.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, ఆగస్టు 2019, ఆదివారం

భాగవతం - 25

భాగవతం - 25

శుకబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న మనం అందరూ కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. మనం అందరం కలి బాధలను పడుతున్నాము. కలి ప్రభావం మనమీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే శుకుడు. 
ఇక్కడ మన ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని చెప్పారనుకోండి – ‘అయ్యా మీరు ఇక రెండుమూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెప్పారనుకోండి – అప్పుడు ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘అయ్యా, మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని వచ్చామండి – మీకు భాగవతము చెపుదామని వచ్చామండి’ అని అన్నారనుకోండి – వాడు ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించడు. ఇప్పుడు ఎందుకండీ అంటాడు. ‘చచ్చేవేళ సందిమంత్రం’ అని మనవాళ్ళు ఒక మోటు సామెత ఒకటి చెపుతూ ఉంటారు. అపుడు సామాన్యమయిన వ్యక్తి చచ్చే వేల ఎవరు రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు? ఎవడికయినా ఎలా ఉంటుంది అంటే – ఆ ఉన్న రెండురోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు గారు అన్నాడు – ‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయినది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రమూ ఖేదపడడం లేదు. కానీ నేను పరమధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడనయి, తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీ మూర్తియై వున్న ఒక మహర్షి మేడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పనిని చేశాను అని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచేప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మము వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడయినా స్వామి వారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా, గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కారబలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక! నిరంతరమూ ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించ వలసినది. నాకు ఆశీర్వచనం చేయవలసింది’ అని ప్రార్థించాడు.
ఉత్తర జన్మలో ఉత్కృష్టమయిన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు పరీక్షిత్తు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగూ నాకు కావాలి అని అడిగాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘అయ్యా, నాకునాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక, నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.
భాగవతం - ద్వితీయస్కంధము – 25 
భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తానూ ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్కమాట చెప్పాడు. “పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను. జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. అపుడు ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెపుతారా’ అని అడిగాడు. అపుడు దేవతలు వాని ఆయుర్దాయం లేక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నాడని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు శుకుడు.
ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతోంది ఒక్క అరగంటలో ఏది నామరూపములు? వాడు పెట్టుకుంటే ఒక ఫోటో మిగిలిపోతుందంతే! పెట్టుకోక పోతే ఏ గొడవా లేదు. కాబట్టి ఇంతటి ఆభిజాత్యం కూడా పోయిందంతే! ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని నీవు ఈశ్వరాభిముఖుడవు కావలసింది. నీకు సంబంధించన ఈ భౌతిక సంబంధములు కాని, వ్యక్తులు కాని, ఆస్తులు కాని, సంపద కాని, ఏవీ నిన్ను రక్షించవు. నీవు ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేశాడు. చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచామహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసిన ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనపడడం లేదు. ఎందుకు? అదే మాయ. అది నామ రూపములయండు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయ అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు. 
ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాన నేత్రము చేత చూస్తె ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. ‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. నీకు ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినదమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. 
భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత ‘నీవు భగవత్ కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML