ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
తీజ్ ఉత్సవం విశిష్టత
తీజ్ ఉత్సవం విశిష్టత
గిరిజన తెగలలో అధిక శాతం ఉన్న లంబాడీలకు ప్రత్యేక సంస్కృతి ఉన్నది. ప్రత్యేకమైన వేషధారణ ఉంటుంది. వీళ్లు అతి తక్కువ దేవతలను పూజిస్తారు. కొన్ని పండుగలను జరుపుకుంటారు. అందులో ఒకటి తీజ్ పండుగ. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వీరు ఈ రోజుల్లో తీజ్ పండుగను నిర్వహించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఇష్టం వచ్చినప్పుడు నిర్వహించుకుంటున్నారు.
దేశంలోని లంబాడీలను బంజారా, చరన్ బంజారా, లవన్ బంజారా, సుగాలీ, వణజర వాటి ఉప కులాలు (భాట్, ఢాడీ) మొదలగు పేర్లతో పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంజారాలు (గోర్‌మాటి) అనే పేరు ఎక్కువ వాడుకలో ఉన్నది. భారతదేశంలోని బంజారాలు ఆర్థిక పరిస్థితుల వల్ల రాష్ర్టాల వారీగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వారు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. సమాజంలో మమేకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి ఘన చరిత్ర ఉన్నప్పటికీ వీరి భాషకు లిపి లేదు. దీంతో వీరి చరిత్ర మౌఖికంగా వారి ఉపకులంలోని భాట్, ఢాడీలు వినిపిస్తుంటారు.
లిపిలేని కారణంగా కుల ఆచారాలలో, పండుగల నిర్వహణలో ప్రాంతాల వారీగా కొద్దిపాటి వ్యత్యాసాలు న్నాయి. బంజారాలు దసరా, దీపావళి, ఉగాది, హోలీలతో పాటు తమ జాతి విశిష్టతకు ప్రతీక అయిన తీజ్ పండుగను దక్షిణ భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. ఈ తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకుంటారు. ఇందులో తెలంగాణ ప్రాంత లాంబాడీలు అధికం. వీరు జీవనోపాధి లేక ఏజెన్సీ ప్రాంతాల కంటే మైదాన ప్రాంతంలోనే ఎక్కువగా స్థిరపడ్డారు. పట్టణాలకు వలస వచ్చి కూలీలుగా జీవిస్తున్నారు. తీజ్ అనగా హరియాలి (పచ్చని గరక వలె ఉండే గోధుమ నారు) అని అర్థం.
ఈ పండుగను వివాహం కావాల్సిన లంబాడీ యువతులు జరుపుకుంటారు. వరుస కలిసిన ఇద్దరు యువతులు పూజారులుగా ఉంటారు. వీరు తొమ్మిది రోజులు నిష్టతో ఉండి రోజుకు ఒక పూట శాకాహారం తీసుకుంటారు. భక్తిశ్రద్ధలతో గణ్ గోర్ (శివ పార్వతులు), వీరి కుల దేవతలైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, దండీ మేరమయాడీలను పూజిస్తారు. వారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతిరోజూ ఆట, పాటలతో తొమ్మిదవ రోజు చెరువులో నిమజ్జనం చేసే చేసే వరకు ఉత్సవం కొనసాగుతుంది.
బుట్టలలో గోధుమలు ఎంత పచ్చగా పెరిగితే (తీజ్) అంత శుభంగా జరుగుతుందని నమ్మకం. మా తండాలు, మా ప్రాంతం, మా రాష్ట్రం, మా దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు పచ్చగా ఉండాలని లంబాడీ యువతులు దేవతలను, పూర్వీకులను వేడుకుంటారు. తండాలో పెళ్లి చేసుకోబోయే యువతులు ఆ తండా నాయకుడిని తీజ్ పండుగ నిర్వహించాలని వేడుకుంటారు. తీజ్ పండుగ జరుపుకోవడానికి కుల పెద్ద అయిన నాయకుడు అనుమతించిన తర్వాత జూలై మాసం మొదలుకొని సెప్టెంబర్ మాసం మొదటి వారం లోపు జరుపుకోవచ్చు. తీజ్ పండుగ ప్రారంభానికి ముందురోజు (మంగళవారం) వనభోజనానికి వెళ్లి, సప్తమాతల్లో ఒకరైన సీత్ల భవానీ పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంలో పశుపక్ష్యాదులకు వ్యాధులు సోకకూడదని, సీత్ల భవాని ముందు నుంచి పశువుల మందలను దాటిస్తూ దేవలకు సమర్పించిన పదార్థాల నుంచి (గుడాలు కొన్నింటిని వాటిపై చల్లుతారు. అదేరోజు సాయంత్రం తండా నాయకుని ఇంటి ముందు తీజ్‌కు సంబంధించిన గోధుమలను ఒక బిందెలో పోసి నానబెట్టి, ఉట్టి సాయంతో ఒక కొయ్యకు వేలాడదీస్తారు. మరుసటిరోజు బుధవారం సాయంత్రం కంకతో తయారుచేయబడిన బుట్టలతో కొంత ఎరువులు వేసి గోధుమలను నాటుతారు.
గోధుమలతో కూడిన ప్రతి ఒక్క బుట్ట ఆ తండాలో ఉన్న ఆడపిల్లలకు సమానంగా ఉంటాయి. అవి కాకుండా వారి బంధువుల ఆడపిల్ల పేరు మీద కూడా బుట్టలను కడతారు. వీటితో పాటు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, దండీమేరమయాడీ పేర్ల మీద టేకాకులతో తయారు చేసిన రెండు డొప్పలలో కూడా గోధుమలను పెంచుతారు. బట్టలను ఒక ప్రదేశంలో కట్టిన రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు ప్రతిరోజు మూడుసార్లు పూజారులుగా ఉన్న ఆడపిల్లలు, ఇతరులు డప్పువాయిద్యాలతో పాటలతో చెరువు లేదా చేతబావి నుంచి తెచ్చిన నీళ్లను గోధుమలకు పోస్తారు.
గణగోర్: దీన్ని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. నిమజ్జనానికి ముందురోజు పుట్టి మట్టిని తెచ్చి రెండు విగ్రహాలను తయారు చేస్తారు. ఆట పాటలతో తీజ్‌ను నెలకొల్పిన ప్రదేశానికి తీసుకువచ్చి పూజారులైన ఆడపిల్లలు హోమంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు. వారి మనసులో ఉన్న కోరికలను కోరుకుంటారు.
ఢమోళీ: ఈ కార్యక్రమం కూడా నిమజ్జనానికి ముందురోజు సాయత్రం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన తీపి పదార్థాలు ఒక పెద్ద పాత్రలో వేసుకుని తలపై ప్రత్యేకంగా అలంకరించబడిన చుట్టబట్టపై పట్టుకుని, ప్రత్యేకంగా అలంకరించిన వస్త్రం (అద్దాలు, గవ్వలు, పూసలతో తయారు చేసినటువంటి గోణో) పాత్రపై కప్పుకుని అందరూ తీజ్ నెలకొల్పిన పెద్దమనిషి ఇంటికి వస్తారు.
తీజ్ బుట్టలో నుంచి రెండింటిని తీసి పూజారులైన అమ్మాయిలు వాటి ముందు హోమం పెట్టి నైవేద్యాన్ని సమర్పిస్తారు. తర్వాత తెచ్చిన తీపిని ఇంటింటికి వెళ్లి పంచుకుంటారు. నిమజ్జనం రోజు ఉదయం (గురువారం) సంప్రదాయం ప్రకారంగా శ్రీ సేవాలాల్ మహరాజ్‌కు హోమం పెట్టి, దండిమేరమయాడీకి బలి పూజ చేస్తారు. ఆ రోజు వచ్చిన బంధువులతో (పామణ్) కలిసి సాంస్కృతిక కార్యక్రమాలైన (నాచేరో, దండామారేరో) ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం గోధుమనారుతో కూడిన తీజ్ బుట్టలను ఎవరివి వారు తీసుకుని నిమజ్జనానికి ఆడుతూపాడుతూ బయలుదేరుతారు. చెరువులో నిమజ్జనం చేసిన తర్వాత వారి ఆడపడుచుల కాళ్లు (పిడియ)పైన ఉంచి కడిగి దండం పెడుతారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి