.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

10, ఏప్రిల్ 2018, మంగళవారం

నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం


నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడుఅది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ఆస్కారమిస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెళుతున్నాడు. దారిలో ఒక బౌద్ధ భిక్షువు ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు.
తరవాతి రోజు ఆ మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడయ్యాయి. మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా ఉండదు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.
'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో, బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే, శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.
అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో, ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి' ఇలా ప్రార్థించుకుంటూ, ఒకరికొకరం నమస్కరించుకుందాం!🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML