.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, July 31, 2017

సర్పయాగాన్ని ఆపిన ఆస్తీకుడు

సర్పయాగాన్ని ఆపిన ఆస్తీకుడు
"జరత్కారుడు'' అనే మహాముని ఉండేవాడు. అతడు మహా తపశ్శక్తి సంపన్నుడు, మహాజ్ఞాని, బ్రహ్మచారి. ఒకసారి జరత్కారుడు దేశసంచారం చేస్తూ పర్వతశిఖరాన ఉన్న ఓ వృక్షశాఖను వ్రేలాడుతూ, సద్గతులు లేక అలమటిస్తున్న తన పితురులను చూసి వారి ఆవేదనను అర్థం చేసుకుని వారికి సద్గతులు కలిగించాలని తలచి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని కన్యాన్వేషణ చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాడు. అయితే, వార్థక్యస్థితిలో ఉన్న జరత్కారునకు, కన్యాదానం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. పైగా జరత్కారుడు తన పేరు లాంటి పేరు వున్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నవాడు. ఇది ఒక కారణం జరత్కారునకు వివాహం కాకపోవడానికి. అందుచేత జరత్కారుడు బాధా తప్తహృదయుడై అరణ్యమధ్యంలోకి వెళ్ళి "ఈ చరాచర ప్రాణులు నా బాధను అర్థం చేసుకొనుగాక. నా పితరుల హితం కోరి, సంతాన కాంక్షతో వివాహం చేసుకోవాలని ప్రయత్నించి విఫలుడనయ్యాను. దయచేసి నా మనోభీష్టానికి తగిన కన్యను భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను'' అని బిగ్గరగా రోదించాడు. జరత్కారుని సమీపంలో ఉన్న కొందరు నాగులు, అతని ఆవేదన విని ... ఈవిషయాన్ని తమ సోదరుడు, ప్రభువు అయిన వాసుకికి నివేదించాయి.
వాసుకికి జరత్కారుని శక్తిసామర్థ్యాలు, అతని నియమాలు తెలుసు. వెంటనే తన సోదరి అయిన "జరత్కారువు''ను నవవధువుగా అలంకరించి, జరత్కారుని దగ్గరకు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకోమని అర్థించాడు. "నాగరాజా! వివాహానంతరం కూడా నీ సోదరి పోషణ భారం నీవే భరించాలి. నాకు ఇష్టంలేని పని ఈమె ఎప్పుడూ చెయ్యకూడదు. అలా చేసిన మరుక్షణం ఈమెను విడిచి వెళ్ళిపోతాను'' అన్నాడు. వాసుకి ఈ షరతులకు అంగీకరించాడు. జరత్కారునకు, జరత్కారువుతో రంగరంగ వైభావంగా వివాహం జరిగింది. మహర్షులందరూ నూతనదంపతులను ఆశీర్వదించారు. నాగకన్య జరత్కారువు శవాన న్యాయంతో మెలగుతూ భర్తకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ, పతివ్రతా నియమంతో సేవిస్తూ కాలం గడుపోతోంది. కాలచక్ర నియమానుసారం ఋతుస్నాత అయిన భార్య గర్భవతి కావడం కూడా అంతే సహజం. జరత్కారుని సేవలో జరత్కారువు గర్భవతి అయింది. ప్రజ్వలితాగ్ని సమతేజుడు, తపస్సంపన్నుడు అయిన శిశువు ఆమె గర్భంలో దినదిన ప్రవర్థనుడు అవుతున్నాడు. ఒకరోజు, సాయంసంధ్యా సమయంలో జరత్కారుడు గర్భవతి అయిన తన భార్య ఒడిలో తలవుంచి నిద్రస్తున్నాడు. సూర్యుడు అస్తాద్రికి చేరుతున్నాడు. సంధ్యాసమయంలో సూర్యునకు ఆర్ఘ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని, తన భర్తకు ధర్మలోపం జరుగుతుందేమోనని జరత్కారువు భయపడింది. తమ వివాహ నియమాలు ఆమెకు ఇంకా గుర్తున్నాయి. భర్తకు నిద్రాభంగం చేస్తే, తనను వదిలి వెళ్ళిపోతాడు. లేపకపోతే ధర్మభంగం జరుగుతుంది. ఆమె బాగా ఆలోచించింది. తనను భర్త వదిలేసినా బాధలేదు. ధర్మలోపం జరగకూడదు అని నిర్ణయించుకుంది. భర్తను మేల్కొలిపింది. కర్తవ్యాన్ని నివేదించింది. భార్య చేసిన పనికి జరత్కారుడు ఉగ్రుడయ్యాడు "నాగాకన్యా! నియమాన్ని ఉల్లంఘించి, నన్ను అవమానించావు. మాట నిలుపుకోలేని నీతో, నేను జీవనయాత్ర సాగించలేను. ఈ క్షణమే నిన్ను పరిత్యజ్యిస్తున్నాను'' అన్నాడు. భర్త పలుకులకు జరత్కారువు వణికిపోయింది. కన్నీళ్ళతో భర్తవంక చూస్తూ "స్వామీ! ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసిన పనికాదు. ధర్మలోపం మీ వల్ల జరగకూడదని ఇలా సాహసించాను'' అని పలికింది. "సాధ్వీ! కారణం ఏదైనా, నేను విధించిన షరతును ఉల్లంఘించావు కనుక మనకీ ఎడబాటు తప్పదు'' అన్నాడు జరత్కారుడు.
"స్వామీ! మా సోదరుడైన వాసుకి, నన్ను మీకిచ్చి వివాహం చేసే సమయంలో "సోదరీ! మాతృశాపానికి గురైన మన నాగవంశం నీ సంతానం వల్లనే ఉద్ధరింపబడాలి అన్నాడు. మీ అనుగ్రహం వల్ల నేను గర్భవతినయ్యాను. ఈ సమయంలో మీరు నన్ను వదిలి వెడతాననడం ధర్మమా?'' అని అర్థించింది జరత్కారువు."సాధ్వీ! మాటతప్పి నేను చరించలేను ... బాధపడకు. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నిసమ తెజుడు. వేదవేదాంగ పారంగుడు. మహా తపశ్శాలి. వాని వల్ల మీ నాగవంశం ఉద్ధరింపబడుతుంది'' అని భార్యను ఓదార్చి, జరత్కారుడు తపోభూమికి వెళ్ళిపోయాడు. జరత్కారువు తన సోదరుడైన వాసుకి ఇంటికి చేరుకుంది. నవమాసాలు నిండిన అనంతరం ఓ బాలుని ప్రసవించింది. మేనమామ అయిన వాసుకి ఇంటిలో ఆ బాలుడు పెరుగుతున్నాడు. ఋషులతో సంప్రదించి, ఆ బాలునకు "ఆస్తీకుడు'' అని నామకరణం చేశాడు వాసుకి. పంచవర్ష ప్రాయుడైన ఆస్తీకునికి ఉపనయనం కాగానే, భృగువంశ శ్రేష్ఠుడయిన చ్యవనమహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు వాసుకి. అతి శీఘ్రకాలంలోనే ఆస్తీకుడు సకల విద్యాపారంగతుడయ్యాడు.
ఆ రోజులలో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జనమేజయుడు ... తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పకులాన్ని అంతం చేయాలనే సర్పయాగం చేస్తున్నాడు. ఋత్విక్కుల వేదమంత్రాలకు బద్ధులైన అనేక సర్పాలు యాగగుండంలో పడి భస్మమవుతున్నాయి. శాపానికి భయపడిన తక్షకుడు ఇంద్రుని శరణుకోరాడు. ఇంద్రుడు తక్షకునకు అభయం ఇచ్చాడు. సర్పయాగం సాగుతోంది. అప్పుడు వాసుకి ఆస్తీకుని పిలిచి "నాయనా! జనమేజయుడు చేస్తున్న సర్పయాగానికి మన సర్పజాతి మొత్తం నాశనం కాకుండా, నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి'' అని అర్థించాడు. ఆస్తీకుడు స్థిరసంకల్పచిత్తుడై, జనమేజయుడు చేస్తున్న యాగాభూమికి వచ్చి తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు. అపర వామనుడులా వచ్చిన ఆస్తీకుని పాండిత్యానికి సంతసించిన జనమేజయుడు "ఏ వరం కావాలో కోరుకో'' అన్నాడు. "మహారాజా! పితృభక్తితో ఇంతవరకూ నీవు చేసిన సర్పహవనం చాలు. ఇక ఈ సర్పయాగాన్ని ఇక్కడతో ఆపేయాలి. ఇదే నా కోరిక'' అన్నాడు ఆస్తీకుడు. సత్యసంధుడైన జనమేజయుడు సర్పయాగాన్ని సగంలో ఆపేశాడు. ఆస్తీకుని కారణంగా సర్పవంశం నిర్వంశం కాకుండా నిలిచింది. తమ జాతి అంతరించి పోకుండా కాపాడిన ఆస్తీకునికి సర్పజాతి మొత్తం దాసోహం అయింది. ఆస్తీకుడు సర్పజతికి ఆరాధ్యదైవమయ్యాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML