘అనురాధ’ నక్షత్రాన్ని ‘అనూషం’ అంటారు, ‘అది మంచి పేరే అయి ఉండచ్చునేమో?’ అని అనిపించి, ఆంధ్రప్రభ వారపత్రికలో కీ.శే. తిరుమల రామచంద్రగారిని ఈ పేరుగురించి అడగ్గా, “మీరు దాన్ని వ్యతిరేకసంధిగా పరిగణించనక్కరలేదు, “అను+ఉష‘’ = కూడా “అనూష” కదా (సవర్ణదీర్ఘసంధి)! ‘విశాఖ’నక్షత్రానికి ‘రాధ, ఉష’ అనే నామాంతరాలున్నాయి. ‘ఉషను అనుసరించేది - అను+ఉష= అనూష’, ఈ కారణంగానే మన ‘అనురాధ’ వారికి ‘అనూషం’ అయింది!” అంటూ సహేతుకంగా వివరించారు.
ఒక మాటను సృష్టించడానికి ఇంత కసరత్తుండాలనే విషయం చక్కగా చెష్పినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాము. ఇదంతా ఎందుకు చెప్పవలసివచ్చిందంటే ‘అజ్ఞానబోధలు పెక్కురీతులలో జరగడానికి ఆస్కారం ఉంది సుమా!’ అని తెలియజేయడానికి!

(ఇదే రచయిత ఒక నవలకు ‘...సింధూరం’ అని పేరు పెట్టాడు, దాన్ని సినిమాగా తీసినప్పుడు వాళ్ళు ఈ అనవసరపు ‘మీసాన్ని’ తీసేసి, ‘.. సిందూరం’ అని మార్చుకున్నారులెండి! అలాగే ‘భూపాలరాగంలో అంతరగాంధారం’, ‘రసస్వానాంధులు’ వంటి మరెన్నో విశేషాలను, చిత్రవిచిత్రపదాలను ఆయన తెలుగువారికి ప్రసాదించాడు!)

ఈ రచయితే మరోచోట ‘ఇరిటేషన్’ అనే పదాన్ని వాడి, దానికి సరైన తెలుగుపదం తనకు దొరకట్లేదన్నాడు, దాంతో ఒక అభిమానపాఠకుడు ‘ఆయనకే తెలియకపోతే ఇక తెలుగులోనే లేనట్లే!’ అని వ్రాసేశాడు! (‘చికాకు/చిరాకు’ దీనికంటే సమర్థవంతమైన అనువాదపు మాటలు కావా?)

తిరిగి ఇది కూడా ఎందుకు వ్రాయవలసివస్తోందంటే, ఇవన్నీ పాఠకుల ‘ఓపికలు తగ్గిపోవడానికి’ ఉదాహరణలే! రచయితలూ పొరపాట్లు చేయచ్చు కదా! కొన్నికొన్నిటినైతే వదిలేయవచ్చుగానీ, పేర్ల సంగతేమిటి? అవి జీవితాంతం, ఆ తరవాత కూడా ఉండేవే కదా! ఎంత జాగ్రత్తపడాలో మనం ఆలోచిస్తున్నామా?

3) అల్ప, మహాప్రాణాలను విచ్చలవిడిగా తారుమారుచేసిన ‘భారీ పరిశ్రమ’వారి తయారీ:

చాలామంది గొప్పలకు పోయి, ఈ పెద్దక్షరాలనూ, చిన్నక్షరాలనూ తారుమారుచేయడం కూడా మొదలుపెట్టినది ఈ “స్వర్ణయుగం”లోనే! కొన్నిటిని గమనించండి -

ఉపద - కానుక; ఉపధ - మోసం/కుట్ర
వంద్య - పూజనీయురాలు; వంధ్య - గొడ్రాలు
విదుర్ - తెలివైనవాడికి సంకేతం; విధుర్ - భార్య లేనివాడు
ఆది - మొదలు; ఆధి - మానసికవ్యాధి
ప్రదానము - ఇవ్వడం; ప్రధానము - ముఖ్యమైనది
మేద - క్రొవ్వు; మేధ - తెలివి, చురుకుతనం..
బోద - వాపు (బలుపు కాదు….); బోధ - జ్ఞానం, నేర్పడం
విశిష్ట - గొప్పదైన; విశిష్ఠ - ఏమీ కానిది
వసిష్ఠ/వశిష్ఠ - గొప్ప ఋషి; వసిష్ట/వశిష్ట - ఈ పేరుగలవాడు ఋషీ లేడు, మానవమాత్రుడు కూడా ఎవడూ లేడు!
నిష్ఠ - నియమం, శ్రద్ధ కలిగినది; నిష్ట - ఇదేమిటో తెలియదు!
శ్రేష్ఠ - గొప్పతనం కలిగినది; శ్రేష్ట - ఇదేమిటో తెలియదు!
శిష్ట - మంచి పద్ధతి కలిగినది; శిష్ఠ - ఇదేమిటో తెలియదు!
ధనిష్ఠ - ఒక నక్షత్రం; దనిష్ట/ధనిష్ట/దనిస్ట - ఇదేమిటో తెలియదు! (ఇలా చేయడం మన ఇష్టం ప్రకారం కాదు!)
వరిష్ఠ - శ్రేష్ఠమైనది; వరిష్ట - ఇదేమిటో తెలియదు!
పటిష్ఠ - బలమైనది; పటిష్ట - ఇదేమిటో తెలియదు!

(అయినా ఎన్నో వార్తాపత్రికలు ఇప్పుడిప్పుడే ఇలాగ వ్రాయడం మొదలయింది- సాహిత్యంకోసం ఒక విభాగమంటూ లేని, కేవలం అధికారపార్టీని దుమ్మెత్తిపోయడానికి మాత్రమే బ్రతుకుతున్న, కొన ఊపిరితో ఉన్న, లేదా పిల్లకాకులుగా పుట్టుకొస్తున్న చాలా పత్రికల భాషలో ఇలాటి భ్రష్టపదాలే మరిన్ని ఎక్కువగా కనిపిస్తాయి ఈ రోజుల్లో ఇంకా ఇంకా - ఆశ్చర్యపడకండి!)

(ఇవన్నీ కాస్త తెలిసినవారిదగ్గరకు వెళ్ళి, ఏది సరైనదో అని అడిగితేగానీ తెలియని పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది!)

4) కొన్ని ప్రత్యయాలను ఇష్టం వచ్చేటట్టు చేర్చేయడంతో ఏర్పడిన మాటలు (వీటిలో కొన్ని “నార్తిండియా”నుండి (ఢిల్లీ, ముంబయీ, కోల్కోటా వగైరాలు) దిగుమతైనవీ ఉంటాయి) - ఏదో అర్థం ఉన్నట్లు హడావుడిగా (కని)వినిపించినా, నిజానికి అర్థం లేని/రాని మాటలు

అ) మేఘన (‘మేఘ’ శబ్దానికి అలా సునాయాసంగా ‘న’ చేర్చేస్తే సరిపోదు!) ‘గర్జ్, చూష్’ వంటి ధాతువులనుండి ‘గర్జన, చూషణ’వంటి మాటలేర్పడతాయిగానీ, ‘మేఘ, రామ, భీమ, భామ’వంటివాటికి ‘న’చేర్చి ‘మేఘనా’దులను సృష్టించలేము, వాటినుండి గర్జనలు కావు కదా - పిల్లికూతలు కూడా రావు! పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం ఉండదు కదా! {వచ్చిన చిక్కల్లా ఎక్కడుందంటే ఎవరో ఒకరిద్దరికి ఇంతకుముందే ఈ పేర్లుండి, వారు ‘సక్సెస్’ అయిపోతే, ‘ఓహో! వారి ‘ఎక్సెస్ ఆఫ్ సక్సెస్’కి కారణం ఈ పేరేనన్నమాట! అని భ్రమపడడమే!}

ఆ) ముఖ్యమైన మరికొన్ని ‘ఫేషనబుల్’ తగిలింపులు - ‘త’, ‘జ,’ ‘ద’ ప్రత్యయాలు

‘త’ ప్రత్యయం (సంస్కృతపు మాటలైతేనే సుమా!) ఆ పదంయొక్క లక్షణాన్ని చెప్తుంది. కానీ ఈ రెండు క్రింది తెలుగు (?)మాటలను గమనించండి -

‘విరిత’, ‘సిరిత’ | ‘విరి’ తెలుగు మాట (పూవు), ‘సిరి’ తెలుగు మాట (సంపద);
‘త’ అనే ప్రత్యయం సంస్కృతసంబంధి. ఇలా చేర్చితే వచ్చే మాటలకు చతుర్ముఖబ్రహ్మగారు కూడా అర్థంచెప్పలేడు. ‘హరిత, సమత, జనత, నమ్రత, విదిత, ముదిత’ వంటివి సాధురూపాలుగానీ, ఇదే లెక్కన ‘బరి-త, ఉరి(తీ)త, అల-త, ఊరి-త, కసి-త, వరి-త, ఇరి-త, సారి-త, విషి-త’ వంటివి ఏర్పడితే మనకు కలిగేవి - ‘కలత,నలత!’

చాలాకాలంగా వాడుకలో ఉన్న మరో పేరు - ‘అనిత’ (కచ్చితంగా ‘నార్తిండియా’ దిగుమతే ఇది). - దీనికి అర్థం చెప్పగలిగినవాడెవడూ దొరకట్లేదు!
గురువును మించిన శిష్యుడిలాంటిది, దీనిని మించిన మరో పేరు - ‘హనిత’ - దీనికీ అర్థం చెప్పడం కష్టమే! (‘హన్’ అనే ధాతువుకు ‘చంపడం’ అనే అర్థం ఉందని మాత్రం ధైర్యంగా చెప్పచ్చు. ఆ తరవాత ఏమో మరి!)

ఇ) అలాగే, ‘జ’ అనే ప్రత్యయాన్ని చివర చేర్చితే అంతకు ముందు భాగంలో ఉన్నదానినుండి పుట్టినదనే అర్థం ఏర్పడి, ఒక క్రొత్త అర్థం ఉన్న మాట ఏర్పడుతుంది (ఇది కూడా సంస్కృతపు మాటలకు మాత్రమే వర్తిస్తుంది).

జల+జ -> జలజ = నీటిలో పుట్టినది, అలాగే వనజ, అంబుజ, వారిజ, సదాగతిజ (వాయుపుత్రుడు) మొ/

ఈ) అదే విధంగా ‘ద’ అనే ప్రత్యయాన్ని చివర చేర్చితే (సంస్కృతంలో మాత్రమే) పేరులోనే దానికి ముందు భాగంలో ఉన్నదానిని పుట్టించేది అని కూడా మనలో చాలామందిమి చదువుకున్నాం కదా!

జలద, వారిద, అంబుద, వనద -> ఇవన్నిటికీ ‘నీటిని ఇచ్చేది’ = ‘మేఘం’ అనే అర్థం వస్తుంది. అలాగే మిగతావి కూడా!

మన ఈ విద్యాధికులు ఈ ‘చివరనున్న అక్షరాలమీద’ కూడా పడ్డారు! దాంతో తామరతంపరగా ఈ నమూనాలో కూడా ఎన్నో క్రొత్త పేర్లు పుట్టుకురావడం మొదలయింది. వీటిలో చాలావాటికి అర్థాలు దొరకడమూ చాలా కష్టమే! ఎందుకంటే ముందు భాగం అచ్చతెలుగు మాట అయి ఉండడమో, రెండు పొడి అక్షరాల కలయిక మాత్రమే అయి ఉండమో - అనే కారణాలవల్ల.

శ్రీనిజ → ‘శ్రీని’ అనే శాల్తీ లేదు కదా! కాబట్టి దీనికి అర్థం ఉండదు. పోనీ ‘నిజ’ అనే మాటకు ‘శ్రీ’ చేర్చారనుకుంటే - ‘శ్రీ అబద్ధ, శ్రీ కల్ల, శ్రీ హుళక్కి’ వంటి మాటలు కూడా ఉండచ్చు కదా!

ఇలాటివాటిని కోకొల్లలుగా పుట్టించవచ్చు మీరు కూడా. వినే అదృష్టం మాది. అంతే! కావాలంటే మరి నాలుగైదిటిని పేర్కొంటాను.

“లసద, కలజ (కలలో పుట్టినది?), లకజ, లకద, సభద, భసద, సఖద, సఖజ, నఖజ (గోరునుండి పుట్టినదనే అర్థం ఉందండోయ్ దీనికి!), రమద (లక్ష్మీదేవినిచ్చేది కాదు సుమా! ‘రమా-ద’ కావాలి అప్పుడు) ముఖద,….”

అన్నట్లు ఇక్కడే ఔత్సాహికులకు ఒక గణితసంబంధిత సమాచారం -

అర్థాల సంగతిని ప్రక్కన పెడితే 3 విడివిడి అక్షరాలతో 6 పేర్లను రాబట్టవచ్చును. (‘ధ, ఫ, ఖ, ఘ’ వంటి అక్షరం కనీసం ఒకటైనా ఉంటే పేరు మరింత ‘మోత’గా కూడా ఉంటుంది కూడా!)

‘ర, ఖ, చ’ అనే 3 అక్షరాలతో 6 రకాల ‘ముగ్గులను’ (అవే - పేర్లు!) వేయచ్చు (అర్థం సంగతి అడగద్దని ముందే చెప్పాను కదా!)

“రఖచ; రచఖ; ఖచర; ఖరచ; చరఖ; చఖర” - క్రమం కూడా ప్రాముఖ్యాన్ని కలిగిన ఈ ఏర్పాటును permutation అంటారు. [Factorial 3 or /_3 or 3!]ఈ కాలపు పిల్లల పేర్లు (వెనుకటి తరంనుండి ఇప్పటివరకూ పురోభివృద్ధిచెందిన క్రమంబెట్టిదనిన..)! (5) :

తిరిగి, ముందు చెప్పినదాంట్లో ఏ ఒక్క అక్షరాన్నో - ‘ఖ’ బదులు ‘ఖి’, ‘చ’ బదులు ‘చు’ - ఈ విధంగా ప్రతి అక్షరంలోని గుణింతాలనూ స్వల్పంగా మార్చితే మరిన్ని పెర్ముటేషన్లు! తెలుగులో 56 అక్షరాలు కదా! ప్రయత్నించి చూస్తే ఆ ‘అపరిమిత’ ఆనందం ఏమిటో అనుభవైకవైద్యం! నా ఓపిక మాత్రం ప్రస్తుతానికింతే!

అలాగే 3 కు బదులు ‘ర,ఖ,చ,మ’ అనే 4 అక్షరాలున్న మాటలు కావాలనుకోండి, దాని దుంప తెగ, ఆ సంఖ్య ఎంతో తెలుసా? = 4×3×2×1 = 24 (factorial four) “రఖచమ, ఖచరమ, చరఖమ…. మీకు “అవ్వా కావాలీ, బువ్వా కావాలీ” అనుకుంటే (అంటే అర్థం కూడా) రెండిటికో, మూడు మాత్రమే పేర్లతోపాటు అర్థాలు కూడా పొరపాటున దొరకచ్చు ఆ 24లో! అనంత సంఖ్య కావాలంటే ఒక్కొక్క అక్షరానికి గల అన్ని గుణితాలూ వాడండి - బహుశః అప్పటికి ఏర్పడిన సంఖ్య రామకోటిని దాటేసే అవకాశం లేకపోలేదు.

{సందర్భం కాకపోయినా మీకొక మాటను గుర్తు చేయాలిక్కడ - విష్ణువు చేతిలో ఉండే శంఖ, చక్ర, గదా, పద్మాలనే 4 పరికరాలనూ 4 చేతులలో ఉంచి, ఒక్కొక్క ఏర్పాటుకు వేరే వేరే పేరు ఇచ్చుకుంటూ పోతే వచ్చే పేర్లు ఇరవైనాలుగే! అవే మనం ఏదైనా పూజను మొదలుపెట్టే - “కేశవ, నారాయణ, గోవింద, విష్ణు…. హరి, శ్రీకృష్ణ” అనేవి! లెక్కపెట్టి చూడండి - 24 వస్తాయి.}

5) వేరే భాషలవాళ్ళ పేర్లు మాత్రమే గొప్పగా ఉంటాయనే అపోహను కలిగించడంలో కూడా చాలా వేగోధృతిని చూపించగలిగారు మన రచయితలు/త్రులు. ఏదో ఒక నవలలో ఒక పాత్ర అడుగుతుంది మరొకర్ని - “మీరు బెంగాల్లోనో, మహారాష్ట్రలోనో పుట్టి పెరిగారా? మీ పేరు (నమ్రత) చాలా నాజూకుగా ఉంది!” అంటాడొకాయన ఒక అమ్మాయితో మాట్లాడుతూ. (మన పేర్లలో ఒక్కటీ నాజూకుతనం ఉన్నది దొరికుండదీ రచయితకు! ఎంతైనా ఈయనా తెలుగువాడే కదా!)

6) ఎక్కడా అంజనం వేసినా అర్థం దొరకని మాటలకు తలుపులు బార్లా తెరిచిపెట్టడం:

“సంజంతి, లావంతి, జీవంతి, జలంతి (‘జ్వలంతి’ అంటే ఒకటికంటే ఎక్కువమంది కాలిపోతున్నారని అర్థం), కారిక, లాసిక, ఓరిక, హసిక, ఋషిక, (‘మూషిక’ ఇప్పటివరకూ రాలేదెందుకనో?) భావష, విదిష (ఈ పేరుతో ఒక పాతనగరం ఉందిగానీ, అది ‘విదిశా’) కుషా, అంకుషా, అంకుష్ (‘అంకుశ’ అంటే మావటీడు ఏనుగు నెత్తిమీద పొడిచేది), మినిషా, నిరోషా (‘హమేషా, తమాషా, మటాషా, సమోసా, దిలాసా’ కూడా పెట్టుకోవచ్చు కదా!), హదస, విలత్, విలిత, అమీషా (‘ఆమిష’ అంటే మాంసఖండం అనే అర్థం మాత్రమే ఉంది!), తితిష (‘తితిక్షా’ ఉంది = ‘ఓరిమి’) పులిష, హలిష, తిలిష, జజుష, ఖతిజ, ….”

7) ‘ప్రక్కనే’ మంచి పేరున్నా, దాన్ని వదిలి, ఎవరో ‘అంకెలపండితుడు’ చెప్పిన విధంగానో, లేక అర్థాన్ని తెలుసుకోకుండానో, ‘ఫలానా అక్షరం కచ్చితంగా ఉంటే కలిసొస్తుం’దనుకుంటూ ‘గ్రహపాటు’ను నమ్మిన కారణంగానో పేర్లు పెట్టడం కూడా ఈ కాలంలోనే ఉధృతంగా మొదలైంది, తరవాత ఏర్పడిన ‘జర్క్ శకం’నాటికి ఇదే ‘అలవాటైపోయింది’ కూడా.

ఉదా: ‘త్విష’ అంటే కాంతి కిరణం. దాన్ని వదిలేసి, - ‘త్రిష’

‘మోహన్/న’ అంటే ‘ఆకర్షించేవాడు(ది)’; దాన్ని వదిలేసి - ‘మోహిత్/మోహిత’ (వ్యామోహంలో పడినవాడు/పడినది)

‘రక్షక్’ అంటే రక్షించేవాడు (హీరో); దాన్ని వదిలేసి - ఒట్టి ‘రక్షిత్’ అని. ఏ దేవుడి పేరు తరవాతో ఈ ‘రక్షితుడిని’ చేర్చితే కనీసం ఆ దేవుడైనా ఈ పిల్లాడిని రక్షిస్తాడనుకోవచ్చు - అదీ కాదు, ఒట్టి రక్షితుడే! అంటే మనలోనే ఎవడో ఒకడితడిని కాపాడుతూనే ఉంటాడు/ఉండాల్సిందే!

‘ఆలోక్/ఆలోక’‘ అంటే ‘కాంతి/చూపు’; దాన్ని వదలి - ‘అలోక’ (ప్రళయం/జనం లేని స్థితి)!

‘భావుక’ అంటే ‘శుభప్రదమైనది’; దాన్ని వదలి - ‘భావిక’ (?)

‘భిషక్’ అంటే ‘వైద్యుడు’; దాన్ని వదలి - ‘భిషుక్’ (ఇంకా నయం “భిక్షుక్” కాడు!)(?)

మా లెక్కల మేష్టారంటూండేవారు - “ఒరే! సరైన ఆన్సర్ ఇవ్వగలిగినంతవరకూ కాపీ చేసినవాడిని పట్టుకోలేం! తప్పు ఆన్సర్లు రకరకాలుగా ఉంటే కాపీ చేసినట్లు కాదు గానీ, వరసగా ఒకే తప్పు ఆన్సరు నలుగురి దగ్గర వస్తే వాళ్ళలో ముగ్గురు కాపీచేసినట్లే!” (ఇదెంతగా ఈ పేర్లకు అన్వయిస్తుందో గమనించండి!)

8) కొన్ని చిత్రవిచిత్రాలైన, లేదా నాసిరకం/silly అర్థాలొచ్చే పేర్లు:

“హసంతి” - “(నలుగురూ) నవ్వుతున్నారు (ఈ పేరు పెట్టినందుకో ఏమో!)”
“సైకత్” - “ఇసుక”
“మృత్” - “మన్ను”
“గోమయ్” - “పేడ”
“కాంతార్” - “అడవి”
“బి(వి)పిన్” - “అడవి”
“ముకుళ” - “ముడుచుకుపోయినది/మూసుకుపోయినది”
“నలక” - (కంట్లో పడేది) (ఈ పేరు లేదనుకోవద్దు!)
“చకిత” - “భయపడినది”
“వనిత/ప్రమద/మహిళ” - “స్త్రీ” (ఎదురుగా ఉంటే ఆడదని తెలుస్తుంది కదా! వేరే నొక్కి చెప్పాలా మగరాయుడు కాదని?) ఏదో ‘శ్రీ’నో, ‘రత్నాన్నో’ చివర్న తగిలిస్తే కనీసం స్త్రీలలో శ్రేష్ఠురాలనైనా అర్థం వస్తుంది. లేకపోతే, కేవలం స్త్రీ మాత్రమే!
“రుధిర్” - “రక్తం”
“సిక్త” - “తడిసినది”
“అసిత” - “నల్లనిది” (దేనికి ప్రతీక? అజ్ఞానానికేమో?)
“అస్మిత” - “నవ్వు” అనేది కానిది (ఏమది?)

9) వేరే భాషలల్లోకి వారివారి వ్యాకరణాన్ననుసరించి వాటిల్లోకి పోయి కూర్చున్న బాపతు పేర్లు (ముఖ్యంగా ఈ ఖంగాళీవి బెంగాలీనుండి ఎక్కువగా తెచ్చుకుని మురిసిపోయే బాపతు)

పాపం శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కాలంనాటినుంచీ ఎవరో ఒకరు మొత్తుకుంటూనే ఉన్నారు - “బాబూ! ఇలాటి పేర్లు పెట్టుకుని బుజాలెగరేసుకోనక్కర్లేదూ..” అంటూ! అలాటి సలహాలను వింటే మనం తెలుగువాళ్ళమెలా అవుతాం?

“లలిత” కు - “లొలిత” లేదా “లోలిత” (అర్థం మారిపోయింది - ‘ఊగిసలాడినది’ అని. ఇంకెక్కడి లాలిత్యం?)
“రమేశ్”కు - “రొమేష్”

వాళ్ళ భాషలో మొదటి అచ్చు ‘ఒ’ కాబట్టి అలా మారి ఉండచ్చు. కానీ అందులో కూడా మనకు ‘గ్లామర్’ కనిపిస్తోందంటే మనగురించి మనమే ఏమనుకోవాలి?

మరొక ‘బంగాళా’దుంప - ‘సుబ్రోతో/సుబ్రోటో’ - అసలు పేరు సంస్కృతంలో “సువ్రత”; శ్రీరాముడికిగల సార్థకనామధేయాలలో ఇది ఒకటి. “సకృదేవ ప్రపన్నా..” అనే శ్లోకంలో ‘శరణువేడినవాడిని చేరదీయడం నా వ్రతం’ అని ఆయన అన్న కారణంగా ఈ పేరాయనకు కలిగింది! ఇదే పేరు విష్ణుసహస్రనామాల్లో కూడా ఉంది, గుర్తుకు తెచ్చుకోండి! ఎన్ని ‘వంఖరలు’ తిరిగిందో ఈ పేరు మనదగ్గరకు వచ్చేటప్పటికి - గమనించారా? ఇలాటి పేర్లను కూడా నెత్తిన పెట్టుకున్న పండితప్రకాండులు కూడా మనలో మునుపూ ఉండేవారు, ఎప్పటికీ ఉంటారు కూడా!

ఇక్కడికి వేగోధృతి శకం పూర్తయిందనుకోవచ్చు.

ఈకాలపు పిల్లల పేర్లు
(వెనుకటి తరంనుండి ఇప్పటివరకూ పురోభివృద్ధిచెందిన క్రమంబెట్టిదనిన..)! (6) :

“అదుపులేని కుదుపు (jerk)” శకంలోకి అడుగుపెట్టాం ఇప్పుడు.

కుదుపు (jerk) అంటే ఏమిటో ముందే చెప్పుకున్నాం కదా! వేగంలో వేగం, తిరిగి ఆ వేగోధృతిలో మరీ మరీ మార్పు - అంటే ‘నేలవిడిచిన సాము’ బహు సమర్థవంతంగా పూర్తయి, మనం ఏమీ చేయలేక అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండడం తప్ప మరొకటి చేయలేనంతగా మార్పు వచ్చేసినట్లు - అని!

దీనికి దోహదకారులైన అంశాలు:

1) తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా నాటి నవలలే నేటి టీవీ ధారావాహికలుగా రూపాంతరం చెందడం - వాటిల్లో కూడా ‘కొంగ్రొత్త’ పేర్ల ‘గుబాళింపు’

2) పిల్లల పేర్లపైన పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రావడం - వాటిలో చాలా పుస్తకాలలో ఆ పేర్లకు అర్థాలు లేకపోవడం, సౌండ్ కోసం వేరేచోట్ల పేర్కొన్న అల్పప్రాణ,మహాప్రాణాల తారుమారు వగైరా (అతి వేగవంతంగా జరుగుతున్న ఈ ప్రక్రియకు నొచ్చుకుంటూ, ‘బంగారుపాపలకు రంగారు పేర్లు’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని8 ఏళ్ళ క్రిందట ముద్రింపించి, అర్థాలను కూడా ఇస్తూ, పెట్టకూడని కొన్ని పేర్లను కూడా ఇవ్వడంవంటి చాదస్తపు పనులను కూడా చేశాడీ వ్యాసరచయిత కొన్నేళ్ళక్రిందట! )

3) వీటికంటే జోరుగా ‘మనేకాగాంధీ’ వంటివారి పుస్తకాలు కూడా రావడం (ఈ పేర్లలో చాలావాటికి తార్కికమైన అర్థాలు దొరకవు - ‘టెలిఫోన్ డైరక్టరీలో’ ఉండే విధంగా ఉండే అకారాది సమాచారం తప్ప), ఉత్తర-దక్షిణ, తూర్పు-పడమర ఎల్లలు తొలగిపోయి, వేరే దేశాలనుండి కూడా చాలా పేర్లు దిగుమతి కావడం

కొన్ని పేర్లకు ఈ రచయిత/త్రులు ఇచ్చే అర్థాలు (ఇస్తే, గిస్తే) చాలా విపరీతంగా, దారుణంగా ఉంటున్నాయి కూడా! ‘ఎక్కడ దొరికిందయ్యా నీకీ అర్థం?’ అని గట్టిగా అడిగితే తెలిసీ తెలియని బుకాయింపులు. ఏ అస్త్రమూ పనిచేయకపోతే - “అన్నట్లు మర్చేపోయాను! ఇది టాంజానియా పేరు/చైనీస్ పేరు.. ఏ భాషలో ఉంటేనేం? ఏదో ‘గొప్ప’ అర్థం ఉంది కదా!” ఇలాటి సమాధానాలు! (అది టాంజానియాది అవునో కాదో వెతుక్కోవడం మనకు అసాధ్యమని అవతలివాడికి తెలుసు సుమా!)

4) ఇంటర్నెట్ మాధ్యమం ఉపయోగం రోజురోజుకూ పెరిగిపోతూ, కాస్త తీరిక ఉన్న ప్రతివాడూ అయాచితంగా పేర్లపైన సలహాలను వ్రాయడం, ఎవరైనా సలహా అడిగితే రెచ్చిపోయి మరీ ఏవేవో ‘అభూతకల్పనలను’ చెప్పడం, పట్టికలను ఇవ్వడం (అప్-లోడింగ్), ఆ పేర్లను చాలామంది “కామమ్మ మొగుడంటే కామోసు” అన్నట్లుగా ఏమీ ఆలోచించకుండా స్వీకరించడం (ఉదాహరణకు - విష్ణుసహస్రనామాలకు ఎంతో మంది తమకు తోచిన అర్థాలను ఇస్తూనే ప్రతివాడూ అది “శంకరభాష్యానికి అనుగుణంగా ఉం”దనడాన్ని కొందరైనా గమనించి ఉంటారు! అలాటివే ఎన్నో పేర్లకుగల ‘వక్రభాష్యాలు’ కూడా!)

4) ‘సందట్లో సడేమియా’ అన్నట్లుగా ఈ మధ్యకాలంలో ‘పేరు’ - ‘ఫలానా అక్షరంతోనే మొదలవా’లనే ‘దైవజ్ఞుల క్రొత్తరకం ఆంక్షలను’ చదివీ, వినీ, వాటిని పూర్తిగా నమ్మి, ఎందరో పిల్లల తలిదండ్రులు మానసికంగా ఉత్సాహ, ఉద్రేకభరితులు కావడం, అలా చేస్తే మాత్రమే తమ పిల్లల పేర్లు, భవిష్యత్తు బాగుంటాయనే నిశ్చయానికి రావడం

5) పై కారణాలన్నిటివల్లా, పేర్లకు గల అర్థాలకు ప్రాముఖ్యత దాదాపు తగ్గిపోవడం.

ఈ దశకు ఇవ్వవలసిన ఉదాహరణల (అవి అసంఖ్యాకం కాబట్టి ఎన్నిటిని చూపగలం?) విషయానికొస్తే, ఈనాడు ఎంతోమంది పెడుతున్న పేర్లలో బీభత్సం, భయానకం, తెలియకుండానే కొంత (అప)హాస్యం - దీన్నంతా గమనిస్తే వాటి అర్థాలను (ఉంటేగింటే ‘నెగెటివే!’) గమనించినవారిలో జాలి (కరుణరసం) తప్ప మరేవీ కనిపించడం లేదు. ఎన్ని పేర్లను ఈ శకంలో ఉదహరించగలం? అపరిమితంగా, పుంఖానుపుంఖాలుగా పేర్లు పుట్టుకొస్తున్నాయ్ - దేవుడి పేరు ఒక అక్షరంలో, మహాప్రాణం మరొక అక్షరంలో (హడావుడికోసం), ప్రత్యయం మరొక అక్షరంలో - వీటినన్నిటినీ కలిపివండిన పంచకోళ్ళ కషాయాలు తయారవుతున్నాయి. అదేమిటో గానీ, వాటిని ఆరగించి, ఆనందిస్తున్నవాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది!

ఎవరో ఋషికి కోపం వచ్చి, గడ్డంనుండి ఒక వెంట్రుకను నేలమీద పడేస్తే వెయ్యేసి రాక్షసులు పుట్టుకొస్తున్నట్లుగా పేర్లు ‘మాన్యుఫేక్చ’రవుతున్నాయి. మా చిన్నప్పుడు ఈనెను కట్టకుండా ఉంచి వదలిన తారాజువ్వలను మొండిజువ్వలనేవారు. అలాగే ఉన్నాయి ఈ పేర్లు! ఎటు తీసుకెడుతుందో తెలియదు ఒక్కొక్క అర్థం (వినడానికి చిత్రవిచిత్రంగానే ఉండం మాత్రం ఖాయం)!

పరిస్థితి చేయిదాటిపోయిందని తెలిసికూడా కొందరు ఈ వ్యాసరచయితలాగే ‘తెగ ఫీలయిపోతున్న’ కారణంగా, వీటికి విరుగుడుగా మనం ఏమైనా చేయగలమో లేదో తెలిసినంతమేరకు సూచిస్తూ ఈ వ్యాసం ముగించబడుతోంది.

నాకు తోచిన పరిష్కారాలు:

1) పేరు ఫలానా అక్షరంతోటే మొదలవాలని ఏ శాస్త్రం చెప్తోంది? నేటి నేపథ్యంలో ఆ ‘రూల్’కి గల ప్రాముఖ్యాన్ని చూద్దాం ముందు -

మా తరంలో ఎవరికీ “ఈ పిల్లకి ‘త’తోనే పేరు మొదలవాలి, లేదా ‘హ’తోనే పేరు మొదలవాలి” - అంటూ ఎక్కడా ఉండేది కాదు.

ఈనాడు కొన్ని క్రొత్త ‘చాదస్తాలు’ వచ్చిపడ్డాయని చెప్పక తప్పదు.

A) ‘చిత్తవృత్తినిరోధం’ అనే మాట కూడా వినని/అర్థంచేసుకోని ‘యోగా’ - కేవలం ఊపిరితిత్తులలో గాలిని గట్టిగా నింపడం, వదలడం, కొన్ని శారీరక - కదలికలు మాత్రమే ‘యోగా’ కాదంటే చాలామంది వినే స్థితిలో లేరు. మన దేశంనుండే కొంత ఎత్తుకెళ్ళి, వాడికి సగమే అర్థమైనా, క్రొత్త ప్యాకేజీలో వేరే దేశంవాడు తిరిగి మనకే అమ్మాడు కదా! అదే ప్రామాణికత! అదొక స్టేటస్ సింబల్ - అంతే! అది చేయకపోతే (కనీసం చేస్తున్నట్లు ప్రకటించుకోకపోతే) నలుగురిలో తలెత్తుకోలేం, అంతే!

B) ఆగ్నేయంలో పొయ్యి, ఈశాన్యంలో దేవుడు, నైరృతిదిక్కున బరువు ఉండకపోతే వాస్తుపురుషుడు శపిస్తాడు. అదీ రూల్! అదొక స్టేటస్ సింబల్ - అంతే! దానిని పాటించకపోతే (కనీసం ఆ విధంగా ప్రకటించుకోకపోతే) నలుగురిలో తలెత్తుకోలేం, అంతే!

C) అలాగే - అర్థం, గిర్థం ఎవడిక్కావాలి? మాంచి ‘లోడెడ్’ అక్షరాలున్న పేరే పిల్లలకి పెట్టుకోవాలి, అదీ పంతులుగారి ఆంక్షలకు లోబడి. ఇది కూడా మరొక స్టేటస్ సింబల్ - అంతే! దానిని కూడా పాటించకపోతే (కనీసం ఆ విధంగా ప్రకటించుకోకపోతే) నలుగురిలో తలెత్తుకోలేం, అంతే!

ఇది ఎంతవరకూ పోయింది/పోతోంది అంటే పేరు పెట్టుకునేవాళ్ళ పరిజ్ఞానం మాట అటుంచి, పెట్టించేవారి పరిజ్ఞానం మరింత “గొప్పగా” ఉండడంవలన, పిల్లల పేర్లేగాక, షాపుల, ఇళ్ళ పేర్లు కూడా విచిత్రంగా ఉంటున్నాయి.

మా ఇంటి ప్రక్కన ఉన్న ఒక స్త్రీల టైలరింగ్ షాప్ పేరు - “దేవి-షి!” “ఇదేమిటమ్మా! ఇంతకంటే మంచిపేరు దొరకలేదా నీకు?” అనడిగితే “మా పంతులుగారు నా నక్షత్రానికి సరిపోయే పేరని చెప్పా”రని సమాధానం!
రేపు మొగుడు మగవారి షాపు పెడితే దాని పేరు ‘దేవ-హి’, లేదా ‘దేవి-హి’ - నిస్సందేహంగా! (‘He’ in the place of ‘she’!) ఈ స్వయంప్రకటిత-పండితుడి ‘అంతర్జాతీయ’ అవగాహన, పాండిత్యం, ‘హైబ్రిడ్ వంగడాల సృష్టి’, దైవజ్ఞత్వం, సర్వజ్ఞత్వం ఎంతటివో ఎవడైనా వర్ణించగలడా?

మా చిన్నప్పటి రోజుల్లో చాలామందికి ‘వాస్తు’ అంటే తెలియదు, ‘యోగా’ అంటే తెలియదు, ఈ విచిత్రమైన పేర్లు మునుపే తెలియవు! అయినా మా తరంలోనూ బాగుపడినవాళ్ళున్నారు, దగాపడ్డవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు పాటిస్తున్నవాళ్ళలోనూ బాగుపడినవాళ్ళున్నారు, దగాపడ్డవాళ్ళున్నారు. దీనికేమనాలి?

పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ‘వ్యవహారనామం, నక్షత్రనామం ..’ అంటూ వ్రాస్తారు. అది అప్పుడూ ఉంది,
ఇప్పుడూ ఉంది.

విశేషం ఏమిటంటే వ్యవహారనామానికి పంచాంగాల్లో వ్రాసే ‘వో, వే.. తో, తే’వంటి పేర్లు సులభంగా దొరకవు. చాలాకాలంగా శ్రోత్రియకుటుంబాల్లోనూ తమకు ఇష్టమైన పేర్లను పెట్టుకోనిచ్చేవారు. నక్షత్రనామం మటుక్కి పురోహితుడు ఏదో వ్రాసేవాడు. దాన్నెవడూ ఆ తరవాత పట్టించుకునేవాడు కాడు. ఇది ఎప్పుడూ అంతే!

మరో విషయం - ఆ రోజుల్లో తలిదండ్రులలో చదువుకున్నవారు తక్కువగా ఉండేవారు. ఈ పేర్లో మొదటి అక్షరం మరో పురోహితుడివద్దకు ఉత్తరోతరా వెళ్ళినపుడు ఆ బిడ్డయొక్క నక్షత్రాన్నీ, పాదాన్నీ ఊహించుకోవడానికి పనికొచ్చేదని, అంతవరకే ఆ మొదటి అక్షరం ప్రయోజనమనీ, అంతకంటే దీనికి ఏ విధమైన ప్రాముఖ్యమూ లేదనీ మాకు తెలిసిన పెద్దవాళ్ళు కొందరన్నారు. ఇది చాలా సమంజసంగా అనిపిస్తోంది.

మరి ఈ కాలంలోనో? దీని అవసరం అసలుందా? పుట్టిన తక్షణం నిమిషాలు, సెకండ్లతో సహా తగిన విధంగా రికార్డుచేసుకుంటున్నారు. పుట్టిన ఊరు, పుట్టిన సమయం చెప్తే కంప్యూటర్ ఎప్పుడు కావలసివస్తే అప్పుడే జాతకం కూడా వేసి ఇస్తోంది. అలాటప్పుడు ఈ మొదటి అక్షరంయొక్క పవిత్రత (sanctity) ఏమిటి? ఆలోచించాల్సిన విషయమే కదా!

మరో ఆసక్తికరమైన విషయం - రేఖాంశంలో (longitude) ప్రతి నిమిషానికి 4 డిగ్రీల తేడా ఉంటుందనీ, న్యాయానికి ప్రతి స్థలంలోనూ మనం గమనించే సమయాన్ని ఉజ్జయినీనగరపు రేఖాంశానికి సవరించాలనే విషయం ప్రజలను ఇంతగా ప్రభావితులను చేస్తున్న పండితులలో ఎందరికి తెలుసు?

తాము ఎంతో ఇష్టంగా ఎన్నుకున్న ఒక మంచి, అందమైన పేరును ఈ ఆంక్ష కారణంగా తలిదండ్రులు వదలుకోవస్తోందా లేదా? మనం ముందుకెళ్తున్నామా? వెనక్కు పోతున్నామా? ఆలోచించవలసిన విషయం కాదా ఇది? వాస్తు సరిగా లేదని గోడలు పగలగొట్టించడంలాంటి మరో చాదస్తపు పని కాదా ఇది?

2) ఇంకా మీకు అర్థం ఉన్న మంచి పేర్లు కావాలనుకుంటున్నారా?

అ) ఒక మంచి నిఘంటువును కొనుక్కోండి; వాటిలో మీకు నచ్చిన పేర్లను తీసుకుని, మిత్రులతో చర్చించండి, సగర్వంగా చెప్పుకోగలిగిన మంచిపేరు కావాలంటే ఈ శ్రమ తప్పదు!

ఆ) పంచాంగాలలోని భాషను చాలా మటుక్కి నమ్మవచ్చు గానీ, పంచాంగం కేలండర్లలో చాలావాటిలో పడుతున్న తిథులపేర్లు, నక్షత్రాల పేర్లు వగైరా రాక్షసాంశతో వస్తున్నాయి. ఒక సారైనా నమూనాను శ్రద్ధతో పరికించి ‘షష్టి, చతుర్ధశి, ఏకాధశి, చతుర్ది, ఆషాడం’వంటి బండబూతు పదాలను సరిదిద్దుకుంటే అవే తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడవచ్చు. కానీ, ఆ ఓపికలు, ఆ శ్రద్ధ వ్రాసేవాళ్ళలో గానీ, చూచేవాళ్ళలోగానీ చాలామందికి లేవు. రెండు డబ్బులొస్తే చాలన్నట్లున్నారు వ్రాసేవాళ్ళు. ఇక, “జాక్ అండ్ జిల్-లు” మాత్రమే చదువుతున్న - వాళ్ళ పిల్లలదగ్గరకెళ్ళాక ఆ పరిజ్ఞానం మరింత పలచబడిపోవడమూ సహజమే!

నాలుగుసార్లు అవే తప్పులు వ్రాస్తే, చదివితే ఆ తప్పులే పునరావృతం అవుతాయి.
పొరపాటు గ్రహపాటవుతుంది, గ్రహపాటు నెమ్మదిగా అలవాటై, కాలక్రమేణా ఆ మొదటి పొరపాటే రూఢైపోతుంది!

ఇ) పాత తరంలోని ‘నిజమైన పండితులు’ మీకు పేర్లు పెట్టుకోవడం విషయమై కొంత సహాయం చేయవచ్చు.

ఈ) ‘ఫేస్ బుక్ తెలుగును’ అస్సలు నమ్మద్దు! (కారణాలు చాలా ఉన్నాయి, చాలామటుక్కి మీకే తెలుసు కదా!)

ఉ) పోనీ అర్థంతో ‘కాంప్రమైజేషన్’ అయిపోవాలనిపిస్తోందా? ఇంతవరకూ నయమే అనుకుందాం పోనీ. కనీసం చెడు అర్థమైనా రాకుండా చూచుకోవడమైనా అవసరమే కదా!

“Something is better than nothing!
But, nothing is better than nonsense!”

అయినా, చెడు అర్థాలు రాకుండా మాత్రం ఎంతవరకూ ఎవరైతే మాత్రం మార్గదర్శకాలనివ్వగలరు?
దీనికైనా కొద్దిగానైనా భాషతో పరిచయం ఉన్నవారి సహాయం తప్పదు!

ఊ) విష్ణుసహస్రనామాలు, లలితాసహస్రనామాలువంటి మంచి పుస్తకాలను కూడా చూడండి. మంచిపేర్లు చాలా దొరుకుతాయి, క్రొత్తగా ఉంటాయి కూడా!

ఉదాహరణకు ‘ప్రథిత్’ (Prathit) అనేది ఆ 1,000 నామాలలో ఒకటి (‘ప్రథా’ అంటే ‘మంచి’ పేరు/ప్రఖ్యాతి). దాన్ని పెట్టుకున్నవారెవరూ నాకిప్పటివరకూ తారసపడలేదు! ‘స్కంద’ అనేది మరొకటి. దీనికి ‘కుమారస్వామి’ అనే అర్థాన్ని చెప్పి, దాన్ని శంకరాచార్యులకు అంటగడతారు చాలామంది. పాపం ఆయన అలా చెప్పలేదు - ‘అమృతమును స్రవించువాడు’ అనే అర్థాన్నిచ్చారాయన. (అయినా, రెండూ సరైనవే లెండి!)

‘హేమమాలిని, జయప్రద’వంటి పేర్లు కూడా వీటినుండి తీసుకున్నవే!

అలాగే ‘నియతి’ అనే సులభమైన, ఆకర్షణీయమైన పేరును ఆడపిల్లలకు పెట్టవచ్చు! (‘ప్రకృతి-సహజమైన నియమం’ అని దానికి అర్థం)

ఋ) అలాగే (ఇప్పటివరకూ ఎవరైనా పెట్టుకున్నారేమో - అది విన్నవారి అదృష్టం) క్రింద ఇచ్చిన ‘చిన్నారి చిలిపిచేష్టల’బాపతు పేర్లను సాధ్యమైనంత దూరం ఉంచగలిగితే మేలని మీరూ అంగీకరిస్తారనుకుంటాను!
“బధిర్ (చెవిటివాడు), చకిత్ (భయపడినవాడు), మారణ్ (చావగొట్టేవాడు), ఘర్మద (వేడిమిని పుట్టించేది, చెమట), ఘర్ఘర (రణగొణధ్వని), నిశాచర్, నక్తంచర్, (రాత్రులందు చరించువాడు = రాక్షసుడు)(దనుజ్ = వీడు కూడా రాక్షసుడే!)., తిర్యక్ (నాలుగు కాళ్ళతో నడిచేది = జంతువు), నిధన/నైధన, పంచత్వ (చావు), విగత (ప్రాణాలుగాని, మరొకటిగాని పోగొట్టుకున్నది)., కార్పణ్య (దయనీయమైన స్థితిలో ఉన్నవాడు/ఉన్నది), అవర (శ్రేష్ఠం కానిది), పలిత (నెరిసిపోయినది), విజిత (చిత్తుగా ఓడిపోయినది), ...”

(ఇంక ఆపేస్తున్నాను ఇంతటితో - ఒక్కొక్క రకానికెన్నెన్నో ఉదాహరణలను స్వానుభవంతో మీరు కూడా చాలానే గమనించి ఉంటారు కదా! సరదాగా ఉంటే నలుగురితో పంచుకుని ఆనందించచ్చు!)

అకటావికటపు పేర్లబారినుండి, మిమ్మల్ని ఈ విషయమై తప్పుదారిపట్టించే శ్రేయోభిలాషులనుండి - మమ్మల్ని, మిమ్మల్ని, జమిలిగా మనందర్నీ కాపాడమని ముఖ్యంగా ఆ చదువులతల్లిని ప్రార్థిస్తూ …

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML