*దేవతానుగ్రహం కోసం చేసే అభిషేక ద్రవ్యవిశేషాలు
వాటి ఫలములు*
*శ్రీ శివాభిషేక ద్రవ్యాలు వాటి ఫలములు*
*శ్రీ మహావిష్ణు అభిషేక ద్రవ్య ఫలాలు *
క్షీరేణ పూర్వం కుర్వీత దధ్నాపశ్చాద్ధృతేన చ | మధునా చాథఖండేన క్రమోజ్ఞేయో విచక్షణైః ॥
జ్ఞానవంతు లైన భక్తులు ముందుగా పాలతో,
ఆతర్వాత పెరుగుతో, నెయ్యితో, ఆపై తేనెతో, చివరగా చక్కెరతో (చెరుకు రసం లేక బెల్లం పానకం తో ) అభిషేకం చేయాలి.
*పంచామృత సమర్పణ ఫలం*
క్షీరేణ క్షీయతేపాపం దధ్నా ధనవివర్ధనమ్ | ఘృతేనాయుష్కరం ప్రోక్తం మధునా హంతికిల్బిషమ్ |
శర్కరా సర్వసిద్ధిస్స్యాత్ పంచామృత ఫలంస్మృతమ్ ||
సమస్త దేవతల అభిషేకాలలో పంచామృతాలు అభిషేక ఫలాలు ఇలా ఉంటాయి గోక్షీరo వల్ల పాపాలు నశిస్తాయి. పెరుగుతో ధనం వృద్ధి చెందుతుంది. నెయ్యితో ఆయుష్షు పెరుగుతుంది. తేనెతో పాపాలు నశిస్తాయి. పంచదారతో అన్ని కోరికలు సిద్ధిస్తాయి. అందువల్ల ప్రతీ పూజలలో ఇవి ప్రధానంగా చెప్పబడ్డాయి ,మరికొన్ని విశేష ద్రవ్యాలు వాటి ఫలాలు తెలుసుకుందాం .
పయసా సర్వసౌఖ్యాని దధ్నారోగ్యం బలం యశః | ఆజ్యేనైశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశశ్చ శర్కరాః ॥ తేజోవృద్ధిశ్చమధునా ధనమిక్షు రనేన వై | సర్వసంపత్సమృద్ధిశ్చ నారికేళజలేన చ ॥ మహాపాపాని నశ్యంతి తత్క్షణాద్భస్మ వారిణా । గన్ధతోయేన సత్పుత్ర లాభశ్చాత్ర న సంశయః ||
భూలాభః పుష్పతోయేన భాగ్యం బిల్వజలేన వై | దూర్వాజలేన లభతే నాన్యథా నష్ట సంపదః ||
ఆవుపాలు అన్ని సౌఖ్యాలను ఇస్తాయి, పెరుగు ఆరోగ్యం, బలం మరియు కీర్తిని ఇస్తుంది. నెయ్యి ఐశ్వర్యాన్ని, శర్కరా దుఃఖాన్ని నాశనం చేస్తుంది. తేనె తేజస్సును పెంచుతుంది, చెరుకు రసం ధనాన్ని ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు సర్వసంపదలను పెంచుతాయి. భస్మం కలిపిన నీరు గొప్ప పాపాలను తక్షణమే నాశనం చేస్తుంది, గంధపు నీటితో సత్పుత్రులు లభిస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు,పువ్వులు కలిపిన నీరు భూలాభాన్ని, మారేడు ఆకుల నీరు అదృష్టాన్ని ఇస్తుంది. గరిక నీటితో పోగొట్టుకున్న సంపద తిరిగి లభిస్తుంది.
అపమృత్యుహరంచైవ తిలతైలాభిషేచనం |
రుద్రాక్ష సలిలేనైవ మహతీం శ్రియమాప్నుయాత్ || స్వర్ణోదకాభిషేకేన ఘోరదారిద్ర్య నాశనమ్ । అన్నేనరాజ్య సంప్రాప్తి ర్మోక్షమాయు స్సుజీవనమ్ ॥ ద్రాక్షారపేన సర్వత్ర విజయం లభతే ధృవమ్ | ఖర్జూర ఫలపారేణ శత్రుహాని ర్భవిష్యతి ॥
వైరాగ్యం లభతే జంబూఫల సారేణ వై జగుః | కస్తూరీ సలిలేనైవ చక్రవర్తిత్వ మశ్నుతే ॥
నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన అపమృత్యువు తొలగిపోతుంది , రుద్రాక్షల నీటితో అభిషేకం చేస్తే గొప్ప సంపద లభిస్తుంది , బంగారం ఉంచిన నీటితో అభిషేకం చేస్తే తీవ్రమైన దారిద్రం నశిస్తుంది , అన్నం వలన రాజ్యసంపద, మోక్షం, దీర్ఘాయువు, మరియు సుజీవనం లభిస్తాయి , ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే అన్నిచోట్లా విజయం కలుగుతుంది , ఖర్జూర పళ్ళ రసంతో శత్రు నాశనం జరుగుతుంది, నేరేడు పళ్ల రసంతో వైరాగ్యం లభిస్తుంది. కస్తూరి నీటితో చక్రవర్తిత్వం లభిస్తుంది.
ఈ ద్రవ్యాలు నిత్యం లేక ఎక్కువ కాలం పాటు సమర్పించు భక్తులకు కామ్యసిద్ధి కలుగుతుంది.
*మహాదేవ మహాదేవ*
*శ్రీమహావిష్ణు దేవత అభిషేక ద్రవ్యములు వాటి ఫలం*
క్షీరేణస్నాపితేవిష్ణౌ ప్రజేద్విష్ణుపురం నరః | దధ్నాతుస్నాపితేవిష్ణా రూపీ విష్ణుపురం ప్రజేత్ ||
పాలతో విష్ణువును అభిషేకిస్తే ఆ వ్యక్తి విష్ణులోకం చేరుకుంటాడు. పెరుగుతో విష్ణువును అభిషేకిస్తే, దేవతారూపం పొంది విష్ణులోకానికి వెళ్తాడు.
ఘృతేన స్నపనాథ్సర్వవంద్యో వైకుణ్ణగోభవేత్ | మథునాస్నాపనాద్విష్ణో రగ్నిలోకమవాప్నుయాత్ ||
నెయ్యితో అభిషేకిస్తే అందరిచే పూజింపబడి వైకుంఠానికి వెళ్తాడు. తేనెతో విష్ణువును అభిషేకిస్తే అగ్నిలోకం పొందుతాడు.
శుద్ధోదకేన స్నపనాన్నష్టపాపో హరిం ప్రజేత్ | మృజ్జల స్నపనాద్విష్ణోర్మనశ్శుద్ధి మవాప్నుయాత్ ||
శుద్ధమైన నీటితో అభిషేకిస్తే పాపాలు నశించి హరిని చేరుకుంటాడు. మట్టి నీటితో విష్ణువును అభిషేకిస్తే మనస్సు శుద్ధి అవుతుంది.
బిల్వపత్రైశ్చ సజ్ఝర్షాత్ సర్వపాపక్షయోభవేత్ |
అఙ్గసౌలభ్య మాయుష్యం సుగంధామలకాద్భవేత్
బిల్వ పత్రాలు కలిపిన నీటితో అభిషేకిస్తే సకల పాపాలు నశిస్తాయి. సువాసనగల ఉసిరికాయ నీటితో అభిషేకిస్తే సౌందర్యం, సౌలభ్యం మరియు ఆయుర్దాయం పెరుగుతాయి.
లక్ష్మీసౌభాగ్య కాంతీశ్చ
సర్వౌషధ్యంబునాప్నుయాత్ |
పఞ్చగవ్య బ్రహ్మకూర్చ
స్నాపనాద్విష్ణు మాప్నుయాత్ ||
సర్వ ఔషధులు కలిపిన నీటితో అభిషేకిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, సౌభాగ్యం మరియు కాంతి లభిస్తాయి.
పంచగవ్యం మరియు బ్రహ్మకూర్చంతో అభిషేకిస్తే విష్ణువును చేరుకుంటారు.
గన్ధర్వలోక మాప్నోతి స్నపనా చ్చన్దనాంభసా ।
సుగన్ధితోయ స్నపనాద్వారుణం లోకమాప్నుయాత్
చందనం కలిపిన నీటితో అభిషేకిస్తే గంధర్వలోకం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో అభిషేకిస్తే వరుణ లోకం పొందుతారు.
అలక్ష్మీనాశమాప్నోతి స్నపనాత్పల్లవాంభసా |
స్నపనాత్కుశపుష్పాద్భిర్ర్బహ్మలోక మవాప్నుయాత్
మావిడి మేడి మర్రి రావి జువ్వి ఇవి పంచ పల్లవులు అంటారు వారు చిగుళ్ళు కలిపిన నీటితో అభిషేకిస్తే దారిద్రం నశిస్తుంది. కుశగడ్డి పువ్వులు కలిపిన నీటితో అభిషేకిస్తే బ్రహ్మలోకం పొందుతారు.
పుష్పామ్బః స్నపనాల్లోకా
త్సావిత్రాద్విష్ణు మాప్నుయాత్ |
ఫలామ్భః స్నపనాద్భక్త్యా
విష్ణులోకమవాప్నుయాత్|
స్వర్ణామ్భః స్నపనాద్విష్ణోః
కౌబేరం పదమవాప్నుయాత్ |
సావిత్రం లోకమాప్నోతి
రత్నామ్భః స్నపనాత్తథా |
ఇహలోకాద్విష్ణులోకం
కర్పూరాగురువారిణా ॥
పువ్వులు కలిపిన నీటితో అభిషేకిస్తే సావిత్ర లోకం నుండి విష్ణులోకం చేరుకుంటారు. పండ్ల రసంతో భక్తితో అభిషేకిస్తే విష్ణులోకం లభిస్తుంది ,
బంగారం కలిపిన నీటితో విష్ణువును అభిషేకిస్తే కుబేరుని స్థానం పొందుతారు అలాగే, రత్నాలు కలిపిన నీటితో అభిషేకిస్తే సవిత్ర లోకం లభిస్తుంది.
కర్పూరం మరియు అగరు కలిపిన నీటితో అభిషేకిస్తే ఈ లోకం నుండి విష్ణులోకం చేరుకుంటారు.
ఘృతేన మధునావాపి దధ్నావా తత్ఫలం శృణు |
సర్వయజ్ఞఫలం ప్రాప్య సర్వపాపవిమోచితః ॥
నెయ్యి, తేనె, లేదా పెరుగుతో అభిషేకం చేసిన ఫలాన్ని వినండి. సమస్త యజ్ఞాల ఫలాన్ని పొంది, అన్ని పాపాల నుండి విముక్తులవుతారు.
వసేద్విష్ణుపురం కల్పం త్రిసప్త పురుషాన్వితం |
తత్రైవ జ్ఞానమాసాద్య యోగినామపి దుర్లభమ్
21 తరాల వారితో కలిసి కల్పకాలం పాటు విష్ణులోకంలో నివసిస్తారు. అక్కడ యోగులకు కూడా దుర్లభమైన జ్ఞానాన్ని పొందుతారు.
ఇక్షుక్షీరేణ దేవేశం యః స్నాపయతి కేశవమ్ | కులాయుతాయుతయుతో విష్ణునా సహమోదతే ॥
చెరుకు రసం మరియు పాలతో దేవుడైన కేశవుని అభిషేకించే వ్యక్తి, లక్షల కుటుంబాలతో కలిసి విష్ణువుతో ఆనందంగా ఉంటాడు.
క్షిప్వాగంధోదకం శంఖే యః స్నాపయతి కేశవమ్ | నమోనారాయణాయేతి ముచ్యతే యోనిసంకటాత్
శంఖంలో గంధం కలిపిన నీటితో *నారాయణ మంత్రం* పఠిస్తూ కేశవుని అభిషేకించే వ్యక్తి యోని సంకటాల అన్న పునర్జన్మ నుండి విముక్తి పొందుతాడు.
వాదిత్రనినాదైరుచ్చైద్గీత మఙ్గల సంస్తవైః |
యః స్నాపయతి దేవేశం జీవన్ముక్తో భవేద్ధి సః ॥
మంగళ వాయిద్యాల శబ్దాలతో, గీతాలతో, మరియు మంగళ స్తోత్రాలతో దేవుడైన కేశవుని అభిషేకించే వ్యక్తి జీవన్ముక్తుడు అవుతాడు.
వాదిత్రాణామభావేతు పూజాకాలే చ సర్వదా | ఘణ్ణా శబ్దానరైః కార్య స్సర్వవాద్యమయోయతః ॥
పూజా సమయంలో వాయిద్యాలు లేకపోతే, ఘంటానాదం శబ్దాన్ని ఉపయోగించాలి, ఎందుకంటే ఘంటా శబ్దం అన్ని వాయిద్యాల శబ్దాలకు సమానం.
*శ్రీ గోవింద హరే జయ గోపాల హరే*
గురువుల అనుగ్రహం
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి