పదిహేడవ శ్లోక భాష్యం
సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభఙ్గరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సఞ్చింతయతి యః!
స కర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః!!
వాగ్దేవి అని ఏకవచనంలో సరస్వతి చెప్పబడుతోంది. వాగ్దేవతలు అని బహువచనంలో వాడితే ఎనిమిది మంది చెప్పబడుతున్నారు. "అ" తో మొదలయే అచ్చులు పదహారు మొదటి వాగ్దేవత. అలాగే "క" వర్గము (అంటే క, ఖ, గ, ఘ, ఙ) ఒక వాగ్దేవత – ఈ రకంగా 51 వర్ణములు కలిసి ఎనిమిది మంది వాగ్దేవతలు. అచ్చుల వర్గపు వాగ్దేవత "వశిని". ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు వశిన్యాది వాగ్దేవతలుగా పిలవబడుతున్నారు. వీరు శ్రీచక్రంలో ఏడవ ఆవరణలో ఎనిమిది కోణములలో సంస్థితులై ఉన్నారు. అంటే అంబికను చుట్టి ఉన్నారన్నమాట. వీరే అంబిక ఆజ్ఞతో లలితా సహస్రనామ స్తోత్రమును పాడారు.
వారు సమస్త శబ్దజాలానికి తల్లులు కాబట్టి ఆచార్యులవారు "సవిత్రీభిర్వాచామ్" అంటూ శ్లోకాన్ని ఆరంభిస్తున్నారు. చంద్రకాంత శిల అనే స్ఫటికము ఒకటుంటుంది అని పుస్తకాలలో ఉల్లేఖించబడి, అది చంద్రకాంతికి కరిగిపోతుందని నమ్మబడుతోంది. ఈ వాగ్దేవతలు చంద్రకాంతిని తమలో ప్రతిబింబించుకొనే చంద్రకాంత శిలలవంటివారట. ఒక శ్లోకంలో ఆచార్యులవారు అంబికను "శరజ్జ్యోత్స్నా శుద్ధం" అని, తరువాత శ్లోకంలో "అరుణామ్" అని ప్రస్తుతించారు. ఇక్కడ వాగ్దేవతల మధ్య పరివేష్టించి ఉన్న అరుణ అయిన అంబిక చెప్పబడుతోంది. వాగ్దేవతలతో కూడిన ఆ మహారాజ్ఞి ఎవరు "సంచింతయతి" చక్కగా చింతనచేస్తాడో, ధ్యానిస్తాడో అతడు "మహతాం భఙ్గి (భంగి) రుచి" మహాత్ములవలె కావ్యములు చేయగలిగిన వాడవుతాదు. అతని వాక్కులు మహాత్ముల వాక్ఝరి యొక్క రసపుష్టిని సంతరించుకొని ఉంటాయి. రుచి అనే మాట తినే వస్తువులు విషయంలో వాడబడేది. ఏ భాషలోనైనా కవితా రసాస్వాదన చేయగలిగే శక్తికి కూడా తినుబండారాల విషయంలో ఉపయోగించే "రుచి" అన్న మాట ఉపయోగించబడుతుంది. నాలుకతో తెలియబడే రుచిని మాత్రమే ఎందుకు వాడాలి. అందుకే ఆచార్యులవారు నాసికతో ఆఘ్రాణింపబడే వాసన గురించి కూడా చెబుతున్నారు. అటువంటి సాధువుల చేత పలుకబడిన కవిత్వం తేనె, పాలు, ద్రాక్షలవలె తీపిదనాన్ని మాత్రమే కాదు వాసన కూడా కలిగి ఉంటాయట. ఎనిమిది మంది వాగ్దేవతల సమిష్టి రూపమైన సరస్వతీ ముఖకమలం నుండి నిర్గమించే దైవికమైన వాసన అది. ఆ సువాసన పరమ ప్రేమను రేకెత్తిస్తుంది.
"వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః". సరస్వతీ దేవి మూర్తీభవించిన నిర్మలత్వము. శుద్ధత. సమస్త సాత్విక లక్షణములకు ఆలవాలమైనది. కళలకు పుట్టినిల్లు. అటువంటి తల్లి నోరు తెరిస్తే మనం పీల్చే గాలి సువాసన భరితమవుతుంది. ఆమె దానికై సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలము వేసుకోనక్కరలేదు. ఆమె పూలు ధరించకుండానే ఆమె కేశపాశములు నలుదిక్కులా సువాసనలను వెదజల్లుతాయి. సరస్వతీ కటాక్షమున్న మహాకవుల పద్యాలు, కవిత్వము అటువంటి సువాసనలను వెదజల్లుతుంది. అమ్మవారి నోటి సువాసనే ఈ కవిత్వపు సువాసన. పరమేశ్వరుని పాడిన కొద్దీ నోరు సువాసనా భరితమవుతుంది అంటారు వళ్ళలార్ అనే కవి.
అంబిక కవితా శక్తిని అనుగ్రహిస్తుందని ఆచార్యులవారు సౌందర్యలహరిలో అనేక శ్లోకాలలో చెప్పారు. ఒక శ్లోకంలో అంబికచే అనుగ్రహింపబడిన స్తన్యం అపారమైన కవితశక్తిని ఇస్తుందని చెబుతారు. వేరొక శ్లోకంలో అంబికా కటాక్షం బ్రహ్మకే అసూయ కలిగించే విధంగా కవితా వైభవాన్ని కలిగిస్తుంది అని చెబుతారు. మరొక శ్లోకంలో అంబిక పాదోదకము వానిని పరవళ్ళు తోక్కే కవితా ప్రవాహం గలవానిగా చేస్తుదని చెబుతారు. అంబికను దర్శించిన తన ఆనందాన్ని ఆచార్యులవారు అనుపమానమైన శైలిలో తమ వాక్ప్రవాహంతో మనలను ఓలలాడిస్తున్నారు. అయితే తిరిగి తిరిగి ఆమె ప్రసాదించే కవితా శక్తి గురించి ముచ్చటించడమెందుకు. ఈ స్తోత్రాన్ని చదివే వారు అటువంటి అంబికా కటాక్షాన్ని తాము కూడా పొంది ఆమె దయతో మళ్ళీ ఆమెపై స్తోత్రములు వ్రాసి తాము తరించి ఇతరులను తరింపచేయాలని ఆచార్యులవారి ఆకాంక్ష.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి