.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Sunday, August 18, 2019

శ్రీమద్భాగవతం - 35

శ్రీమద్భాగవతం - 35

ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధ్రువోపాఖ్యానం.
కుబేరుడు వచ్చి ‘నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడం నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను’ అన్నాడు. అప్పుడు ధ్రువుడు అన్నాడు ‘అపుడు నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా! నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకంగా నీవారము చేత కటాక్షింపబడుగాక’ అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో ఆ వరమును ద్రువునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వారు నీల మేఘము వంటి శరీరము కలిగినవారి శంఖచక్రగదాపద్మములను పట్టుకుని తానూ అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. అపుడు వాళ్ళు “మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. అందుకని స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము. మీరు విజయం చేసి విమానం ఎక్కండి’ అన్నారు.
అపుడు ధ్రువుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. ఆ విమానంలో కూర్చుని అనుకున్నాడు ‘ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితినా ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువ స్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ వుంటాను. ఎంత అదృష్టవంతుడిని’ అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరి అని ఆలోచించాడు. ‘దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో’ అనుకున్నాడు మనసులో. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. ‘నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు’ అన్నారు. ధ్రువుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీత వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడి లోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు. 
ఇంతటి అద్భుతమయిన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశం జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది.
3. పృథు చరిత్ర: 
ఒకానొక సమయంలో ఈ దేశమును అంగరాజు పరిపాలితూ ఉండేవాడు. ఆయన మహా ధార్మికుడు. కేవలము ధర్మానుష్టానము తప్ప ఎన్నడు అధర్మము చెయ్యని వాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ సందర్భంగా దేవతలను అందరిని పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు. ఆ రోజులలో స్వాహా అంటూ ఆ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని హవిస్సును అగ్ని ముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఒక్క దేవత రాలేదు! ఏ దేవతా రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు. ‘ఎందుచేత ఇలా జరిగింది’ అని ఋషులను అడిగాడు.
అపుడు ఋషులు ‘వేదము స్వరప్రాకటము. మా స్వరమునందు దోషము లేదు. కానీ వారు రావడం లేదంటే వారు నీయందు అప్రసన్నులై ఉన్నారు. అందుకు నీలో ఏదో దోషం ఉంది ఉండాలి. కానీ నీ చరిత్రను పరిశీలిస్తే నీయందు ఎక్కడా దోషం కనపడడం లేదు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి’ అన్నారు. ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకు సంతానం లేదు. అందుచేత యజ్ఞములో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. అపుడు ఋషులు ‘నీకు ఇప్పుడు ఉత్తరక్షణం సంతానం కలగాలి. గతజన్మలో నీవు చేసిన పాపములు ప్రతిబంధకంగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానం కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకమును తీసివేయాలి. అందుకు శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. దానికి మేము యాగం చేస్తాము. ఆ యాగము చేత శ్రీమహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానం కలుగుతుంది’ అన్నారు.
అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతికొరకు యాగం చేశాడు. యాగం పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించ చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండం లోంచి ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ‘అంగరాజా, ఈ పాయస పాత్రలో వున్న పాయసమును నీ ధర్మపత్ని చేత తినిపించు. అపుడు నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది’ అని చెప్పాడు. పాయస పాత్ర తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీథ. ఆవిడ భర్తృ సంగమము చేతనే సంతానమును పొందింది. తేజస్సు అంగరాజు తేజస్సే. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేక పోయింది? అనగా ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలుగకుండా చేసింది. ఇపుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇపుడు సంతానం కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్ర శుద్ధి జరుగలేదు. క్షేత్రమునందు దోషం ఉన్నది. ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావము కలిగినటువంటి వాడు జన్మించాడు. వానికి ‘వేనుడు’ అని పేరు వచ్చింది. 
జన్మతః వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలాకష్టం. వేనుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గరనుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదు. అతను వేటనుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు. ఆడుకుంటున్న పిల్లలను బడిత పుచ్చుకుని వారు చచ్చిపోయేవరకు కొట్టేవాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఈయన అలా చెపుతుంటే కొడుకు కనుబొమలు ఎగురవేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు. మరల తెల్లవారున లేవడం పాపకృత్యములు చేయడం! ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. ఒకరోజు భార్య, కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు మాత్రం నిద్ర పట్టక ‘నా జీవితమునకు ఏమి సార్ధకత? నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహానమును అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడయినా నన్ను ఉద్ధరించాలి. నాకు ఇంత దుష్దుడు పుట్టాడు. ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత? సింహాసనం ఉంటే ఎంత? రోజూ వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. అనుకుని విరాగియై అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురమును, భార్యను, బిడ్డను విడిచి పెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు. వారు ఆయన తల్లిగారయిన సునీథతో మాట్లాడి వేనుడికి పట్టాభిషేకం చేశారు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML