శ్రీ నారాయణ తీర్ధులు
ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, గురువు ఎవరో తెలియని వైనం సాయిబాబా.. మహాసమాధియైన ప్రదేశం గూర్చి ఏకాభిప్రాయం ఉన్నది. అయితే లీలాశుకుల, జయదేవుల అవతారంగా భావింపబడే నారాయణతీర్థులవారి మహాసమాధి అయిన క్షేత్రం గూర్చి భిన్నాభిప్రాయాలున్నాయి.
శ్రీనారాయణతీర్ధులు పూర్వాశ్రమ నామం తల్లావఝుల గోవిందశాస్త్రి, తండ్రి పేరు నీలకంఠశాస్త్రి, వీరిది గుంటూరు జిల్లాలోని కాజగ్రామం.
గోవింద శాస్త్రికి వివాహమైంది. అత్తవారింటికి వెళ్తుంటే కృష్ణానది వరదల్లో చిక్కుకుపోయాడు. ప్రాణసంరక్షణార్టం సన్యాసం స్వీకరించాడు. అనంతరం అత్తవారింటికి. చేరుకున్నాడు క్షేమంగా. ఆయన భార్యకు యతీశ్వరునిలాగా కన్పడ్డాడు. కారణం ఏమిటని భార్య అడిగింది. సంగతి చెప్పాడు. ఆమె ఆయన పాదాలకు నమస్కరించి, తనను శిష్యురాలిగా స్వీకరింపుమని కోరింది. వారిద్దరిప్పుడు భార్యాభర్తలు కారు. గురువు శిష్యులు. అది దైవలీల!
ఆయన చేసిన రచనల వల్ల గోవిందశాస్త్రి (అంటే నారాయణతీర్థులవారు) రామగోవిందులనే శివరామతీర్ధుల వద్ద సన్యాసదీక్ష తీసుకున్నారని, వాసుదేవశాస్త్రి వద్ద సకల శాస్త్రాలు తెలుసుకున్నారని తెలుస్తుంది.
గురువు శివరామతీర్ధులు (శివరామానంద) కాశీపురవాసి. శిష్యుడు నారాయణతీర్ధులు గొప్ప కృష్ణ భకుడు, సిద్ధపురుషుడు. అనేక రచనలను చేశాడు. ఆయన రచనలు పండిత పామర మనోరంజకాలు. వాచస్పతిమిశ్ర, మధుసూధన సరస్వతులను పాండిత్య ప్రభావైభవాలలో మించినవారు నారాయణతీర్థులు,
సంస్కృతయక్షగానం శ్రీకృష్ణలీలాతరంగణి, లీలాశుకుల శ్రీకృష్ణకర్ణామృతమును, జయదేవుల గీతాగోవిందాన్ని మరిపిస్తాయి.
"కృష్ణం కలయ సఖి సుందరం...." వినని తెలుగు వారుండరేమో, తెలుగులో పారిజాతాపహరణం అనే యక్షగానాన్ని మేలటూరు భాగవతుల కోసం రాశారు. శ్రీకృష్ణలీలాతరంగిణి కృష్ణ కథను (రుక్మిణీ కళ్యాణం వరకు) 12 అంకాలుగా మలచిన యక్షగానం, ప్రదర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఇది భాగవతానికి ఉన్న 12 స్కంధాలకు ప్రతీక అనే పేరున్నది.
త్యాగరాజుల గురువు శొంఠి వెంకటరమణయ్య తండ్రి నారాయణతీర్కలవారి శిష్యుడే. ఇంకా ఆయనకు గౌడ బ్రహ్మానందులు, కాశ్మీర సదానందులు, ఆంధ్రమహేశ్వర తీర్థులు.. ఇలా ఎందరో శిష్యులు ఉన్నారు. గురువును మించిన శిష్యుడు గురువు రామానందులు ఒక కుటీరంలో, శిష్యుడు నారాయణతీర్ధులు మరో కుటీరంలో దూరంగా ఉండేవారు.
భక్తి భావనచే నారాయణతీర్థులకు కృష్ణదర్శనం అయ్యేది. అప్పుడు కుటీరమంతా వెలుగులతో నిండిపోయి ఉండేది. ఇదేమీ అర్థం కానట్టి ఇతర శిష్యులు నారాయణతీర్దులపై చాడీలు చెప్పారు. ఒకనాటి రాత్రి స్వయంగా గురువు రామానందులు శిష్యుని కుటీరంలోనికి తొంగి చూచాడు.
ఆ "వెలుగుకు కంటి చూపుపోయింది. అక్కడే కూలబడిపోయాడు. తెల్లవారింది, నారాయణ తీర్థులు బయటకు వచ్చి గురుదేవులను చూచాడు. గురుదేవులు తాను చేసిన పనిని చెప్పి, కృష్ణదర్శనం తనకు చేయింపుమని కోరాడు శిష్యుడిని.
తన గురువుకు కంటిచూపును, దర్శనాన్ని కలుగ చేయమని కృష్ణుడిని ప్రార్ధించాడు నారాయణ తీర్థులు, కృష్ణుడు దర్శనమిచ్చాడు. కంటిచూపు వచ్చింది గురువుకు. కృష్ణుడిని చూడగలిగాడు.
ఏ శిష్యుడైనా గురువుకు ఇంతకంటే ఎక్కువగా ఏం రుణం తీర్చగలడు?
కడుపునొప్పి :
ఒకసారి నారాయణతీర్థులకు కడుపునొప్పి వచ్చింది, ఎంతకూ తగ్గలేదు. స్వప్నంలో పందులు కనబడతాయని, వాటిని అనుసరింపుమని ఆదేశం వచ్చింది. తెల్లవారింది. పందులు కనబడ్డాయి. వాటి వెంట పోగా వరాహపురి వద్ద ఆగాయి. ఆ క్రితం రాత్రి గ్రామ పొలిమేరలకు వచ్చే వ్యక్తిని మేళతాళాలతో వెంకటేశ్వరాలయానికి తీసుకుపొమ్మని గ్రామ పెద్దలకు ఆదేశం వచ్చింది. అలాగే వారు వచ్చి నారాయణతీర్శలను వెంకటేశ్వరాలయానికి తీసుకుపోగానే కడుపునొప్పి మటుమాయమైంది. అక్కడనే ఆయన మహాసమాధి చెందాడంటారు. దగ్గరలోనే ఉన్న తిరుప్పందురుత్తిలో మహాసమాధి అయ్యాడని మరొక వాదన.
"కృష్ణంకలయసఖి సుందరం..." అని పాడుతూ ఆయనను స్మరిద్దాం.
సద్గురుకృప మాస పత్రిక నుంచి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి