తొమ్మిది, పది శ్లోకాల ఉపోద్ఘాతం - రెండవ భాగం
కుండలినీ యోగం కష్టమే! అయితే భక్తి జ్ఞాన యోగ మార్గాల్లో సాధకుడు సులభంగా తుదిగమ్యాన్ని చేరగలుగుతున్నాడా అని ప్రశ్నించవచ్చు. ఇది సముచితమైన ప్రశ్నే. అయితే ఆ సాధనా మార్గాలు కుండలినీ యోగమంతటి క్లిష్టతరమైనవి కాదు. ఆయా మార్గాలలో పయనిస్తుంటే తప్పులు దొర్లినా విపరీత ఫలాన్నీయవు. భక్తులకు, జ్ఞాన మార్గంలో ఉన్నవారికి కూడా అంబిక తన శక్తిని ఎఱుకపరుస్తుంది. ఆ భక్తునికో, ఆ సాధకునికో ఆ శక్తుల మీద ఇచ్ఛలేదు. అంబిక పాదాలపై చిక్కటి అనురాగంతో భక్తుడు ఆనందాంబుధిలో ఓలలాడుతుంటే,అనంతమైన శాంతితో నిశ్చలునిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా నిర్మల హృదయులైన వీరికి లోకక్షేమార్థం అంబిక కొన్ని శక్తులను అనుగ్రహిస్తుంది. ఆ శక్తులను వారు తమ ప్రయోజనాలకు ఉపయొగించుకోరు. ఆర్తులనెవరినైనా చూసి వారి కష్టానికి వీరి హృదయం కరిగినపుడు అంబికానుగ్రహాన ఆ అర్తులకు కష్టాలు తీరుతాయి.
కుండలినీ యోగం చేసేవారిలో ఎక్కువమంది రాజసంతో ఏవో కొన్ని శక్తులు సంపాదించి చూపాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. ఆ శక్తులకై వారు చెల్లించాల్సిన మూల్యం అంబిక గట్టిగా బేరం చేసి మరీ పుచ్చుకొంటుందా అనిపిస్తుంది. పరాశక్తి జీవిని నిశ్చల నిర్మల తత్త్వమైన పరబ్రహ్మలో లయం చేయడం కంటే మహాశక్తి స్వరూపమైన తన తత్త్వంలో కలుపుకోవడం కష్టతరంగా కల్పించింది. ఎలాగూ తుది గమ్యం ఏ మార్గంలో అయినా పరబ్రహ్మానుసంధానమే! మనలో లక్షకొకరు కుండలినీ యోగసాధనలో సరియైన దిశలో పయనిస్తే కోటికోకరు ఉత్తీర్ణత సాధించగలరేమో!
గీతలో భగవానుడు భక్తి యోగ మార్గాల గురించి –
*నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోద్భయాత్*
అంటారు. ఈ మార్గంలో చేసిన ప్రయత్నమెప్పుడూ వ్యర్థమవదు. విపరీత ఫలాన్నీయదు. ఈ మర్గంలో చేసిన స్వల్ప ప్రయత్నమైనా మహాభయం నుండి రక్షిస్తుంది. కుండలిని యోగ విషయంలో ఇది కుదరదు. అందులో ఉన్న అగాధాలని దాటే ప్రయత్నంలో నిస్పృహ చెంది. ఎక్కువశాతం సాధకులు ప్రయత్నాన్ని విరమిస్తారు. మళ్ళీ కుండలిని మామూలుగా యథాస్థానం చేరుతుంది. ప్రయత్నమంతా వృథా అయిపోతుంది. కొంచెం సాధన తప్పుదోవ పట్టిందా – విపరీత ఫల రూపంలో ప్రత్యవాయం కూడా సిద్ధిస్తుంది. తుదివరకూ తన ప్రయత్నం పై తనకు నమ్మకం లేక మహాభయాన్ని కలగజేస్తుంది.
సిద్ధి అనే విషయం అటుంచి ఈ యోగంలో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. సాధకునికి మూలాధారంలో కుండలిని కదలిక ఆరంభమవగానే ఆ శక్తి సహస్రారం చేరిందనే ఆలోచన కలుగుతుంది. కొంచెం ఒకటి రెండు చక్రాలు తిరిగి వచ్చిందా, తద్వారా కల్గిన అల్ప శక్తులను చూసుకొని తానిక సిద్ధుడ్నయిపోయాననుకొంటాడు. ఇది సప్త ప్రాకారాలతో కూడి ఉన్న గుడిలో మొదటి గాలి గోపురాల్లో ప్రవేశించి గర్భగుడిలోనికి చేరాననుకోవడం వంటిది. సాత్వికతను పెంపొందించే భక్తి జ్ఞాన మార్గాలలో ఈ ఇబ్బంది లేదు. భక్తి జ్ఞాన మార్గాలు ద్వారా పొందలేని పరిపూర్ణత ఈ కుండలినీ యోగం వల్ల సిద్ధించదు. పరిపూర్ణత ఏ మార్గంలోనైనా ఒకటే!
ఎవరైనా కాంచీపురం కామాక్షీ గుడికి వెళ్ళడమెలాగని అడిగారనుకోండి. బ్రాడ్వేకి వెళ్ళి బస్సు ఎక్కితే కామాక్షీ గుడి సమీపంలోనే బస్సు ఆగుతుందని చెబుతాం. అంతేకాని తిరువట్రియూరు దేవాలయంలోని పల్లవుల కాలం నాటి సొరంగం నేరుగా కాంచీపురం కైలసనాథర్ దేవాలయంకి చేరుతుంది. అక్కడ నుండి ఒక అరమైలు దూరంలోనే కామాక్షీ గుడి ఉన్నదని చెబుతామా! అలాంటి సొరంగం ఉండి ఉండవచ్చు. కానీ దానిలో నుండి పోగల సాహసం చేయగల వారెవ్వరు ? దానిని గురించి తెలుసుకోవడం వల్లన మన పూర్వీకుల నైపుణ్యం పైన అబ్బుర పాటు కలుగుతుంది. కానీ ఆ మార్గాన్ని సాధారణ మానవుడు ఉపయోగించుకోలేడు.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి