సర్వం శక్తిమయం జగత్.
🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆🐆
'సర్వం శక్తిమయం జగత్' అని భక్తులు విశ్వసిస్తారు. శక్తి లేనిదే సృష్టి లేదు. శక్తి లేనిదే ఏ ప్రాణీ చైతన్యం పొందలేదు. పరాశక్తి లేకుండా, ఈశ్వరుడైనా అశక్తుడే! మానవాతీత మహత్తర శక్తిని భగవత్ స్వరూపంగా వర్ణిస్తున్నాయి శాస్త్రాలు. జ్యోతి స్వరూపిణి అయిన పరాశక్తిని కొలిచి, మహర్షులు దివ్యశక్తుల్ని సముపార్జించారు. జ్ఞాన సంపన్నులై లోకానికి అపురూపమైన ప్రబోధాలు చేశారు.
జ్ఞాన, శక్తి, ఆనందాలకు మూలాధారుడు- భగవంతుడు. ఆయనను ఆరాధించడానికి, పలు దివ్యశక్తుల్ని సాధించడానికి భక్తి ఒక్కటే ప్రధాన సాధనమని వేదం చెబుతుంది. మూలశక్తి 'గాయత్రి'. అంటే, గానం చేసేవారిని రక్షించే శక్తి అని అర్థం. చిత్ శక్తికి, జీవశక్తికి మూలాధారం గాయత్రి. ఇందులో శబ్దబ్రహ్మం ఉంది. దీని బాహ్యరూపం- ప్రణవం. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలుంటాయి. అవన్నీ ఆరు దివ్యశక్తులకు ప్రతీకలు. అవి: పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి, మాతృకా శక్తి.
శక్తులన్నింటికీ మూలాధారమైన, మహిమాన్వితమైన పరంజ్యోతి స్వరూపమే పరాశక్తి. జ్ఞానశక్తి అనేది సకల విద్యలకూ ఆధారం. సత్వ రజో తమో గుణాలకు అతీతులైన తరవాత- జ్ఞానశక్తి ద్వారా దూరదృష్టి, అంతర్ దృష్టి, అంతర్ జ్ఞానం పొందగల సిద్ధులవుతారు. జ్ఞానశక్తికి గల గౌరవం అపారమని వేద పురాణాలు చాటి చెబుతున్నాయి.
జ్ఞానం మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. 'తమసోమా జ్యోతిర్గమయ' అనే సూత్రానికి భాష్యాన్ని అది అభివ్యక్తం చేస్తుంది. విద్య, ధనం, పదవి- వీటిని జ్ఞానం లేకుండా ఆర్జించలేం. ఐహిక వాంఛల్ని విడిచి, ఆముష్మిక పథం వైపు నడిపించే ఆత్మజ్ఞానానికి జ్ఞానమే తొలి సోపానం. అర్జునుణ్ని గీతాచార్యుడు జాగృతం చేసింది ఈ జ్ఞాన బోధతోనే!
ఇచ్ఛాశక్తి ద్వారా సాత్విక ఇచ్ఛాశక్తి కార్యరూపం ధరిస్తుంది. కోరిన సత్ఫలితాలనిస్తుంది. ఏకాగ్రత, శ్రద్ధ వల్లనే ఈ శక్తి సిద్ధిస్తుంది. సాత్విక, ఆధ్యాత్మిక, క్రియాశక్తుల వల్ల మనిషి- యోగి, పరమ యోగి కాగలడు. క్రియాశక్తి వల్ల శరీరంలో తరంగాలు ఉత్పన్నమవుతాయి. సత్వగుణం తోడైనప్పుడు ఈ శక్తి మనిషిలో శాంతిని, లోక హిత భావనను వృద్ధి చేస్తుంది. కుండలినీ శక్తికి సమష్టి, వ్యష్టి అని రెండు రూపాలుంటాయి. సృష్టిలోని జీవశక్తి ఈ రెండు రూపాల్లోనూ వృద్ధి చెందుతుంటుంది. కర్మను అనుసరించి ఈ శక్తి బాహ్యంగా, ఆంతరంగికంగా సమానమైన ప్రభావం చూపుతుంటుంది. మానవ శరీరంలో అంతర్గతంగా గల తేజమే కుండలినీ శక్తి. ఇది పంచప్రాణాల ఉనికిని కాపాడుతుంది. దీని ద్వారా ఇంద్రియాలు, మనసు నిరంతరం చైతన్యవంతమై ఉంటాయి. సాత్విక గుణంతో మాయాబంధం నుంచి విముక్తి కలిగించి, మనసును శివోన్ముఖం చేయడంలో ఈ శక్తి ప్రమేయం అపారం. యోగాతో ఈ శక్తిని వికసింప జేసుకోవచ్చు.
అరిషడ్వర్గాలను జయించకుండా- అహింస, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, సంతోషం, తపం వంటివాటితో హృదయాన్ని వికసింప జేయలేం. కేవలం బాహ్య ప్రక్రియలైన హఠ యోగం వంటివి సాధన చేసినంతమాత్రాన, ఈ శక్తి జాగృతం అవుతుందని భావించలేం. ఆధ్యాత్మిక దృక్పథం లేకుండా ఎవరూ పరిణతి, పరిపక్వత సాధించలేరు.
వలం హఠయోగ సాధకులకు హృదయంలోని అష్టదళ పద్మంలో విరాజిల్లే మహా విద్య అందదు. సద్గురు కృపతో రాజయోగులు- ఆ మహా విద్యను పొందగలరు. మాతృకా శక్తిపై అక్షరం, బీజాక్షరం, శబ్దం, వాక్యం, గానం, మంత్రశాస్త్రంలోని మంత్రాల ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆ శక్తిపై ఆధారపడినవే. దాని వల్ల ఇచ్ఛ, క్రియా శక్తులు ఫలవంతమవుతాయి. మాతృకా శక్తి లేకుండా ఆధ్యాత్మిక భావనా పటిమ జాగృతం కాదు.
శబ్దమే సృష్టికి మూల కారణం. సృష్టిలోని అన్ని నామాలూ ఈ శక్తికి రూపాంతరాలు. నియమ రహితులకు మాతృకా శక్తి సాధన సాధ్యం కాదు. పరస్పర సంబంధం కలిగిన దివ్యశక్తులివి. సాధకులు కొన్నింటినైనా పొందగలిగే ప్రయత్నం చేయగలిగితే- మానవజన్మకు ఓ అర్థం, పరమార్థం లభిస్తాయి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి