తల్లిదండ్రుల సేవ, కులవృత్తిని మించిన దైవం లేదు
కౌశికుడు ఒక బ్రాహ్మణుని కుమారుడు. ఇతని తల్లిదండ్రులు వృద్ధులు. కౌశికుడు మొదటినుంచీ అహంకారి. తపస్సుచేసి శక్తులు సాధించాలనే కోరిక ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా వినకుండా అరణ్యాలకు పోయి ఒక చెట్టు క్రింద కూర్చుని తపస్సు ప్రారంభించాడు.అతని తపోదీక్షలో చాలా కాలం గతించి పొయింది. అయినా కౌశికుడు పట్టుదలగా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఓ కొంగ, కౌశికుడు తపస్సు చేస్తున్న చెట్టుమీద వ్రాలి అతనిమీద రెట్ట వేసింది. దానితో కౌశికునకు తపోభంగమై, కన్నులు తెరచి కోపంగా ఆ కొంగవైపు చూసాడు. అంతే..ఆ కొంగ మలమల మాడి భస్మమైపోయింది. అదిచూసి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. తన తపస్సు సిద్ధించిందనీ, తను మహాతపశ్శక్తి సంపన్నుడననీ తలచి, తపస్సు విరమించి, అరణ్యాలు వదలి నగరంలో ప్రవేశించాడు. నగరపౌరులెవ్వరూ అతని శక్తిని గుర్తిచడం లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు. కౌశికుడు ఒక ఇంటిముందు నిలబడి ‘భవతీ భిక్షాం దేహి’ అని అరిచాడు. ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి కౌశికుని చూసి, భిక్ష తెస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి లోపలకు వెళ్లింది. సరిగ్గా అదే సమయానికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. భిక్ష తెస్తున్న ఆ ఇల్లాలు వచ్చిన భర్తను చూసి, భిక్షపాత్రను పక్కనపెట్టి, భర్త సేవలో నిమగ్నమైంది. కౌశికుడు ‘భవతీ భిక్షాం దేహి’ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులు ఇల్లాలుకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ.. అదేమీ ఆమె పట్టించుకోకుండా, భర్తకు భోజనం పెట్టి, అతను నిద్రపోయేవరకూ అతని పాదాలు ఒత్తి, ఆ తర్వాత భిక్ష తీసుకుని గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆమెను చూస్తూనే కౌశికుడు కోపంతో ఊగిపోతూ ‘ఇంత ఆలస్యంగానా భిక్ష తీసుకురావడం నేనేమైనా సాధారణ భిక్షగాడిననుకున్నావా మహాతపశ్శక్తి సంపన్నులం’ అని కోపంతో ఎర్రబడిన కన్నులతో ఆమెవంక చూసాడు. ఆమె అడవిలోని కొంగలా మలమలా మాడి మసైపోలేదు. అదిచూసి మరింత ఆశ్చర్యపోయాడు కౌశికుడు. అది గమనించిన ఆ ఇల్లాలు ‘మీ కోపానికి మలమలా మాడిపోవడానికి నేనేమీ అడవిలోని కొంగను కాదు’ అంది. అడవిలో జరిగిన సంఘటన ఆ ఇల్లాలుకు ఎలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. అదే ప్రశ్న ఆమెను అడిగాడు. అప్పుడా ఇల్లాలు ‘నాకు తెలిసినదల్లా నా భర్తను సేవించుకోవడమే. అంతకుమించి నేను ఏ దైవపూజలు చెయ్యను.’ అని బదులిచ్చింది. కౌశికుడు ఆమెను పతివ్రతగా గుర్తించి, ఆమె పాదాలకు నమస్కరించి ధర్మోపదేశం చెయ్యమని ఆమెను అర్థించాడు. ఆమె తనకు తెలిసిన ధర్మాలు చెప్పి, ‘మీకింకా ధర్మాలు తెలుసుకోవాలని ఉంటే మిథిలానగరంలో ఉండే ధర్మవ్యాథుని కలవండి’ అని చెప్పింది ఆ ఇల్లాలు. ధర్మవ్యాథుని కలుసుకోవాలని కౌశికుడు మిథిలానగరం వచ్చి అతనుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ మాంసం విక్రయిస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కౌశికుని చూస్తూనే చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి ‘ఆ పతివ్రత పంపితే నా దగ్గరకు వచ్చారు కదూ’ అన్నాడు. ఆసంగతి ఇతనికెలా తెలిసిందో కౌశికునకు అర్థంకాలేదు. కానీ అతనే ధర్మవ్యాథుడై ఉంటాడని ఊహించాడు. అది గమనించి ‘అయ్యా... నేనే ధర్మవ్యాథుడను..నానుంచి ధర్మాలు తెలుసుకుందామని వచ్చారు..కొంతసేపు ఇక్కడ విశ్రమించండి.. నా వ్యాపారం ముగిసిన తర్వాత మీతో ధర్మ ప్రసంగం చేస్తాను’ అని చెప్పి తన వ్యాపారంలో నిమగ్నమయ్యాడు ధర్మవ్యాథుడు. కౌశికుడు అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ధర్మవ్యాథుడు అతని దగ్గరకు వచ్చాడు. కౌశికునితో ఎన్నో ధర్మసూక్ష్మాలు చర్చించాడు. కౌశికుడు ఆశ్చర్యపోతూ ‘మాంసం విక్రయించుకునే మీకు ఇన్ని ధర్మాలు మీకెలా తెలిసాయి’ అని ప్రశ్నించాడు. ధర్మవ్యాథుడు కౌశికుని తన ఇంటిలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ వృద్ధులైన దంపతులు ఉన్నారు. ధర్మవ్యాథుడు వారిని కౌశికునకు చూపిస్తూ ‘వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవలు చెయ్యడం తప్ప మరే పూజలు నేను చెయ్యను. అంతేకాక మాంసం విక్రయించడం నా కులవృత్తి. కులవృత్తిని మించిన దైవం మరేదీ లేదు.. మాతా పితరుల సేవను మించిన ధర్మం లేదు’ అని పలికాడు ధర్మవ్యాథుడు. కౌశికునకు ధర్మం ఏమిటో పూర్తిగా అర్థమైంది. అతను ధర్మవ్యాధుని దగ్గర సెలవు తీసుకుని తన తల్లిదండ్రులకు సేవలు చేసుకోవడానికి స్వగ్రామానికి బయలుదేరాడు.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి