.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

10, ఏప్రిల్ 2018, మంగళవారం

"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు కానీ...

"గరుడ పురాణం" అనగానే చాలామంది అదేదో అశుభ పురాణమని, భయంకరమైనది అని భావిస్తారు కానీ...
🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు , ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది .కాని అది సరియైనది కాదు . ఇది,విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము .నారద పురాణములో దీనిని గురించి – " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .
గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను ,అతని చరిత్రమును ,పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది . అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి .
అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి ,వారు చేసిన ప్రతి సృష్టి ,వంశములు , మన్వంతరములు , వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి .యుగ ధర్మములు ,పూజావిదానములు విష్ణుని దశావతారములు ,అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు , చంద శ్శాస్త్ర ప్రశంశ ,వ్యాకరణము ,గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి.

ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి .ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును .చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే.
నైమిశారణ్యము లోని శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా ,వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

గరుడ పురాణం:

గరుడుని పుట్టుక:
 ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు , బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను . ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి . అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు. ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను . అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను ,మరొకటి ఆకాశముగాను అయ్యెను.ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను . అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా "తప తప "అను మాటలు విన వచ్చెను . అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను .
బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని , దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి , వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి , మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు
 కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత ,కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె ,గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను.ఆమె సంతోష భరితురాలయ్యేను .
ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ , వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ "గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న " దనెను. వినత " అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?" అనెను. కద్రువ ,"కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను .తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను " అనెను .వినత " అయినచో పోయి చూతము రమ్మ "నెను. కద్రువ " ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.
రేపు ప్రొద్దున చూత " మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి ,"మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా కనబడునట్లు చేయు " డనెను . "విషయమే" మని వారడుగగా ,జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి .ఆమె వారిని సర్పయాగాములో నశింపు చేసెను .
వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది .తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని
 త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు.
ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి," మనకీ దురవస్థయే" మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి " ఏమిచ్చినచో నీవు నా
 తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద " నని యడిగెను. ఆమె " దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు " ననెను.
గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి , తన తల్లి దాస్యమును ,దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి ,ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను.
కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి ,అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి .వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో " దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు
" మనెను. దానికి గరుడుడు " నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును." అనెను . " ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె ,నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే , అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను .దీనికి నీవంగీకరింపుము" అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి , " మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !" అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.
ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి ," కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు." అని చెప్పెను.
తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై "గరుడా ! నీ భక్తికి మెచ్చినాను .నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము." అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.
గరుడుని గర్వ భంగము
 ఒకప్పుడు గరుత్మంతునికి ,తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట ,అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట ,ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది .ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.
ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి .విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను . గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను . సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.
శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను . గరుడుడా స్పర్శతో తేరుకుని , విష్ణు మూర్తి పాదములపై బడి ," ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి ,నా యాపరాధమును మన్నింపు " మని వేడుకొనెను . శ్రీ హరి ప్రసన్నుడయ్యెను .
నవగ్రహములు – రత్నములు
సూర్యాది నవగ్రహములకును తొమ్మిది విధములైన రత్నములు నిర్దేశింప బడినవి .ఆకాశములో నున్న ఈ గ్రహముల కాంతులు సరిగా మనపై ప్రసరింపక పోవచ్చును. ఆ కాంతులు మన శరీరముపై బడినచో అనేక అనారోగ్యములు తొలగుటయే కాక ,ఆయా గ్రహములు విషమ స్థానములందున్నచో సత్ఫలితములను ,మంచి స్థానము లందున్నచో విశేష ఫలములను కలిగించును. అందుచేత నవరత్నముల ఉంగరములను ధరించుట నవగ్రహ ప్రీతి కొరకే అని గ్రహింప వలెను. 

ఆయా గ్రహములకు చెప్పబడిన రత్నములు క్రింద నీయబడు చున్నవి .

1 .సూర్యుడు — పద్మరాగము (కెంపు)
2 . చంద్రుడు — ముత్యము
3 .అంగారకుడు – పగడము
4 .బుధుడు — ఆకుపచ్చ
5 .గురుడు –పుష్యరాగము (గరుడ పచ్చ )
6 .శుక్రుడు –వజ్రము
7 .శని — నీలము (ఇంద్ర నీలము )
8 .రాహువు – గోమేధికము
9 . కేతువు — వైడూర్యము
 పంచ మహా యజ్ఞములు
"యజ ఆరాధనే ", అను ధాతువు నుండి పుట్టినది యజ్ఞ శబ్దము పృధ్విలో పుట్టిన ప్రతి మానవుడు ను ప్రతి దినమును ఈ యజ్ఞములు ఆచరించ వలెను.

 ఈ యజ్ఞములు ఐదు

1 . దేవ యజ్ఞము 
2 . పిత్రు యజ్ఞము 
3 . భూత యజ్ఞము 
4 . మనుష్య యజ్ఞము   5 . బ్రహ్మ యజ్ఞము .

1 .దేవ యజ్ఞము : దీనినే వైశ్వ దేవ మందురు . గృహస్థులు గార్హ పత్యాగ్నిలో దేవతల నుద్దేశించి చేయుదురు. బ్రహ్మ చారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు .(గృహస్థులు చేయునది మాత్రమే వైశ్వ దేవము ) శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలము నిచ్చును.

2 . పితృ యజ్ఞము : ఇది తల్లి దండ్రులు లేనివారు చేయునది . పితృ వర్గమును, మాతృ వర్గమును చెప్పుచు స్వదాకారముతో జలముతో గాని , తిలలు గలిపిన జలముతో గాని తర్పణము చేయుటే పితృ యజ్ఞము. తండ్రి లేని వానికే తర్పణము చేయు అధికార ముండును. తండ్రి జీవించి యున్నప్పుడు తల్లి లేని వానికి గూడ తర్పణము చేయు అధికారము లేదని కొందరి మతము .

3 . భూత యజ్ఞము : గృహస్థుడు తాను భోజనము చేయుటకు ముందు ఇంటి పరిసరములలో తిరుగు కాకులకు ఇతర జంతులకును ఆహారము పెట్టుటయే భూత బలి . ఇది యెవ్వరైనను భూత దయ గలవారు చేయవచ్చును .

4 . మనుష్య యజ్ఞము : ఇంటికి వచ్చిన అతిదులను ,అభ్యాగతులను , సత్కరించి భోజనము పెట్టుట ,లేదా సాముహిక సమారాధనలు (అన్నదానములు ) జరుగునపుడు
 యధాశక్తిగా ధనమును గాని వస్తు సంభారములను గాని ఇచ్చి సహకరించుట .

5 .బ్రహ్మ యజ్ఞము : ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము , అధర్వణ వేదము అను నాల్గింటిలో తమ శాఖకు చెందిన వేద భాగమును అధ్యయనము చేయుట ,లేదా !
అధ్యయనము చేసిన దానిని పునశ్చరణము చేయుట బ్రహ్మ యజ్ఞ మనబడును.
శూద్రాది వర్ణముల వారు బ్రహ్మ జ్ఞానులైన ఋషులు రచించిన పురాణములను ధర్మ శాస్త్రములను చదువుట లేక వినుట బ్రహ్మ యజ్ఞ మగును.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ప్రతి దినము ఉదయమునను., మద్యాహ్నమునను ,సాయంకాలమునను మంత్ర యుక్తముగా సంధ్యో పాసనము చేయవలెను. " అహరహ స్సంధ్యా ముపాసీత " అని పెద్దల యాదేశము.
శూద్రాది వర్ణములవారు ఉదయముననే స్నానము చేసి జగత్కర్మ సాక్షి యైన సూర్యునికి నమస్కారము చేసి ధ్యానించి నచో అది సంధ్యా వందన మగును. సాయంకాలము కూడా ఇట్లే చేయవలెను .
దానములు – ధర్మములు
దానములు వేరు ,ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది .ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు ,మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట ,దేవాలయ నిర్మాణము ,ఉద్యానవనములు ,పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును.
అగ్నిహొత్రము ,తపస్సు, సత్య వ్రతము,వేదాధ్యయనము ,అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.
సూర్య ,చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక ,మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును.
దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము ,గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :

శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||

తా || బంగారము ,గుఱ్ఱము ,తిలలు ,ఏనుగులు,దాసీ జనము ,రధములు ,భూమి, గృహములు ,కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.
దేవతలకు గాని ,బ్రాహ్మణులకు గాని , గురువులకు గాని ,తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును .
ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు ,ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ ,గంగా ,గయా ,ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును.
వైవస్వత మన్వంతరము లోని వ్యాసులు
 ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము .అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి ,పదునెనిమిది పురాణములు రచించినది ,దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి .ప్రతి కలియుగములో ను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగము లోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము ,అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు.
అంతే కాదు ; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి.
గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని వ్యాసుడు స్వాయుంభువ మనువు
 రెండవ ద్వాపరములో ప్రజాపతి
 మూడవ ద్వాపరములో ఉశ నసుడు
 నాలుగవ ద్వాపరములో బృహస్పతి
 ఐదవ ద్వాపరములో సవితృడు
 ఆరవ ద్వాపరములో మృత్యువు
 ఏడవ ద్వాపరములో ఇంద్రుడు
 ఎనిమిదవ ద్వాపరములో వసిష్టుడు
 తొమ్మిదవ ద్వాపరములో సారస్వతుడు
 పదవ ద్వాపరములో త్రిధాముడు
 పదునొకండవ ద్వాపరములో త్రివృషుడు
 పండ్రెండవ ద్వాపరములో శత తేజుడు
 పదమూడవ ద్వాపరములో ధర్ముడు
 పదునాలుగవ ద్వాపరములో తరక్షుడు
 పదునైదవ ద్వాపరములో త్ర్యారుణి
 పదునారవ ద్వాపరములో ధనంజయుడు
 పదునేడవ ద్వాపరములో కృతంజయుడు
 పదునెనిమిదవ ద్వాపరములో ఋతంజయుడు
 పందొమ్మిదవ ద్వాపరములో భరద్వాజుడు
 ఇరువదవ ద్వాపరములో గౌతముడు
 ఇరువదొక్కటవ ద్వాపరములో రాజశ్రవుడు
 ఇరువది రెండవ ద్వాపరములో శుష్మాయణుడు
 ఇరువది మూడవ ద్వాపరములో తృణబిందుడు
 ఇరువది నాలుగవ ద్వాపరములో వాల్మీకి
 ఇరువది ఐదవ ద్వాపరములో శక్తి
 ఇరువది యారవ ద్వాపరములో పరాశరుడు
 ఇరువది యేడవ ద్వాపరములో జాతూకర్ణుడు
 ఇరువది ఎనిమిదవ ద్వాపరములో కృష్ణ ద్వైపాయనుడు
ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు , వైశంపాయనులను శిష్యులకు భోదించి ,అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .


శ్రీ హరి దశావతారములు
🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉🌻🕉

1 .మత్స్యావతారము
 వైవస్వత మను వొకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్య మిచ్చు చుండగా ఒక చేప పిల్ల అతని చేతిలో బడెను . అది పెరిగి పెద్ద దగుచుండగా గంగాళము లోను ,చెరువులోను, సరస్సులోను వేసెను .
అప్పుడా చేప మనువుతో " ప్రళయ కాలమున ఒక నావ వచ్చును. దానిలో సప్త మహర్షులను నీవును ఎక్కి కూర్చుండుడు . ప్రళయాంతము వరకును ఆ నావను మహా సముద్రములో నా కొమ్మునకు గట్టుకుని లాగుకొని పోవుచునే యుందు, " నని చెప్పెను. మనువట్లే చేసి ఆ ప్రళయమును దాటెను. మరల బ్రహ్మ సృష్టి చేయుటకు పూను కొన్నప్పుడు హయగ్రీవుడను రాక్షసుడు (ఇతనినే సోమకాసురుడని కూడా అందురు ) వేదముల నపహరించి సముద్రములో దాగి యుండగా శ్రీ మన్నారాయణుడు మత్స్యావతారమును మరల ధరించి ,వానిని సంహరించి వేదములను మరల బ్రహ్మ దగ్గరకు చేర్చెను .

2 . కూర్మావతారము
దూర్వాసుని శాపముచే ఇంద్రుని సంపద లన్నియు సముద్రములో గలిసిపోగా ,విష్ణు మూర్తి సలహా మీద దేవ దానవులు సముద్రమును మదించిరి .
ఈ పాల సముద్రమును మదించుట కారంబించినపుడు కవ్వముగా వేసిన మందర పర్వతము మునిగిపోసాగెను . అప్పుడు నారాయణుడు కూర్మావతారమును ధరించి దాని క్రింద ఆధారముగా నిలువబడెను . దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులను ,అమృతమును పుట్టెను.

3 .వరాహావతారము
హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి స్వర్గ మాక్రమించిన ప్పుడు అతనిని యజ్ఞ వరాహ రూపముతో సంహరించెన

4 . నృసింహావతారము
అతని సోదరుడు హిరణ్య కశిపుడు తరువాత దేవలోకము నాక్రమించి యజ్ఞ భాగములను కాజేయగా నార సింహ రూపము ధరించి అతనిని సంహరించెను.

5 .వామనావతారము
 బలి చక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గము నుండి తరిమి వేయగా శ్రీ హరి వామనుడై పుట్టి , బలిని మూడడుగుల నేల యడిగి , వామనుడు అవామనుడై రెండడుగులలో భూమ్యాకాశముల నాక్రమించి అతనిని పాతాళమునకు త్రొక్కి వేసెను .

6 .పరశురాముడు
 శ్రీ హరి తన అంశము తో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరువది యొక్క సారులు దండ యాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరధ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.

7 . శ్రీరాముడు
రావణ కుంభ కర్ణులను సంహరించుట కై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి ,సీతను పెండ్లాడి , సీతా లక్ష్మణులతో అరణ్య వాసము చేసి అనేక రాక్షసులను వధించెను .రావణుడు సీత నెత్తికొన పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణ కుంభ కర్ణాది రాక్షసులను సంహరించి ,అయోధ్యకు వచ్చి పట్టము గట్టు కొనెను . లోకాపవాద మునకు భయపడి సీతను అడవిలో వదలగా ఆమె వాల్మీకి ఆశ్రమమునకు జేరెను. అప్పటికే గర్భవతి యైన సేత ,అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదునొక్క వేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీతా సమేతుడై అయోధ్యా పుర వాసులతో సహా పరమ పదమునకు వేంచేసెను .

8 .శ్రీ కృష్ణావతారము
ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగములో అధర్మ ప్రవృత్తు లైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీ హరి ,కృష్ణావతారము నెత్తెను.
దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి ,వ్రేపల్లెలో నంద యశోదల యింట పెరిగి బాల్య క్రీడలచే వారిని అలరించి , దుష్ట రాక్షసులను సంహరించెను.
మధురా పురమునకు పోయి కంసుని సంహరించి ,మాతామహుని రాజ్యమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిణ్యాది అష్ట మహిషులను వివాహ మాడెను. నరకుని జంపి 16000 మందిని వాని చెర నుండి విడిపించి పెండ్లాడెను. ద్వారకా నగరమును నిర్మించి బార్యా పుత్ర బంధు మిత్ర పరివారముతో నూట పాతిక యేండ్లు భూలోకమున నివసించెను . భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మ పరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించు చుండగా ముసలము వంకతో వారిని గూడా సంహరించి తాను పరమ పదమునకు చేరెను .

9 బుద్దావతారము
 ఒకప్పుడు రాక్షసులు విజ్రుంభించి దేవలోకము పై దండెత్తి దేవతల నోడించి తరిమివేసిరి ,దేవతలు ప్రార్ధింపగా మాధవుడు, మాయా మోహ స్వరూపముతో శుద్దో దనుని కుమారుడుగా జన్మించెను. వేద విరుద్దములైన బోధలతో రాక్షసుల నందరును సమ్మోహ పరచి వారిని వేద బాహ్యులను జేసెను.ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను గూడా భ్రమింపజేసెను . రాక్షసులు పాషండులై బలమును తేజమును కోల్పోయిరి. అప్పుడు దేవతలు వారి నోడించి స్వర్గమును చేజిక్కించు కొనిరి.

10 కల్క్యవ తారము
 బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును .వారు ధర్మ పరులై ప్రజా కంటకులై ప్రవర్తింతురు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేద కర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగములో విష్ణు యశుడను వానికి శ్రీ హరి ,కల్కి రూపముతో జన్మించును .ధర్మమును తిరిగి ప్రతిష్టించును .
ఈ దశావతారముల కధను విన్నవారికి అనంతమైన పుణ్యము గలుగును.
శ్రీ మన్నారాయణుడింకను ఎన్నో అవతారము లెత్తెను. అవి యన్నియు ధర్మ సంస్థాపనము చేయుటకే యని గ్రహింపవలెను.
ఇది గరుడ పురాణము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML