: పరాశర భట్టరు దత్తకోశం చేస్తూ ఓ శ్లోకమిచ్చారు మనకు. అదేమంటుందంటే... చతుర్ముఖ బ్రహ్మగారు జీవుడిని సృజించే ముందు పుర్రె చేత్తో పట్టుకుని రాయడం మొదలుపెడతాడట. వీడికి చదువెంత ఉండాలి.. రాస్తాడు. వీడికి ఆయుర్దాయం ఎంత... రాస్తాడు. బలం... రాస్తాడు. ఐశ్వర్యం ఎంతుండాలి...ఇది రాసేముందు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాడట. ''గతజన్మలో ఈ పుర్రెపేరేమిటి? ఈ జీవుడు ఏ పేరుతో బతికాడు ?'' అని అడుగుతుందట అమ్మవారు. ఫలానా వాడమ్మా... అని చెబుతాడు.. ఆవిడ ఏమీ అనకపోతే...'సామాన్యం' అని రాస్తాడు.
ఆవిడ విని 'వీడా, ఒకరికి పెట్టినవాడు కాదు' అని తలదించుకుంటే... 'దరిద్రుడు' అని రాస్తాడు. పేరు వినగానే 'ఆ! వాడా.. అని ఆవిడ కనుబొమ్మ పైకెత్తితే....'మహదైశ్వర్యవంతుడు' అని రాస్తాడట. కలిసొచ్చింది, కలిసొచ్చింది... అంటారే, ఎక్కడినుంచి వచ్చింది? అదంతా గత జన్మలతాలూకు పుణ్యం. దాన్ని ఆధారం చేసుకుని ఇక్కడ దాని ఫలితాన్ని అనుభవిస్తున్నావు. అదంతా ఇక్కడిదానికి సరిపోయింది. ఆ ఐశ్వర్యాన్ని, ఆ బలాన్ని, ఆ తెలివితేటలను ఉపయోగించి ఈ జన్మలో నీవు కూడబెట్టిందేమిటి? దాన్ని పుణ్యంకింద మార్చుకోవాలిగా...!!! ఎలా..!!!
నేనిక్కడినుంచి అమెరికా వెళ్ళాలి. ఇక్కడి రూపాయలు ఎన్ని పట్టుకెళ్ళినా అక్కడ ఓ కప్పు కాఫీకూడా దొరకదు. ఇక్కడి ధనం అక్కడ పనికిరాదు. అందుకని బయల్దేరేముందే దాన్ని అక్కడి ధనం ... డాలర్లకింద మార్చుకోవాలి. అప్పుడు అది పెట్టి కాఫీ కానీ మరేదయినా కానీ తీసుకోవచ్చు. కానీ రూపాయలు అక్కడ చెల్లవు. అలాగే, ఇక్కడ సంపాదించిన ధనం, బలం, తేజస్సు, తెలివితేటలు... అన్నీ ఇక్కడితో సరి. అవి ఉత్తర జన్మలకిక పనికిరావు. మరి ఉత్తరజన్మలకూ కూడా పనికివచ్చేటట్లు మార్చుకునే ప్రక్రియ ఒకటుంది.
రూపాయలు అమెరికా డాలర్లుగా మారినట్లు, దానితో ఇక్కడి బలం, ధనం... పుణ్యధనంగా మారుతుంది. ఎలా ?నీకు ఒంట్లో బలముంది. మనగుడి కార్యక్రమానికి వెళ్ళి ఓ దేవాలయాన్ని తుడిచావు. కొంతమంది ఏ క్షేత్రానికి వెళ్ళినా కొంతసేపు అక్కడ శ్రమించి స్వచ్ఛందంగా గుడికి, భక్తులకు సేవ చేస్తుంటారు. 63 మంది నాయనార్లలో ఒకడైన అప్పర్ నాయనార్ ఇలా చేస్తుండేవారు. ఇక్కడ బలం ఉంది. పల్లకి మోసావు. పూజా సామాగ్రిని శుభ్రపరిచావు. నీకు పాండిత్యం ఉంది.. పరుల హితం కోసం ఉపయోగించావు.
శాస్త్రాన్ని శాస్త్రంగా ప్రబోధం చేసావు. ఇలా నీవు ఇక్కడ ఉపయోగించినదంతా పుణ్యధనంగా మారుతుంది. ఎవరు మారుస్తారు అలా... చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా రాసుకునే వాడొకడున్నాడు. వాడే చిత్రగుప్తుడు. వాడెవరో కాదు, ఈశ్వరుడే. నీకిచ్చిన బలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు రాసుకుంటాడు.ఇక్కడ ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దానిని పుణ్యధనంగా మార్చుకోవడానికి ఏర్పడిన కేంద్రం– ఇంటిలో అయితే పూజగది, సమాజంలో అయితే దేవాలయం. ప్రతివాడికి ఏదో ఒక విభూతిపెట్టాడు, దానిని పరుల హితంకోరి, ఈశ్వరపరంచేయడమే పుణ్యధనంగా మార్చుకోవడం.
అటువంటి విభూతులలో ఒకటి–అతిథి. ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడిగా కనిపించినా, సామాన్యుడు మాత్రంకాడు. నీ గతజన్మ తాలూకు పాపాలను త్వరగా నశింపచేయడానికి పరమేశ్వరుడు ఏరికోరి మహాత్ములను అతిథులుగా పంపుతాడు. కనుక ఇంటికి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించడంవల్ల నీ పాపాలన్నీ నశించి, ఉత్తర జన్మలకోసం కావలసినంత పుణ్యధనాన్ని మూటగట్టుకోవచ్చని శాస్త్రం చెబుతున్నది.
- ✍ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
సేకరణ హిందూ ధర్మచక్రం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి