.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

31, జులై 2017, సోమవారం

శ్రీ పెద్దమ్మ దేవాలయం – జూబ్లీహిల్స్

శ్రీ పెద్దమ్మ దేవాలయం – జూబ్లీహిల్స్
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం ఉన్నది. శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించియున్న సనాతనమైన అతి పురాతనమైన దేవాలయం. జంటనగరాలలో గల అతి పురాతన మరియు పెద్ద దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి. వేలసంవత్సరాల క్రితం నుండే ఇక్కడ ఈ దేవాలయమున్నట్లుగా తెలియుచున్నది.
ప్రవేశద్వారం స్వాగతిస్తున్న దేవతామూర్తితో సాక్షాత్కరిస్తుంది. ఆలయ రాజగోపురం ప్రవేశద్వారం పైన ఉన్న పెద్దమ్మతల్లి మూర్తి చూడగానే ఆకట్టుకుంటుంది. ఎడమచేతివైపు ఉన్న పెద్దమ్మతల్లి చిన్న గుడి సుమారు 150 సమవత్సరాల చరిత్రగల మూలగుడి అంటారు. ఆ తర్వాత మాజీమంత్రి దేవాలయ స్థాపక ధర్మకర్త కీ.శే.పి.జనార్ధన రెడ్డి(ఆలయ ఫౌండర్ ట్రస్టీ) గారి ఈధ్వర్యంలో పునర్నిర్మాణం జరిగింది. వీరి నేతృత్వంలో ఐదు అంతస్తుల గర్భగుడి, ఏడు అంతస్తుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహములు, శ్రీ గణపతి, లక్ష్మీ, సరస్వతి దేవాలయాలు నిర్మించబడి, 1994 లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మరియు కుంభాభిషేకాలు జరిగాయి. ఆనాటి నుండి నగరంలో పెద్దమ్మగుడి మరింత వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఆలయ ప్రాంగణంలో ధ్వజస్థంభం ఉన్నది. ధ్వజస్థంభం ముందు ఉన్న పీఠం మధ్యభాగాన రూపాయి బిళ్ళను అంచుమీద పడిపోకుండా నిలబెట్టగలిగితే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భ్వజస్తంభానికి ఇరుప్రక్కలా పోతురాజు విగ్రహ మూర్తులు ఉన్నారు. గర్భాలయంలో పెద్దమ్మతల్లి చతుర్భుజాలతో, విశాల నేత్రాలతో ఎడమవైపు చేతులలో శంఖం, ప్రత్యేక త్రిశూలం, కుంకుమభరిణెతోనూ, కుడివైపు చేతులలో చక్రం, ఖడ్గంతో దర్శనమిస్తుంది. అర్చనామూర్తియైన ప్రధాన విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడే ఉన్నారు. గర్భాలయాన అమ్మవారి పై కప్పు ఇష్టదళ పద్మాకారంతో కాంతులీనుతూ ఉంటుంది. ఉత్సవ మూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మ నవరత్నఖచిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది.
ప్రతిరోజు ఈ పెద్దమ్మతల్లికి నిత్య అభిషేకములు, కుంకుమార్చన, అలంకారములు, ఉత్సవ విగ్రహమునకు అభిషేకములు మరియు ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరపబడుచున్నవి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు దసరా నవరాత్రులు, ఆషాడశుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవములు మరుయు శ్రీ నాగదేవత దేవాలయంలో ప్రతి మంగళవారం నాగదోషపూజలు, మాఘ శుద్ధ పంచమి మొదలు సప్తమి వరకు వార్షిక రథోత్సవములు, రథసప్తమి రోజు రథము ఊరేగింపు కన్నుల పండగగా జరుపుతారు. రథసప్తమి రోజున చండీహోమం, బలిహరణం, అన్నదానం, జరుగుతాయి. పెద్దమ్మతల్లికి ఎరుపు, పసుపు వస్త్రాలను పరచి వేడివేడి అన్నం నివేదిస్తారు. హలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి, ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. నవరత్న ఖచిత వజ్ర వైఢూర్య ఆభరణాలతో, బంగారుజడతో శోభయమానంగా అలంకరిస్తారు. వెండి సింహాసనం పై కూర్చోపెడతారు. మహానివేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాట్లు చేస్తారు. ఉత్సవవిగ్రహం ముందే కూష్మాండం అనగా గుమ్మడికాయను కుంకుమనీటితో కడిగి బలిపీఠంపై ఉంచుతారు. ఖడ్గాన్ని అలంకరించి పూజించి, బలిపీఠంపైన ఉన్న గుమ్మడికాయను కత్తితో రెండు ముక్కలు చేసి బలినివేదన చేస్తారు. ఈ దేవాలయంనకు భక్తులు జంటనగరాల నుండే కాక, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో వస్తారు. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో ఆలయమునకు వచ్చిన భక్తులు సంప్రదాయ సిద్ధంగా బోనములు పెద్దమ్మ తల్లికి సమర్పించి వారి మొక్కులను చెల్లించుకుంటారు. అమ్మవారికి మొక్కుబడులుగా గాజులు, చీరలు కూడా భక్తులు సమర్పించుకుంటారు. గర్భాలయం వనుకవైపున నవదుర్గల ఆలయం ఉన్నది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా నవనిధ దుర్గామాత మూర్తులను ఇచ్చట దర్శించుకుంటారు. ఈ పెద్దమ్మతల్లిని నిత్యం ఎంతోమంది భక్తులు దర్శించి తరిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML