శ్రీమద్భాగవతం - 34
నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు.
ఐదేండ్ల పిల్లవాడయిన ధ్రువుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. అపుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అపుడు స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ద్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి. అందుకే ద్వాదశినాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధం అయిపోతుంది అంటారు.
ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా. ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మ్రుత్యుభాయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. అపుడు స్వామి అన్నారు ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ఏమిటో తెలుసా. ధర్మమూ అగ్ని కశ్యపుడు సప్తర్షులు కాలమునక్షత్ర మండలము ఋతువులు సూర్య చంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువ మండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధ్రువ మండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు.
అపుడు ధ్రువుడు అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకోని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలిగి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తాన పాదుడు కొంచెం బాధగా వున్నాడు. నారదుడు ఉత్తనపాడుడిని ‘అంత బాధగా వున్నావేమిటి” అని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సు గాయమును పొందింది’ అన్నాడు. అపుడు నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.
ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వారములు పొంది వచ్చాడు అని కాదు ఉత్తాన పాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.
ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.
రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది.
సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తర దిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్తా విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టు అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది.
తదనంతర కాలమందు ధ్రువుడికి వివాహం జరిగింది. ‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ద్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధ్రువ పథమై ఉంటాడు. మిగిలినవి అన్నీ కదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదలుత అని అర్థం. జ్యోతిశ్చక్రము నందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు నక్షత్రంలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము.
ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమయిన యక్షులతో విశేషమయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారయిన స్వాయంభువ మనువు కనపడి ఒకమాట చెప్పాడు. ‘నీవు పొందబోయే పావి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నరనారాయణాస్త్రమును ఉపసంహారం చేసి నువ్వు నీ ధనుస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో’ అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
18, ఆగస్టు 2019, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి