ప్రకృతి ధర్మానికి సహాయపడిన కృష్ణార్జునులు
వేల సంవత్సరాల క్రితం మనిషి పూర్తిగా ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవాడు. నిప్పుకి బెదరడం, వానకి తడవడం, మెరుపుకి భయపడటం... తప్పేవి కావు. రానురానూ అతనిలోని మేథ పెరిగింది. ఇతర జంతువులతో సమానంగా బతికిన అతను పరిపూర్ణ మానవునిగా మారాడు. ప్రకృతి ఎప్పటికీ అతని వశం కాకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో దానిని తనకి అనుకూలంగా మార్చుకునే నేర్పు, అవసరమైతే ప్రకృతికే సాయపడగలిగే నైపుణ్యం అతనిలో కలిగాయి. ఈ మార్పుని సూచించేలా మహాభారతంలో ఎన్నో కథలు కనిపిస్తాయి. కృష్ణుడు మేథోశక్తికి ప్రతీకగా, అర్జునుడు మానవ ప్రయత్నానికి ఉదాహరణగా నిలిచే అలాంటి కథలలో ఖాండవ దహనం ఒకటి. మానవులంతా తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నారనీ, తనని భయభక్తులతో కొలిస్తే కానీ వారికి మనుగడ లేదని విర్రవీగుతుంటాడు ఇంద్రుడు. అతని గర్వాన్ని ఎప్పటికప్పుడు భంగపరుస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. తొలిసారి గోవర్థన గిరిని ఎత్తి, గోకులం మీద కుంభవృష్టిని కురిపిస్తున్న ఇంద్రుని చిన్నబుచ్చుతాడు. మరోసారి ఖాండవదహనంలోనూ వీరిద్దరి మధ్యా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. ఇంతకీ ఆ కథ ఏమిటంటే...
ఒక రోజు వేసవి తాపం నుంచి ఉపశమనంగా ఉండేందుకు కృష్ణార్జునులు ఇరువురూ ఖాండవవనం అనే దట్టమైన అడవి వద్దకు చేరుకున్నారు. వారిద్దరూ ఆ వనం నుంచి వస్తున చల్లగాలులకు సేదతీరుతూ, యమునానదీ తీరాన విడిది చేసి ఉండగా ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. `తాను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాననీ, తన వ్యాధిని నయం చేయగల పరిష్కారం కృష్ణార్జునుల వద్దనే ఉందనీ, దయచేసి తనను అనుగ్రహించమనీ` వారిరువురినీ వేడుకుంటాడు. `సరే`నన్న అభయాన్ని పొందిన తరువాత ఆ బ్రాహ్మణుడు తన అసలు రూపాన్ని ధరిస్తాడు. అతను ఎవరో కాదు అగ్నిదేవుడే! ఆ అగ్నిదేవుడు ఎన్నో రోజులుగా ఖాండవవనాన్ని దహించాలని అనుకుంటున్నాడు. దానివల్ల అతని ఆకలి తీరడమే కాదు, అక్కడ ఉండే భూమి మరింత సారవంతంగా మారుతుంది. జీవరాశులు మళ్లీ కొత్త ఊపిరిని పోసుకుంటాయి. అది ప్రకృతి ధర్మం. కానీ ఆ అడవిలో ఇంద్రుని స్నేహితుడైన తక్షుడు అనే సర్పరాజు నివాసం ఉంటున్నాడు. అతడిని కాపాడటం కోసం, ఇంద్రుడు ప్రతిసారీ అగ్నిదేవునికి అడ్డుపడుతున్నాడు. అగ్నిదేవుడు అడవిలో చెలరేగిన ప్రతిసారీ, ఇంద్రుడు వర్షాన్ని కురిపించి అతడని ఆర్పివేస్తున్నాడు. అందుకనే విసిగివేసారిని అగ్నిదేవుడు కృష్ణార్జునుల శరణుకోరాడు.
కృష్ణార్జునులు అగ్నిదేవునికి సాయపడేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం అర్జునుడికి వరుణుడు `గాండీవం` అనే ధనుస్సుని కూడా అందించాడు. అలా అర్జునుడు గాండీవిగా స్థిరపడ్డాడు. ఇక అగ్నిదేవుడు తన జ్వాలల కోరలను ఖాండవవనం మీదకి చాచాడు. చెట్టూచేమా, పిల్లామేకా... అన్నీ అగ్నికి ఆహుతికాసాగాయి. ఇంద్రుడు యథాప్రకారం అగ్నిని అడ్డుకునేందుకు వర్షధారలను కురిపించడం మొదలుపెట్టాడు. అయితే అందులోని ఒక్క చుక్క కూడా నేల మీదకి పడకుండా అర్జునుడు తన బాణాలని వనం మీద అడ్డుగా నిలిపాడు. తన ప్రయత్నం వృథా కావడంతో స్వయంగా ఇంద్రుడే దిగివచ్చి కృష్ణార్జునులతో యుద్ధం చేసినా లాభం లేకపోయింది. ఒక్క మయుడు అనే రాక్షసుడు మాత్రం ఎలాగొలా ఆ మంటలను తప్పించుకుని శ్రీకృష్ణుని శరణువేడుకున్నాడు. తనని కనుక వదిలివేస్తే పాండవుల కోసం అద్భుతమైన కట్టడాలను నిర్మించి ఇస్తానని మాట ఇచ్చాడు (అలా నిర్మించినదే మయసభ!). కానీ అప్పటికే ఆయువు ముగిసిన ఏ ఒక్క ప్రాణినీ కృష్ణార్జునులు వదిలిపెట్టలేదు. మరోపక్క అగ్నిదేవుడు ఒక్క గడ్డిపరక కూడా మిగలకుండా ఖాండవనాన్ని దహించివేశాడు. కృష్ణార్జునుల సాయంతో తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. ఇదీ ఖాండవదహనం కథ.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు
సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు
31, జులై 2017, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి