.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

భీష్మ పర్వము – 11 కురుక్షేత్ర యుధ్ధం మూడవ రోజు (అర్ధచంద్ర వ్యూహం)- i



భీష్మ పర్వము – 11

కురుక్షేత్ర యుధ్ధం మూడవ రోజు (అర్ధచంద్ర వ్యూహం)- i




మూడవరోజు యుద్ధానికి భీష్ముడు తన సేనలను గరుడవ్యూహంలో నిలిపాడు. ఆవ్యూహానికి తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలను కళ్ళు ఉండే స్థానంలోను, అశ్వథ్థామను తలభాగంలోను నిలిపాడు. త్రిగర్తలాధీశునితో చేరి భూరిశ్రవసుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రధుడు కంఠ భాగాన నిలిచారు. సుయోధనుడు, సుయోధనుని తమ్ములు వెన్ను భాగమున నిలిచారు. విందాను విందులు, కాంభోజరాజు, శూరసేనుడు తోక భాగమున నిలిచారు. మగధ, కళింగ రాజులు కుడి రెక్కగా నిలిచారు. కర్ణాటక, కోసల రాజులు ఎడమ రెక్కగా నిలిచారు. ధృష్టద్యుమ్నుడు పాండవ సేనలను అర్జునుని కోరికపై అర్ధచంద్ర ఆకారంలో నిలిపాడు. పాండ్య, మగధ రాజులతో భీమసేనుడు చంద్రుని కుడి కొమ్ము భాగాన నిలిచారు. భీమసేనునికి ఎడమ పక్కన విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యంతో నిలిచారు. శిఖండి సహితంగా ధృష్టద్యుమ్నుడు ముందు నిలువగా ధర్మరాజు మధ్య భాగాన నిలిచాడు. వారి పక్కన సాత్యకి, నకులసహదేవులు, ఉపపాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకయ రాజులు తమ సైన్యాలతో నిలిచారు. అర్జునుడు సైన్యాలకు ఎడమ కొమ్ము దగ్గర నిలిచాడు. భేరి తూర్య నాదాలు మిన్నంటాయి. మూడవ రోజు యుద్ధం ఆరంభం అయింది. ఇరు పక్షములు ఒకరితో ఒకరు తలపడ్డాయి.




యుద్ధం ఆరంభం కాగానే అర్జునుడు గాండీవమును సారించి కౌరవ సేనలోని రధములను, రధమునకు కట్టిన హయములను, ధ్వజములను, సారధులను , రధికులను నుగ్గు చేస్తున్నాడు. గాంధారీ పుత్రులు ఒక్కుమ్మడిగా అర్జునుని మీదకు వచ్చారు. పాండవులు ఇది చూసి తమసైన్యములతో అర్జునునికి సాయం వచ్చారు. భీముని కనుసన్నలలో పాండవసైన్యం, భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి. భీష్ముడు, శకుని, సైంధవుడు, వికర్ణుడు ఒక్క సారిగా పాండవ సేనలపై పడగా భీమసేనుడు, సాత్యకి, శైభ్యుడు, ఘతోత్కచుడు, ఉప పాండవులు, చేకితానుడు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతోంది. దుర్యోధనుడు తన రధమును భీముని వైపు పోనిచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు అతడికి సాయం వచ్చారు. ఇది చూసిన అర్జునుడు తన రధమును వారి మధ్య నిలిపి సుయోధన, భీష్మ, ద్రోణులపై శరసంధానం చేసి వారిని శరములతో ముంచెత్తాడు. అర్జునునికి సాత్యకి సాయం వచ్చాడు. ఇద్దరూ కౌరవ సేనలను చీల్చి చెండాడారు. శకుని తన బాణంతో సాత్యకి రథం విరిచాడు. సాత్యకి రథం దిగి అభిమన్యుని రథం ఎక్కి శకునిని శరములతో వేధించారు. యుధిష్టరుడు భీష్మునితో పోరు సాగించాడు. సుయోధనుడు భీమునిపై శరప్రయోగం చేసాడు. భీముడు వాటిని మధ్యలో ఆపి వేసి సుయోధనుని వక్షస్థలముకు గురి పెట్టి ఒక్క బాణం వేసాడు. ఆబాణం తాకిడికి సుయోధనుడు రథంపై మూర్చిల్లాడు. కంగారుగా సారధి సుయోధనుని పక్కకు తొలిగించాడు. కౌరవ సేనలు ఇది చూసి భీతిల్లాయి. ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనలను తరమ సాగాడు. భీష్మద్రోణులు కౌరవ సేనలతో “సుయోధనుడు క్షేమంగా ఉన్నాడు. కంగారు పడకండి. పారిపోకండి” అని అరిచినా ప్రయోజనం లేక పోయింది. సాత్యకి, అభిమన్యుడు శకునిని అదే పనిగా తరుముతున్నారు. శకుని తన బంధు జనాలతో పారి పోయాడు. మరొక పక్క అర్జునుడు కౌరవ సేనలను తరమ సాగాడు. సుయోధనుడు మూర్చ నుండి తేరుకుని తన రధమును పక్కకు తీసుకు వచ్చినందుకు సారధి మీద కోపగించుకున్నాడు. భీష్మ, ద్రోణుల మనసు కుదుటపడి సైన్యాలను పారి పోకుండా ఆపారు.




సుయోధనుడు భీష్మ ద్రోణుల వద్దకు వెళ్ళి “పితామహా! మూడు లోకములు ఒక్కటిగా వచ్చినా ఒంటరిగా పోరి గెలువగల సమర్ధులు మీరు ఉండగా మన సేనలకు ఈ దురవస్థ ఏమిటి? మీరు పాడవులతో యుద్ధం చేయనని ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణునికి నచ్చ చెప్పి యుద్ధమునకు తీసుకు వచ్చే వాడిని. నిన్ను నమ్మి భంగపడ్డాను అనుకుని ప్రయోజనం ఏమిటి?” అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు చిరు నవ్వు నవ్వి “సుయోధనా! దేవసైన్యంతో ఇంద్రుడు వచ్చినా పాండవులను గెలుచుట సాధ్యం కాని పని. అన్నీ తెలిసి నీవు ఇలా మాటాడ తగదు. నా వంటి వృద్ధులు, ఇప్పటికే సగం చచ్చిన వారు, దుర్బుద్ధి కల వారిచే పాండుకుమారులు ఓడి పోరు. నాకు చేతనయినంత వరకు వారితో పోరాడుతాను” అన్నాడు. మరునాడు భీష్ముడు కౌరవ సేనలు శంఖములు పూరించగానే పాడవులు తమ శంఖములు పూరించారు. భీష్ముడు విజృంభిస్తూ అర్జునుని మీదకు రథం నడిపాడు. ఇరు వర్గాల మధ్య పోరు ఘోరమైంది. హుంకారములు, అదలింపులు, రంకెలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరాలాపములు చేస్తూ సైన్యాలు వీర విహారం చేస్తున్నాయి. విరిగిన రధములు, మొండెములు, రక్తపు మడుగులు, పడిన గుర్రములు, తలలు తెగిన ఏనుగులు మొదలైన వాటితో యుద్ధ భూమి భీకరంగా ఉంది. సైన్యంలో కొంత మంది అక్కడ తిరగడం ఇష్టం కాక దూరంగా గుంపులుగా నిలిచి చూస్తున్నాయి. భీష్ముడు భీకరాకారంతో అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. అతడి ఒక్కొక్క బాణంలో వేయి బాణములు పుడుతున్నాయి. పాండవసేనలను తుత్తునియలు చేస్తున్న భీష్ముని ఎదిరించడం ఎవరి శక్యం కావడం లేదు. ప్రళయకాల రుద్రుని వలె ఉన్న భీష్ముని చూసి పాండవ సేనలు భయభ్రాంతమయ్యాయి. ఇది చూసిన శ్రీ కృష్ణుడు “అర్జునా! ద్రోణ, కృపాచార్య సహితంగా భీష్ముని మట్టు పెట్టగలనని చెప్పి ఇలా చూస్తూ ఊరుకున్నావేమి?” అన్నాడు. అర్జునుడు “అలా అనకు బావా. రధమును భీష్ముని ఎదుటికి పోనిమ్ము. అతడి పని పడతాను ” అన్నాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML