శివుడు ఎవరు ?
ఆది శంకరాచార్యుల వారి ప్రకారం "శివ" అనగా కల్మషము లేని వాడు. అంటే ప్రకృతి యొక్క (సత్వ, తమో, రజో) గుణాలేవీ అంటని వాడు. అందుచేత శివనామస్మరణం తోనే సకలజనులని పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేని వాడు.
శివుడు జననమరణాలుకు అతీతుడు. కాలాతీతుడు అనగా కాలమునకు వశము అందని కానివాడు. అ౦దుకే సదా శివుడు అ౦టాము. అ౦తయు శివుడే అ౦దుకే ఆ౦దరు దేవతలు శివారాదకులే. బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు సదా శివలి౦గారాదన చేస్తు౦టారు. పరమశివుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అ౦తటా ఉ౦డేవాడు. శివుడు ఎ౦తవరకు విస్తరి౦చాడో కనుగొనట౦ అస౦బవ౦. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసాధ్యం.
మరొక ఇతిహాసములో:
"బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మ నిచ్చింది ఆది పరాశక్తి. పరాశక్తి కి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహా నంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతి లను సృష్టించాడు. ఆ ముగ్గురమ్మలను ఈ త్రిమూర్తులు పరిణయమాడారు " అని ఉంది.
పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్కఅర్ధం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాల కు ప్రతి రూపాలు. ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసనం పైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. ఆయన పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.
శివుడు కేవలం రుద్ర (రౌద్ర) స్వరూపమే కాక, ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం రెండు విధాలుగా దర్శించవచ్చును. రుద్రస్వరూపముగ ఐతే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచగణాలుగా దర్శనం ఇస్తే - శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీ దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు.
దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణా మూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి