.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, ఆగస్టు 2019, ఆదివారం

భాగవతము... ప్రథమ స్కంధము...

భాగవతము...

ప్రథమ స్కంధము...

కథాప్రారంభము...

1-36-సీ.              సీస పద్యము

శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన; 
భాగవతంబు సద్భక్తితోడ
వినఁ గోరువారల విమలచిత్తంబులఁ; 
జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే; 
మంచివారలకు నిర్మత్సరులకుఁ
గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును; 
దగిలి యుండుట మహాతత్త్వబుద్ధిఁ

1-36.1-తే.

బరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నడఁచి పరమార్థభూతమై యధిక సుఖద
మై సమస్తంబుఁ గాకయు నయ్యు నుండు
వస్తు వెఱుఁగంగఁ దగు భాగవతమునందు.

ప్రతిపదార్ధము :

శ్రీమంతము = శుభంకరము; ఐ = అయిన ; ముని = మునులలో; శ్రేష్ఠ = శ్రేష్ఠునిచే - వ్యాసునిచేత; కృతంబు = రచింపబడినది; ఐన = అయినట్టి; భాగవతంబు = భాగవతము; సద్భక్తి = మంచిభక్తి; తోడన్ = తో; వినన్ = వినుటను; కోరువారల = కోరేవారి; విమల = నిర్మలమైన; చిత్తంబులన్ = మనస్సులలో; చెచ్చెరన్ = తొందరగా; ఈశుండు = జీవులలోనున్న ఈశ్వరుడు; చిక్కున్ = దొరకును; కాక = అంతేకాని; ఇతర = ఇతర; శాస్త్రంబులన్ = శాస్త్రములకు; ఈశుండు = ఈశ్వరుడు; చిక్కునే = దొరుకుతాడా; మంచివారల = మంచి వాళ్ళ; కున్ = కును; నిర్మత్సరులు = మాత్త్సర్యం లేని వాళ్ళ; కున్ = కును; కపట = మాయ నుంచి; నిర్ముక్తులై = విడిపింప బడ్డవారై; ఐ = అయ్యి; కాంక్ష = కోరుట; సేయకయును = చేయకుండక; తగిలి = తగిలి (భక్తికి); ఉండుటన్ = ఉండటమును; మహాతత్త్వ = మహత్త్వమైన అంతర్యామి యందు; బుద్ధిన్ = ధ్యాస; పరఁగ = ప్రవర్తిల్లగ; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలైన; తాపత్రయంబున్ = మూడు రకాలైన తాపములను {తాపత్రయంబు - (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆధిదైవిక)}; అడఁచి = అణచి; 

పరమార్థ = మోక్షము యొక్క; భూతము = రూపము; ఐ = అయ్యి; అధిక = మిక్కిలి; సుఖదము = సుఖప్రదము; ఐ = అయ్యి; సమస్తంబున్ = సర్వమును; కాకయు = కాకుండాను; అయ్యున్ = అయ్యికూడా; ఉండు = ఉండే టటువంటి; వస్తువు = వస్తువు; ఎఱుఁగంగన్ = తెలిసికొనుటకు; తగు = వీలున్నది; భాగవతమున్ = భాగవతము; అందున్ = లో.

భావం :

శ్రీమంతమైనది, వేదవ్యాస మహామునిచే విరచితము ఐన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతే గాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. సజ్జనులు మాత్సర్యరహితులు మహాతత్వబుద్ధి కలిగి కపటమార్గాన పోకుండ, ఎటువంటి కాంక్షా లేకుండ, భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అనే త్రివిధ తాపాలూ నశించి వారికి తత్త్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానంద దాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్త మవుతుంది.

|| ఓం నమః శివాయ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML