.

.

గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

Monday, July 31, 2017

కపట మాటల్ని నమ్మకూడదు

కపట మాటల్ని నమ్మకూడదు
అంపశయ్య మీద ఉన్న భీష్ముడు తన మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఊరికే కాలక్షేపం చేయలేదు. భగవంతుని ప్రార్థనలోనూ, ధర్మోపదేశాలతోనూ ఆ కాస్త సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అలా భీష్ముడు రాజనీతి గురించి ధర్మరాజుకి చేసిన ఉపదేశాలతో నిండిన శాంతిపర్వం మహాభారతంలోనే ఒక అరుదైన ఘట్టం. అందులోని తృతీయాశ్వాసంలోని కథ ఈరోజుకీ విలువైందిగానే కనిపిస్తుంది....
పూర్వం విదిశాపట్నంలో ఒక బ్రాహ్మణు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లోని ముక్కుపచ్చలారని పిల్లవాడు అర్థంతరంగా చనిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణుడి గుండె పగిలిపోయింది. ఆ శోకంలోనే పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలు స్మశానానికి చేరుకున్నారు. కానీ బిడ్డను అక్కడ వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావడం లేదు. ఆ దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా ఓదార్పు దక్కడం లేదు. ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనించింది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరింది. కానీ బాలుడి తల్లిదండ్రులు ఎంతకీ ఆ శవాన్ని వదిలివెళ్లడం లేదే! చీకటిపడిపోతే తను నేల మీద సంచరించడం కష్టం. అందుకని నిదానంగా ఆ కుటుంబం దగ్గరకి చేరింది- ‘అయ్యా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటారు? చీకటిపడితే భూతప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి బయలుదేరండి,’ అంటూ తొందరపెట్టింది. ఇంతలో ఈ హడావుడి అంతా చూసి ఓ నక్క కూడా అటువైపుగా వచ్చింది. శవాన్ని చూసి దానికి కూడా నోరూరింది. కానీ ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా తోచింది. ఎలాగొలా ఆ కుటుంబాన్ని చీకటిపడేవారకూ ఆపగలిగితే తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు కదా అనుకుంది. అందుకనే నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి- ‘ఈ పిల్లవాడిని వదిలివెళ్లడానికి మీకు మనసెలా ఒప్పుతోంది. కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. ఏ దేవతైనా కరుణించి మీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా!’ అంది. ఇక పిల్లవాడి తల్లిదండ్రులని పంపేందుకు గద్దా, ఆపేందుకు నక్కా కంకణం కట్టుకున్నాయి. ‘నేను వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇంతవరకూ పోయిన ప్రాణం తిరిగిరావడాన్ని ఎక్కడా చూడలేదు. ఆ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంపుకుని భంగపడవద్దు,’ అంటూ గద్ద హెచ్చరించింది. ఆ మాటలకు బ్రాహ్మణ కుటుంబం బయల్దేరేలోగా... ’ఈ గద్ద మనసు మహా క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుడిని బతికించిన కథ వినలేదా! సృంజయుడి కుమారుడైన సువర్ణష్టీవిని, నారదుడు బతికించలేదా! అలాగే ఏ దేవతో, యక్షుడో నీ కుమారుడిని కూడా బతికించవచ్చు కదా!’ అంటూ నక్క వారిని నిలువరించింది. అలా అటు నక్కా, ఇటు గద్దా బాలుడి శవం కోసం వేటికి అనుగుణమైన వాదనలను అవి వినిపించసాగాయి. ఈలోగా పరమేశ్వరుడు రుద్రభూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబపు దీనావస్థను చూసి- మీకేం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బతికించమంటూ కోరుకున్నారు. వారి కోరికను శివుడు మన్నించాడు. అంతేకాదు! ఇలాంటి పాపాలు మున్ముందు చేసే అవసరం లేకుండా గద్ద, నక్కలు ఆకలి లేకుండా చిరకాలం జీవిస్తాయంటూ వరమిచ్చాడు.
అక్కడితో ఆ కథ సుఖాంతమైంది. కానీ వినిపించే ప్రతిమాటా, మన మంచి కోసమే అని నమ్మకూడదన్న లౌక్యాన్ని కూడా అందించింది. కపటమైన వారు ఎదుటివారి కష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. తియ్యటి మాటలతో తమ పథకాన్ని అమలుచేస్తుంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. వారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML