దుర్వాస మహర్షి తన భార్య అయిన ' కదళి ' తో ఒక పర్ణశాలలో నివశిస్తూ , జపతపాదులు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ .అందువల్ల 'కదళి ' నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయనకోపానికి గురికాకుండా ఉంటుండేది.
ఒక సాయంసంధ్యా కాలంలో దుర్వాసమహర్షి ఎంతో అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు. వెంటనే గాఢనిద్రలోకి జారు కున్నాడు. ఆయన అర్ధాంగి అయిన ' కదళి ' ఎంతో సేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి, సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందన్న భయంతో , ఆయన్ను లేపడంతన కర్తవ్యంగా భావించి , ఆదమరచి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి నిద్రలేపింది.
నిద్రాభంగం కలిగినందున పరమకోపిష్టి ఐన ఆయన పట్టలేని ఆగ్రహంతో , కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన నేత్రాలనుండీ వెలువడిన అగ్నిజ్యాలలకు ఆమె భస్మమైపోయింది. ముందువెనుకలు ఆలోచించక తాను కోపం తెచ్చుకోడం వలన జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు. చేసేదేంలేక మౌనంగా ఉండిపోయాడు.
ఐతే కొన్నిదినాల తర్వాత దుర్వాసుని మామగారు, తన కుమార్తెను చూసేందుకై ఆశ్రమానికి వచ్చాడు. ఆయన తనకుమార్తె గురించీ అడగ్గా, దుర్వాసుడు మామగారు తనకు శాపమిస్తాడనే భయం తో మెల్లగా జరిగిన విషయమంతా చెప్పి, క్షమించమని కోరి, తన తపోశక్తితో ఆభస్మం నుండీ , ఒకచెట్టును సృష్టించాడుట. అదే కదళీ వృక్షం ,అంటే అరటిచెట్టు.
దుర్వాసుడు తన మామగారితో " మీ కుమార్తె -' కదళి -'అందరికీ ఇష్టురాలై' కదళీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదన కే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ , నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందు తుందని వరమిచ్చాడుట!
ఆ కదళీ ఫలాన్ని [ అరటి పండును] మనం కడిగి దేవునిముందుంచి కొద్దిగా తొక్క తీసి ' కదళీఫలం సమర్పయామి ' అంటూ నివేదన చేస్తాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి