కస్తూరి
కస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి కలిగి ఉంటుంది.
కస్తూరిని ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు.
"కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి"
అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీకృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ! ఆ సమయంలోముందు నీకొచ్చిన సందేహం ఏమిటి అంటారా? ఈ కస్తూరి అనేదితిలకం పేరా? లేక తిలకాన్నే కస్తూరి అంటారా? అదొక తిలకం బదులు వాడే ఆభరణమా? కస్తూరి అంటే ఏమిటి? అని.
పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావనఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది.మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి.
"చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం
ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాది భూషితం
మాలతీ మలయాయుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలం
సత్కంఠాభరణం చారు వలయాంగద భూషితం
వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా అమూల్య
వస్త్ర యుగ్మేన విచిత్రేణాతి రాజితం
చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్న
దర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం"
అందమయిన సంపెంగల కాంతి వంటి మేని కాంతితో ప్రకాశించేవాడు, ఒక ముఖము కలవాడు, మూడు కన్నులు కలవాడు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖము కలవాడు, బంగారు రత్నాభరణములతో అలంకరింపబడిన వాడు, మల్లె మాలలను ధరించినవాడు, గొప్పవైన రత్నములతో పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమైన కంకణములు, అంగదములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించే సాటిలేని సన్నని నూలుతో వడకిన రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు, చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నపుటద్దమును చేతియందు కలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు కలవాడు అయినటువంటి ఆ శివుడు కళ్యాణార్థం సర్వావిధ అలంకృతుడై తరలి వెళ్ళాడు అని శివపురాణంలో చెప్పబడింది.
ఎంత అద్భుతమయిన వర్ణనో కదా! కేవలం
కృష్ణుడి అలంకరణలో వినే కస్తూరిని శివుడు కూడా వాడటం జరిగిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!
"కస్తూరి తిలక తిద్దువె కాలిగె గెజ్జె కట్టువె
కాశీ పీతాంబర కొడువె కణ్ణిగె కాడిగె హచ్చువె"
అంటూ ఆ విష్ణువుని భజనలో కూడా కస్తూరిదే ప్రథమ స్థానం.
కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.
అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది. ఇన్నిటిలో ముఖ్య పాత్రను పోషించే కస్తూరి గురించి మరికొన్నివిషయాలు తెలుసు కుందాం.
వాస్తవానికి కస్తూరి అనేది
అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి. కస్తూరికిలో వెల దాదాపు రెండున్నర లక్షల రూపాయలు! పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకూ దీనిని సహజసిద్ధంగా తయారు చేసినా దానికున్న ఎన్నో ఉపయోగాల వలనకృత్రిమంగా కూడా దీనిని తయారుచేస్తున్నారు. కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది.
ఇది మగ కస్తూరి జింక (Moschus moschiferus L.) యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము.
కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం. ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట. ప్రత్యుత్పత్తి కాలంలో (మే - జూన్) ఎక్కువ శాతం కస్తూరిని తరాయుచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.దీనిని టిబెట్, చైనా, తదితరప్రాంతాలలో ఎక్కువగా తయారుచేస్తారు.
కృత్రిమంగా వీటిని పెద్ద మోతాదులో తయారుచేస్తున్నారు. ఆ ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి (ధవళ కస్తూరి) అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా మటుకు అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాల నుండి ఉత్పన్నమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే భావిస్తున్నారు జనాలు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్. దీనికి ఉన్న ప్రాముఖ్యమయిన పరిమళాన్ని గుర్తించిన యూరోపియన్లు దానిని perfumes తయారీలో వాడుతారుట.
అదే కాక దానికున్న పరిమళం వలన అగరుబత్తులు, సాంబ్రాణి అన్నిటికీ కస్తూరి పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమయిన జింక కస్తూరిని కలుపుతారో తెలియదు! సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణమదము, ఇట్టి గోరోజనము, సహస్ర వేధి, లత, మోదిని, మొదలయినవి కస్తూరి రకములు.
ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని పోషిస్తోంది.
ఎలా అంటే:
01. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలోనూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగావాడుతున్నారు.
02. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకివాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటినొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరిరసం పట్టించేవారు.
03. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనేదీనిని తాంబూలంలో కలిపి తింటారు.
04. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట,బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికిఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని పరగడపున పట్టిస్తారు.
05. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగనాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్నితగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదాచల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని!) మనిషిబ్రతుకుతాడని నమ్మిక.
06. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ,నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికిఇది చక్కని మందు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీముఖ్యమయినవి మాత్రం . కస్తూరి శ్రేష్టతకి మారు పేరు అంటారు. శ్రేష్టమయిన పసుపుని కస్తూరి పసుపు అనీ శ్రేష్టమయినకుంకుమని కస్తూరి కుంకుమ అనీ అంటారు.
కస్తూరిని మన కవులు మాత్రం వదులుతారా? ముఖ్యంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది పద్యాలలో తారసపడుతుంది.
"మృగ మదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!"
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా ఏ విధముగా ఐతే మంచివాసన వెదజల్లుతుందో అదే విధముగా గొప్పవారు బయటకిఆడంబరము లేకపోయినా గొప్ప శక్తి కలవారై ఉండును.దేనినీ రంగు లేదా హంగు చూసి మోసపోకూడదు అన్నది....దీని నీతి.
"కన్నె దాని మేను కస్తూరి వాసన
ముసలిదాని మేను ముఱికి కంపు
వయసుదాని మేను వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమ!"
"గార్ధబంబెరుగునా కస్తూరి వాసన
మిక్కుటంగ చెడుగు మేసుగాక
నుత్తమోత్తములకు వత్తురా వేశ్యలు
విశ్వదాభిరామ వినురవేమ!"
అంత సరళమయిన భాష వాడారు.
అంతే కాకుండా కస్తూరిని తిలకధారణలోను, పండుగలు విశేష కార్యక్రమాలలో దేవుళ్ళకు అభిషేకం లోను వాడుతారు. ఈ సుగంధద్రవ్యం ప్రత్యేక సువాసనే కాదు ప్రతేక ఆకర్షణని కూడా కలిగి ఉంటుంది. కస్తూరిని ఆరోగ్యం, అభిషేకం, పూజ, హోమం మొదలైన వాటిలో వాడుతారు. కస్తూరి పసుపు ను అందం కోసం వాడుతారు. కస్తూరి కుంకుమ ను ఆకర్షణ కోసం వాడుతారు. కస్తూరి కాయ ను స్థిర లక్ష్మి కోసం ప్రయోగిస్తారు. కస్తూరి తిలకం ఆకర్షణ మరియు అభిషేకాలలో వాడుతారు.
… శ్రీ ములుగు విశ్వనాథ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి