సంప్రదాయం - సమస్య
చాలాసంవత్సరాల క్రితం ఉషోదయకాలంలో కాంచీపురం శ్రీమఠం. ఆ రోజు చాలామంది భక్తులు లేరు. పరమాచార్య స్వామివారు దర్శనం ఇస్తున్నప్పుడు దేవతలా నగలు వేసుకుని అలంకరించుకున్న ఒక సుమంగళి నేరుగా స్వామివద్దకు వెళ్ళి నమస్కరించింది. అశ్రుపూరిత నయనాలతో లేచి నిలబడింది.
పరమాచార్య స్వామివారి మార్గదర్శనం కోసం ప్రార్థిస్తోంది. బహుశా ఏదో విపరీతమైన వ్యక్తిగత సమస్య అయ్యింటుంది. కళ్ళతో అర్థిస్తూ, వణుకుతున్న పెదాలనుండి వస్తున్న మాటలతో, "ఒక్క క్షణం కూడా నాపై మీ అనుగ్రహదృష్టి ప్రసరించరా? కనీసం నా ప్రార్థన కూడా ఆలకించరా అని వేడుకుంటోంది". ఆ కరుణామయుడు ఆమె ప్రార్థనను వినాలనుకుంటున్నారు. కాని పక్కన ఎవరితోడు లేకుండా ఒంటరి ఆడవారి మాటలను వినరాదన్న పీఠ నియమానికి కట్టుబడి ఉన్నారు. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుండగా నిస్సహాయురాలై అక్కడే నిలబడి ఉంది. ఆమె తప్పుకుంటే కాని ఇతర భక్తులు స్వామివారు దర్శనానికి రాలేరు. మరి అలా ఎంతసేపు అడ్డగించగలదు? స్వామివారు చేతి సంజ్ఞతో ఒక పరిచారకుణ్ణి రమ్మని పిలిచారు.
"ఇక్కడ పూర్తి చవిటివాడు ఎవరైనా ఉన్నారేమో చూడు" అని అన్నారు. సహాయకుని అదృష్టం కొద్దీ ఒక చవిటివాడు దొరికాడు. "నేను చెప్పేది విను. ఆ చవిటివాడు ఈమెతో కలిసి రాగానే నువ్వు చప్పట్లు చరిచి అతణ్ణి పేరుతో పిలువు. అతని ప్రతిక్రియను బట్టి అతను నిజంగా చవిటివాడో కాదో నీకు అర్థం అవుతుంది"
పరమాచార్య స్వామివారి సలహా అమోఘం. ఎవర్నో ఒకడిని తీసుకునిరావాలని నిజంగా చవిటివాణ్ణి కానివాడిని ఆ శిష్యుడు తీసుకునివస్తే. అప్పుడు కుటుంబ కష్టాలు చెప్పాలనుకున్న ఆమెకి హానికారం కదా! కనుక ఈ సలహా మహాస్వామివారు ఇంకొక శిష్యునికిచ్చారు కనిపెట్టమని. ఆ చవిటివాడు పక్కనుండగా ఆమె తన కష్టాన్నంతా స్వామివారికి చెప్పుకుంది. పరమాచార్య స్వామివారు ఓపికగా అంతా విని ఆమెను అనునయించారు. ఇప్పుడు కూడా ఆమె ఏడుస్తోంది, సంతోషంతో!! ఆమె ప్రసాదం తీసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోయిన తరువాత ఆ చవిటివాణ్ణి కూడా వెళ్ళమని చెప్పారు స్వామివారు.
ఎటువంటి పరిస్థుతులలోనూ సన్యాసాశ్రమ ధర్మాలను తప్పేవారు కాదు స్వామివారు. అలా అని నమ్మిన భక్తులను కరుణించడంలో ఏమాత్రమూ అలసత్వం చూపేవారు కాదు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి