.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

కాంచీ - కామకోటి



కాంచీ - కామకోటి
కామకోట్ణీం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరాం

శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః ||




శ్రీమద్భాగవతంలోని ‘కామకోట్ణీంపురీం’ అనీ ‘కామకోటిపురీం’ అనీ పాఠభేదాలతో కాంచీనగరంలోని కామకోటి ప్రశంస కానవస్తున్నది. దీనివలన ఈ పీఠం యొక్క ప్రాచీనత్వం తెలుస్తున్నది. అంతేకాక భారతదేశంలో ప్రసిద్ధికాంచిన అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ముఖ్యమైన పీఠత్రయంలో కామకోటికి ప్రథమస్థానం ఇవ్వబడింది. ప్రాచీన తమిళ గ్రంధాలలో కూడా కరికాలచోళుడు ‘కామకోటి’ అని ‘కామకొష్టం’ అని ఉదహరించినట్లు కనిపిస్తుంది. కామకోటికి నిలయమైన కంబలభూదేవికి కాంచీ మేఖలగా ఒడ్డాణంగా వర్ణిస్తారు.




మోక్షదాయకమైన సప్త క్షేత్రములలో కాంచి ఒకటి. భౌగోళికంగా కూడా కాంచి నాభిప్రదేశంలోనే ఉంది. బెంగాలీ విశ్వనిఘంటువులో కాంచి ఒక మాహాపీఠస్థానమనీ అక్కడ కామాక్షి ఆలయంలో నిలువెత్తు ఆదిశంకరుల విగ్రహం వుందనీ, అది వారి సమాధిస్థలమనీ వ్రాయబడివుంది. రాజచూడామణి మఖి వ్రాసిన శంకరాభ్యుదయములో గ్రంధాంతమున, ఆదిశంకరులు కంపాతీరవాసికి కామాక్షిని అర్చించి బ్రహ్మానందం పొందారని ఉన్నది. దక్షిణాదిని ప్రచారంలో ఉన్న శంకరవిజయవిలాసమనే గ్రంథంలో కాంచీనగరంలో అదిశంకరులు సర్వజ్ఞపీఠం నెలకొల్పి షణ్మతస్థాపనాచార్యులయ్యారని వ్రాయబడి వున్నది. కేరళదేశంలో గోవిందనాథ రచితమైన శంకరాచార్య చరిత్రకు బహుళప్రచారం. దానిలో ఆదిశంకరులు తమ దిగ్విజయ యాత్రలన్నీ ముగించుకొని కంచీనగరానికి చేరినట్లు చెప్పబడినది.




ఆదిశంకరులు కైలాసంనుంచి తెచ్చిన లింగ పంచకములలో ఒకదానిని శిష్యుడు సురేశ్వరాచార్యుల కిచ్చారని, కంచిలో శ్రీచక్రస్థాపన చేశారనీ, షణ్మతస్థాపన కూడా కంచినుంచే చేశారనీ స్పష్టంగా ఆనందగిరీయ శంకరవిజయంలో ఉన్నది. ఇవేకాక శివరహస్యం, మార్కండేయ సంహిత మొదలైన ప్రామాణిక గ్రంథాలు కూడా ఆదిశంకరులకూ కంచి కామకోటిపీఠానికి గల అనాది సంబంధాన్ని స్పష్టంగా వివరించినవి.




కామకోటి సమస్థమైన కోరికలకు అవధి, అంచు. ఈ విషయాన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. ఆ తల్లిని కామాక్షిని నమ్ముకుంటే సమస్తములైన కోరికలనూ పొందవచ్చు. పోగా కోరికల అవధిని, అనగా అంతమునూ పొందవచ్చు. అంటే కోరికలులేని నిష్కామస్థితి లభిస్తుందన్నమాట. పురుషార్థములలో కామము మూడవది. అది ధర్మార్థములకు పైది. అట్టి కామకోటి అనగా కామము అంచు మోక్షమే కదా అట్టి మోక్షం మోక్షపురి కంచిలో నెలకొన్న కామకోటి ప్రసాదిస్తుందని పండితార్థం. శ్రీకామకోటీని ఆశ్రయించినవారి కోర్కెలు కోటి గుణితములుగా ఫలించగలవు.




కామానాం వర్ణతాత్పర్యాత్తత్కోటి గుణసంఖ్యాయా

కామకోటోతి విఖ్యాతం కామకోష్ఠ ధరాతలమ్

అథ కామస్తృతీయోర్థం పురుషార్థేషు విశ్రుతః

తత్పరస్తా చ్ఛృతో మోక్షః కోటిశబ్ధేన శబ్దితః

కామకోటి స్మృతో మోక్షః పురుషార్థ తురీయకః




ఈ కామకోటి పీఠాధిష్ఠాతృశక్తి భగవతి కామాక్షి, ఆమె కంపానదీతట విహారిణి. ఏకామ్రనాథుని కుటుంబిని. శ్రీచక్రస్వరూపిణి. సకలలోకైక జనని. ఆమ్రతరుమూల వాసిని. ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములనే ఆ మామిడి చెట్టు శాఖాచతుష్టయములో నాలుగు రుచులలో పండించి అడిగినవారికి పంచిపెడుతుందట. ఆమె కటాక్షమునకు నోచుకున్న భాగ్యశాలి మూగియైననూ వాగ్మికాగలడు. అతడు శత్రుమిత్రులనూ, లోష్టమునూ యువతిబింబోష్ఠమునూ సమదృష్టితో చూడగలడు. ఆమె కరుణాస్రవంతికి అవధులు లేవు.




ఆ తల్లి చల్లని గొడుగు నీడలో ఇంద్రసరస్వతి బిరుదుతో శ్రీశంకరాచార్య పరంపర అవిచ్ఛిన్నంగా జగత్కల్యాణసంధాయకముగా నేటివరకూ ప్రవర్థమానమవుతూ లోకాన్ని కటాక్షిస్తూవుంది. ఈ పీఠాచార్యులు సరస్వతీ సంప్రదాయమునకు చేరినవారు. ఇంకొక భారతీ సంప్రదాయము మరొకటి ఉన్నది. ఆదిశంకరులచేత ఓడింపబడిన తరువాత మండనమిశ్రులకు అసాధ్యమైన శిరోవేదన కలిగిందట. ఎంత చికిత్స చేసినా ఉపయోగం లేకపోయింది. తర్వాత ఆచార్యులవారి కోరికపై అశ్వినీదేవతలు వచ్చి చికిత్స చేశారట. ఇంద్రుని అనుమతి వారు పొందనిదానివలన వారిపై ఇంద్రునికి ఆగ్రహం వచ్చింది. అనంతరం పశ్చాత్తాపపడి శంకరభగవత్పాదులను ప్రశంసించి వారి ధర్మ జగత్తులో తమ ఇంద్రసామ్రాజ్యాన్నీ కలుపుకోమని ఇంద్రుడు ప్రార్థించాడట. ఆనాటినుండి ఆ పీఠాధిపతులందరూ ఇంద్ర సరస్వతులని వ్యవహరింపబడుతూ వచ్చారు.




శ్రీ గీర్వాణేంద్రసరస్వతి, గంగాధరేంద్రసరస్వతి, పరమేశ్వరేంద్రసరస్వతి, సదాశివేంద్రసరస్వతి మొదలైన యతీశ్వరులీ ఇంద్రసరస్వతి సంప్రదాయానికి చేరిన మహిమాన్వితులు. ఆదిశంకరులకు గోవింద భవత్పాదులు ఉపదేశించిన మహావాక్యదీక్షా విధానమే ఇంద్రసరస్వతీ కోవకు చెందిన యతులకు కూడా ఆశ్రమస్వీకార సమయమున వరణీయమై ఉన్నది. ఈ పవిత్రమైన సంప్రదాయములో 68వ పీఠాధిపతులు పూజ్యచరణులు, పరమశివస్వరూపులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములు.




ధర్మసంస్థాపనతో పాటు ఈ గురుపరంపరకు చెందిన యతీశ్వరులు చేయవలసిన మరొకకార్యమున్నది. శ్రీరంగం దగ్గర్లోని తురువనైక్కావల్ జంబుకేశ్వరాలయం కంచికామకోటి ఏలుబడిలోనిది. అక్కడి అమ్మవారు ‘అఖిలాండేశ్వరి’ . ఆదిశంకరులు ఆ మూర్తిలోని ఉగ్రకళను తీసివేసి నవరత్న ఖచితమైన శ్రీచక్రతాటంకములను ఆమె చెవులకు అలంకరించారట. అవి జీర్ణమైనప్పుడల్లా కామకోటి పీఠాధిపతులు వెళ్ళి వానిని బాగుచేయించారు.🌹

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML