.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

10, ఏప్రిల్ 2018, మంగళవారం

భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది


ఈరోజు శ్లోకాలు దేహత్యాగం లేదా మరణానంతర యాత్ర గురించి చెప్తాయి.  ఈ విషయంలో "భారతం అనుశాసనిక పర్వం పంచామాశ్వాసం లో శివ పార్వతుల మధ్య జరిగిన సంవాదం కొంత ఉపయుక్తంగా ఉంటుంది.   

పార్వతి దేవి శివుడిని " నాథా ! చావు అనునది ఏమి ? దాని స్వరూపము ఏమిటి ? " అని అడిగింది. పరమశివుడు.  "దేవి ! ఆత్మ నిత్యము, శాశ్వతము. దేహము అశాశ్వతము. దేహము ముసలితనముచేత రోగములచేత కృంగి కృశించి పోతుంది. దేహము వాసయోగ్యము కానప్పుడు జీవాత్మ ఈ దేహమును వదిలిపోతుంది. అదే మరణము. జీవాత్మ కృశించి వడలిన దేహమును వదిలి తిరిగి వేరొక శరీరమును ధరించి శిశువుగా జన్మించడమే పుట్టుక. కనుక జీవుడు ఈ జననమరణ చక్రములో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు " అని చెప్పాడు. 

పార్వతీ దేవి " నాథా ! బాలుడు చిన్నతనంలో చనిపోతే వృద్ధుడు చాలా కాలము బ్రతకడానికి కారణం ఏమిటి ? " అని అడిగింది. పరమేశ్వరుడు " దేవీ ! ఈ కాలము శరీరమును కృశింప చేస్తుంది కాని చంపదు. మానవులు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా జీవితం పొడిగించబడడం తగ్గించబడడం జరుగుతూ ఉంటుంది. పొడిగిస్తే చాలా కాలం బ్రతుకుతాడు. తగ్గిస్తే మరణం సంభవిస్తుంది " అని చెప్పాడు.

పార్వతీదేవి " నాథా ! మనిషికి ఆయుష్షు ఎందువలన పెరుగుతుంది ? ఎందువలన తగ్గుతుంది ? " అని అడిగింది. పరమేశ్వరుడు " పార్వతీ ! మానవుడు ప్రశాంతముగా బ్రతికితే ఆయువు పెరుగుతుంది. అశాంతిగా జీవిస్తే ఆయువు క్షీణిస్తుంది. మానవుడు క్షమించడం నేర్చుకోవాలి. శుచిగా ఉండాలి. అందరి మీద దయకలిగి ఉండాలి. గురువుల ఎడ భక్తికలిగి ఉండాలి. వీటన్నింటిని మానవుడి ఆయువు వృద్ధిపొందుతుంది. అధికమైన కోపము కలిగి ఉండడం, అబద్ధాలు చెప్పడం, ఇతరుల ఎడల క్రూరంగా ప్రవర్తించడం, అపరిశుభ్రంగా ఉండడం, గురువులను ద్వేషించడం వీటివలన ఆయువు క్షీణిస్తుంది. పార్వతీ " తపస్సుచేతనూ, బ్రహ్మచర్యముచేతనూ, మితాహారం చేతనూ, రోగం వచ్చినప్పుడు తగిన ఔషధములు సేవించడం చేతనూ ఆయుర్ధాయము పెరుగుతుంది. పైన చెప్పిన కర్మలు అతడు తన పూర్వజన్మ సుకృతంగా చేస్తాడు. ముందు జన్మలో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గానికి పోయి అక్కడ సుఖములు అనుభవించి తిరిగి భూలోకములో జన్మిస్తారు. వారికి ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. వారు అకాల మరణం చెందరు. ముందు జన్మలో పాపము చేసుకున్న వాళ్ళు నరకానికి పోయి కష్టములు అనుభవించి భూలోకములీ తిరిగి జన్మిస్తాడు. అతడు అల్పాయుష్కుడౌతాడు. అందువలన అకాలమరణం సంభవిస్తుంది " అని  చెప్పాడు.

" నాధా ! మానవులలో స్త్రీలు, పురుషులు అని రెండు రకాలు ఉంటారు కదా ! స్త్రీ పురుషులలో జీవాత్మ ఎలా ఉంటుంది " తెలియజెయ్యండి. పరమశివుడు " పార్వతీ ! పుట్టడం స్త్రీగానూ, పురుషుడిగానూ పుట్టినా వారిలో ఉండే జీవాత్మ ఒక్కటే. దానికి స్త్రీ పురుష లింగభేదం లేదు. మనస్సు, బుద్ధి, హంకారము అందరికీ ఒక్కటే. అందరిలోనూ పంచభూతాలు  వాటి తన్మాత్రలు ఒక్కటే. మానవుడు చేసే కర్మలకు జీవాత్మ బాధ్యుడుకాడు. మానవుడు తనలోని సత్వ, రజో, తమోగుణ ప్రకోపముచేత పలువిధ కర్మలుచేస్తుంటాడు. జీవాత్మ ఆ కర్మలను సాక్షీభూతంగా చూస్తుంటాడు. సత్యము పలకడం, ఇతరులపట్ల దయకలిగి ఉండడం, ఎప్పుడూ మత్తులో జోగుతుండడం లేక నిద్రపోతూ ఉండడం ఇవన్నీ తామసగుణములు. సత్వగుణ ప్రధానుడికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి. రజోగుణ ప్రధానుడికి మానవ జన్మ ప్రాప్తిస్తుంది. తమోగుణ ప్రధానుడు పశుపక్ష్యాదులుగా జన్మిస్తాడు. ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ముక్తి పొందుతాడు. ఈ సత్వ, రజో, తమో గుణముల కారణంగా కర్మలు చేసే వాడికి శుభములు, అశుభములు కలుగుతుంటాయి. ఒక్కోసారి దానికి భిన్నంగా కూడా జరుగుతుంటుంది.

అధికారులు సేవకులను తిట్టి పనిచేయించుకోవడం పాపము కాదు, వైద్యుడు శస్త్రచికిత్స చేసి రోగిని కాపాడుతాడు అది పాపముకాదు. గురువు విద్యార్థిని దండించి విద్యాబోధ చేస్తాడు. అది పాపము కాదు. అవి సుకృతములే కనుక సుకృత ఫలితమే వారికి వస్తుంది.

జీవులు గర్భము నుండి, గుడ్డు నుండి, చెమట నుండి జన్మిస్తుంటాయి. వీటికి అన్ని ఇంద్రియములు ఉంటాయి. కాని విత్తనముల నుండి పుట్టిన చెట్లకు స్పర్శ జ్ఞానము మాత్రము ఉంటుంది. గర్భము నుండి పుట్టిన జీవులలో మానవుడు గొప్పవాడు. అతడికి ధర్మాధర్మవిచక్షణ, మంచిచెడుల విచక్షణ ఉంటాయి. ఈ జ్ఞానము లేనియడల అతడు పశువుతో సమానము. చీకటి రెండు విధములు రాత్రివేళ అలముకునే ఒకటి చీకటి. రెండవది అజ్ఞానము వలన కలిగే అంధకారము. మొదటి చీకటి వెలుగు రాగానే అంతరిస్తుంది. మనిషిలో అలముకున్న చీకటిని విద్యవలన శాస్త్ర విజ్ఞానమువలన నశిస్తుంది.

మానవులలో పుట్టిన చీకటిని పారద్రోలడానికి బ్రహ్మ వేదములు, శాస్త్రములు సృష్టించాడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చెయ్యడం వలన ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. దాని వలన అజ్ఞానము చీకట్లు తొలగి పోతాయి. కామము, కోపము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైన గుణములు శాస్త్రాధ్యయనం వలన నశిస్తాయి. విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అలాంటి వాడు కొంచం పుణ్యము చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. శాస్త్రజ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారంలో మునిగిన వాడు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అతడికి లభించే ఫలము తక్కువే " అన్నాడు శివుడు.

" పార్వతీ ! నరుడు మరణించగానే జన్మించిన అతడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వాడిని జాతి అమరుడు అంటారు. కాని వయసు వచ్చేసరికి పూర్వజన్మ స్మృతి పోయి మామూలు మనిషి ఔతాడు. ఇలా కొంత మందికి మాత్రమే జరుగుతుంది. ఇలా పూర్వజన్మ స్మృతి కలగడణం వలన పూర్వజన్మ ఉందని రుజువు మానవులకు ఔతుంది. 

పార్వతీదేవి " మహాదేవా ! స్వప్నము అంటే ఏమిటి ? " అని అడిగింది. " పార్వతీ ! నరుడు నిద్రించే సమయంలో ఇంద్రియములు పని చెయ్యవు. కేవలము మనసు మాత్రమే పనిచేస్తుంది. ఆ మనస్సు దర్శించేది స్వప్నము లేక కల అంటారు. ఒక్కోసారి ఈ స్వప్నంలో జరగబోయే విషాయాలు కూడా కనిపిస్తాయి " అని చెప్పాడు మహేశ్వరుడు.

పార్వతీదేవి "మానవులు కర్మలు చేస్తుంటారు కదా ! ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా ! లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా " అని అడిగింది. పరమశివుడు " పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు. కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు. ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే. ఇందులో దైవప్రమేయము ఏదీలేదు. పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు. మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే ఈ జన్మలో చేసేపనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయ త్నాలు. ఒక పనిచెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది. దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది. నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది.

అలాగే ఏ పనికైనా పురుష ప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు. కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పకకావాలి. అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు" అని చెప్పాడు శివుడు. స్వస్తి.

జైగురుదేవ్🙏🌺🙏🌺🙏🌺🙏🌺

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML